క్రేజీ ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టిన సూపర్ స్టార్ డైరెక్టర్స్!
రజనీ మాదిరిగానే ఆయనతో సినిమాలు చేస్తున్న దర్శకులు కూడా ఫుల్ జోష్ లో ఉన్నారు.
By: Tupaki Desk | 16 Oct 2024 12:30 AM GMTసూపర్ స్టార్ రజనీకాంత్ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ, బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతున్నారు. 73 ఏళ్ల వయసులోనూ రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తున్నారు. గతేడాది జైలర్ తో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన తలైవా.. దసరా స్పెషల్ గా వేట్టయన్ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ప్రస్తుతం కూలీ మూవీలో నటిస్తున్నారు. రజనీ మాదిరిగానే ఆయనతో సినిమాలు చేస్తున్న దర్శకులు కూడా ఫుల్ జోష్ లో ఉన్నారు.
'జై భీమ్' ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రజినీకాంత్ కథానాయకుడిగా నటించిన చిత్రం 'వేట్టయన్: ద హంటర్’. అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, రితిక సింగ్ వంటి స్టార్ కాస్టింగ్ ఈ మూవీలో భాగం అయ్యారు. ఇటీవలే థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. తెలుగులో పెద్దగా ప్రభావం చూపకపోయినా, తమిళ్ లో మాత్రం బాగా ఆడుతున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా 240 కోట్లు కలెక్ట్ చేసినట్లుగా మేకర్స్ వెల్లడించారు.
'వేట్టయన్' తర్వాత టీజే జ్ఞానవేల్ ప్రాజెక్ట్ ఆల్రెడీ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. తమిళ స్టార్ హీరో సూర్యతో సినిమా చేయబోతున్నట్లు రీసెంట్ ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు వెల్లడించారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. నిజానికి వేట్టయన్ కంటే ముందే 'జై భీమ్' కాంబోలో మూవీ చెయ్యాల్సింది. కానీ రజనీ కాంత్ తో ఆఫర్ రావడంతో, సూర్య అనుమతి తీసుకొని ఆ సినిమా పనులను హోల్డ్ లో పెట్టారు. ఇప్పుడు తిరిగి స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేయబోతున్నారు.
లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్ లో రజనీ 'కూలీ' అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కింగ్ అక్కినేని నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, శృతి హాసన్ వంటి పాపులర్ స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ను వీలైనంత త్వరగా పూర్తి చేస్తానని దర్శకుడు చెబుతున్నారు. దీని తర్వాత లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో వరుసగా సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. ఎల్సీయూలో ఉన్న హీరోలందరితో ఓ భారీ మల్టీస్టారర్ చేస్తానని ఇటీవలి ఇంటర్వ్యూలో చెప్పారు. 'ఖైదీ 2', 'రోలెక్స్' చిత్రాలు లైనప్ లో ఉన్నట్లు లోకేష్ తెలిపారు.
రజనీకాంత్ తో 'జైలర్' సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్.. ప్రస్తుతం 'జైలర్ 2' స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు. ఇదే విషయాన్ని దర్శకుడు ఓ ఇంటర్వ్యూలో కన్ఫర్మ్ చేసాడు. 'కూలీ' షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత సూపర్ స్టార్.. తన క్రేజీ సీక్వెల్ సెట్స్ లో అడుగుపెట్టే అవకాశం ఉంది. త్వరలోనే దీనికి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్ మెంట్ వస్తుందని కోలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఇలా రజనీతో పాటుగా ఆయన దర్శకులు కూడా క్రేజీ ప్రాజెక్ట్స్ లైన్ లో పెడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.