74 వయసులోను రజనీ ఇలా ఉన్నారంటే!
70 పైబడిన వయసులోను సూపర్‌స్టార్ రజనీకాంత్ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఆయన వరుస సినిమాల్లో నటిస్తూ పెద్ద తెరను ఏల్తున్నారు.
By: Tupaki Desk | 7 Feb 2025 11:30 PM GMT70 పైబడిన వయసులోను సూపర్‌స్టార్ రజనీకాంత్ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఆయన వరుస సినిమాల్లో నటిస్తూ పెద్ద తెరను ఏల్తున్నారు. ఇప్పటికీ 100 కోట్లు పైగా పారితోషికం అందుకునే హీరోగా రజనీ గుర్తింపు దేశంలో ఎక్కడా తగ్గలేదు. లోకేష్ కనగరాజ్ `కూలీ` తర్వాత `జైలర్ 2`లోను ఆయన నటిస్తున్నారు.
అయితే ఎప్పటికీ ఏజ్ లెస్ హీరోగా కనిపించడానికి, సానుకూలతను వ్యాప్తి చేయడానికి రజనీకి సహకరించినది ఏది? ఆ రహస్యం ఏమిటో తెలుసుకోవాలని కోట్లాదిగా ఉన్న అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పుడు ఆ రహస్యం గుట్టు రజనీకాంత్ స్వయంగా తానే చెప్పారు. ఆయన ఈ వయసులోను ఎలాంటి ఆందోళనలు లేకుండా ప్రశాంతంగా ఉండటం ద్వారా ఆరోగ్యంగా ఉన్నారు. దానికి కారణం గురువు సమక్షంలో ధ్యానం, క్రియా యోగాను అనుసరించడం.
అయితే క్రియా యోగా అంత సులువేమీ కాదు. అది నేర్చుకునేందుకు తనకు సుమారు 10-12 సంవత్సరాలు పట్టిందని రజనీకాంత్ అన్నారు. తాను ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆశించినది సాధించలేకపోయానని, ఆరంభం ప్రశాంతత రాలేదని, ఫలితం దక్కలేదని రజనీ అన్నారు. పది సంవత్సరాల తర్వాత మాత్రమే నేను దానిని ఆస్వాధిస్తున్నానని తెలిపారు. 2002లో ప్రారంభించిన క్రియా యోగా ఇన్నేళ్ల తర్వాత వర్కవుటైందని రజనీ చెప్పడం ఆశ్చర్యపరిచింది. రజనీకాంత్ ప్రతి సంవత్సరం రాంచీలోని వై.యస్.ఎస్ ఆశ్రమాన్ని సందర్శిస్తానని అన్నారు. రజనీకాంత్ మాట్లాడుతూ, ``నేను రాంచీలోని ఆశ్రమంలో ఉన్నాను. నేను ఇక్కడికి రావడం ఇది మూడోసారి. నేను 2002లో మొదటిసారి ఇక్కడికి వచ్చాను`` అని తెలిపారు. ``గురువు కృప వలన నాకు ఇక్కడ రెండు రోజులు గడిపి ఆశ్రమాన్ని బాగా చూసే అవకాశం లభించింది. ముఖ్యంగా గురువు గారి గదిలో కూర్చుని ధ్యానం చేసే అవకాశం నాకు లభించింది. నిన్న ఒక గంట ధ్యానం చేసాను. నేను ధ్యానంలో గడిపిన సమయాన్ని వర్ణించడం సాధ్యం కాదు. ఆ ఒక గంట ఎలా గడిచిందో నాకు తెలియదు. ధ్యానం నుండి బయటకు వచ్చినప్పుడు మాత్రమే ప్రజల గురించి తెలుస్తుంది. నేను చాలా సంతోషంగా ఉన్నాను`` అని రజనీ అన్నారు.
నన్ను కలిసినప్పుడు ఎవరైనా సానుకూలతను పొందుతామని చెబితే దాని వెనక రహస్యం నేను క్రియ (యోగా) సాధన చేస్తాను. నేను క్రియ సాధన చేయడం ప్రారంభించినప్పటి నుండి, నాలో జరిగిన మార్పును ఎలా వర్ణించాలో నాకు తెలియదు. ఇది ఒక రకమైన నిశ్శబ్దం అని ఆయన వివరించారు. 21 సంవత్సరాలుగా క్రియా యోగా చేస్తున్నాను.. ఆరంభం నేను చేస్తున్నా కానీ మార్పు కనిపించలేదు! దాదాపు పది సంవత్సరాల తర్వాత ఇది సాధ్యమైందన రజనీ అన్నారు. ఫలితం దక్కినా దక్కకపోయినా ప్రారంభించాను కాబట్టి కొనసాగించాలనుకున్నానని రజనీ తెలిపారు. ప్రాపంచిక విషయాల నుంచి వేరుగా చేసేది క్రియా యోగా. దానిని అనుభవిస్తున్నానని రజనీ అన్నారు. ప్రయత్నం చేయకుండానే, అన్నీ వాటంతట అవే జరుగుతాయి అని ఆయన దాని ప్రయోజనాలను వివరించారు.
ఎక్కడైనా గురువులు ఒకసారి మన చేయి పట్టుకుంటే మనం విడిచిపెట్టినా వారు వదలరు. వారు మనల్ని తమతో పాటు తీసుకువెళతారు. క్రియ శక్తి, దాని గురించి తెలిసిన వారికి తెలుసు. తెలియని వారికి ఇది ఒక రహస్య సాంకేతికత అని రజనీకాంత్ అన్నారు. ఇది తెలిసిన వారు చాలా అదృష్టవంతులు. ఇది తరతరాలుగా కొనసాగే బంధం. మీరు క్రియ చేసినప్పుడు మాత్రమే దాని ప్రభావం మీకు తెలుస్తుందని అన్నారు. ప్రతియేటా తాను ఆశ్రమాన్ని సందర్శిస్తానని రజనీ ఈ సందర్భంగా చెప్పారు.