Begin typing your search above and press return to search.

ఆ హీరో దివాళా తీసి ఇల్లు వేలం వేస్తే జ‌నం న‌వ్వుకున్నారు!

బాలీవుడ్ లో బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్.. సౌతిండియాలో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్.. మెగాస్టార్ చిరంజీవి.. ఆ ముగ్గురి స్థాయిల్లో స‌మానత్వం గురించి ఎల్ల‌పుడూ ప్ర‌జ‌ల్లో చ‌ర్చ సాగుతుంటుంది.

By:  Tupaki Desk   |   21 Sep 2024 7:30 PM GMT
ఆ హీరో దివాళా తీసి ఇల్లు వేలం వేస్తే జ‌నం న‌వ్వుకున్నారు!
X

బాలీవుడ్ లో బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్.. సౌతిండియాలో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్.. మెగాస్టార్ చిరంజీవి.. ఆ ముగ్గురి స్థాయిల్లో స‌మానత్వం గురించి ఎల్ల‌పుడూ ప్ర‌జ‌ల్లో చ‌ర్చ సాగుతుంటుంది. ఆ ముగ్గురి మ‌ధ్యా గొప్ప‌ స్నేహానుబంధం గురించి తెలిసిన‌దే. ఒక‌రికోసం ఒక‌రు అతిథి పాత్ర‌లు అయినా చేసేందుకు వెన‌కాడ‌రు. అమితాబ్ బ‌చ్చ‌న్ త‌న సౌత్ స్నేహితుల కోసం వ‌రుస‌గా అతిథి పాత్ర‌లు చేస్తూనే ఉన్నారు. చిరంజీవి, ర‌జ‌నీ సినిమాల్లో అతిథి పాత్ర‌ల‌ను కొన‌సాగిస్తూనే ఇటీవ‌ల ప్ర‌భాస్ క‌ల్కి 2989ఏడిలో త‌న పాత్ర‌తో స‌ర్ ప్రైజ్ చేసారు. అదంతా అటుంచితే ఇప్పుడు బిగ్ బి అమితాబ్ క్రైసిస్ గురించి మాట్లాడుతూ ర‌జ‌నీకాంత్ చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి.

మూడు దశాబ్దాల విరామం తర్వాత రజనీకాంత్‌- అమితాబ్‌ బచ్చన్ ఒకే ఫ్రేమ్‌లో క‌లిసి క‌నిపించ‌బోతున్నారు. అలాంటి ఒక గొప్ప‌ ప్ర‌య‌త్నం `వేట్టైయాన్`. ఈ సినిమా విడుదల కోసం ర‌జ‌నీ, అమితాబ్ ల‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శుక్రవారం చెన్నైలో జరిగిన గ్రాండ్ ఆడియో లాంచ్ లో రజనీకాంత్ ఆ సీనియర్ నటుడికి భావోద్వేగ నివాళి అర్పించారు. మీడియా క‌థ‌నం ప్రకారం.. అమితాబ్ బ‌చ్చ‌న్ తన ఆర్థిక ఇబ్బందుల విష‌యంలో కంబ్యాక్ అవ్వ‌డానికి ఎలా పోరాడారు? అనే దాని గురించి ర‌జ‌నీకాంత్ బ‌హిరంగంగా మాట్లాడాడు.

రజనీకాంత్ మాట్లాడుతూ ``అమితాబ్‌ జీ సినిమాలు నిర్మిస్తున్నప్పుడు పెద్ద నష్టాన్ని చవిచూశాడు. క‌నీసం తన వాచ్‌మెన్‌కు జీతం కూడా ఇవ్వలేకపోయాడు. ఆయ‌న‌ జుహు హోమ్ పబ్లిక్ బిడ్డింగ్‌లోకి వచ్చింది. బాలీవుడ్ మొత్తం అతడిని చూసి నవ్వింది... ప్రపంచం ఎప్పుడూ నీ పతనం కోసం ఎదురుచూస్తుంది. కానీ అత‌డు కేవ‌లం మూడు సంవత్సరాలలో తిరిగి కంబ్యాక్ అయ్యాడు. కేబీసీ ని హోస్ట్ చేసాడు. ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టించాడు. KBC తో మొత్తం డబ్బు సంపాదించి అదే వీధిలోని జుహు ఇంటితో పాటు మ‌రో మూడు ఇళ్లను కొనుగోలు చేసాడు. ఆయన అలాంటి స్ఫూర్తి. అతడి వయస్సు 82 సంవత్సరాలు. అత‌డు ఇప్ప‌టికీ రోజుకు 10 గంటలు పని చేస్తున్నాడు`` అని ఉద్వేగంగా మాట్లాడారు. అమితాబ్ జీ తండ్రి గొప్ప రచయిత. తన ప్రాభ‌వాన్ని ఉప‌యోగించి అమితాబ్ కోసం ఏమైనా చేయగలడు. కానీ కుటుంబ ప్రభావం లేకుండా అతడు ఒంటరిగా పోరాడాడు... ఒకసారి అమితాబ్ జీకి ఘోర ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ఇందిరా గాంధీ విదేశాల్లో ఓ సదస్సుకు వెళ్లారు. ప్రమాదం గురించి తెలుసుకున్న ఆమె వెంటనే ఇండియాకు వచ్చారు. రాజీవ్ గాంధీ, అమితాబ్ జీ కలిసి చదువుకున్నారని అప్పుడే అందరికీ తెలిసింది.. అని గుర్తు చేసారు.

వేట్టయాన్‌లో సత్యదేవ్ అనే పాత్రలో అమితాబ్ నటించారు. రజనీకాంత్ పాత్ర పేరు ఇంకా వెల్లడి కాలేదు. ఇందులో మంజు వారియర్ ర‌జ‌నీ స‌ర‌స‌న‌ క‌థానాయిక‌. ఈ చిత్రంలో రితికా సింగ్ రూప అనే పోలీసు పాత్రలో న‌టించ‌గా, దుషార విజయన్ శరణ్య అనే ఉపాధ్యాయురాలిగా ..రానా దగ్గుబాటి నటరాజ్‌గా .. ఫహద్ ఫాసిల్ ప్యాట్రిక్ గా నటించారు. వేట్టైయన్ తెలుగులోను విడుద‌ల‌వుతుంది. రజనీకాంత్ 170వ చిత్రం వేట్ట‌య్యాన్ దసరా సందర్భంగా అక్టోబర్ 10న థియేటర్లలో విడుదల చేయనున్నారు.