#MeToo గురించి ఏమీ తెలీదనేసిన రజనీకాంత్
మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలపై వేధింపులు, దోపిడీ, అసభ్య ప్రవర్తన గురించి ఆరోపిస్తూ హేమ కమిటీ వెల్లడించిన అంశాలు షాకి గురి చేసాయి.
By: Tupaki Desk | 2 Sep 2024 3:29 AM GMTమలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలపై వేధింపులు, దోపిడీ, అసభ్య ప్రవర్తన గురించి ఆరోపిస్తూ హేమ కమిటీ వెల్లడించిన అంశాలు షాకి గురి చేసాయి. దేశవ్యాప్తంగా ఇప్పుడు దీని గురించి చర్చ సాగుతోంది. కొందరు అగ్ర హీరోలు, దర్శకులపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం మోలీవుడ్‌లో తుఫాన్ వాతావరణాన్ని క్రియేట్ చేసింది. ఇప్పుడు హేమా కమిటీ నివేదికపై రజనీకాంత్ స్పందించారు.
ఆదివారం నాడు..సూపర్ స్టార్ రజనీకాంత్ చెన్నై విమానాశ్రయానికి చేరుకోగా.. అక్కడ ఎదురు చూసిన మీడియా ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించింది. మలయాళ చిత్ర పరిశ్రమలో #MeToo వివాదం గురించి ప్రశ్నించగా, రజనీ స్పందిస్తూ, ``దాని గురించి నాకు ఏమీ తెలియదు.. క్షమించండి`` అని వ్యాఖ్యానించారు.
తాజా మీడియా ఇంటర్వ్యూలో ఫెఫ్సీ ప్రధాన కార్యదర్శి ఉన్నికృష్ణన్ మాట్లాడుతూ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఉందని అంగీకరించారు. ఇంతకుముందే రజనీ కాంత్ సమకాలిక నటుడు మోహన్‌లాల్ అమ్మ (మలయాళ మూవీ ఆర్టిస్ట్‌ల సంఘం) అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. హేమ కమిటీ నివేదికపై ఆయన మౌనం వీడారు. నివేదికను మేము స్వాగతిస్తున్నాము. ఆ నివేదికను విడుదల చేయడంపై ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రశ్నలకు అమ్మ సమాధానం ఇవ్వదు. ఈ ప్రశ్నలు పరిశ్రమలో ప్రతి ఒక్కరిని అడగాలి. ఇది చాలా కష్టపడి పనిచేసే పరిశ్రమ.. కానీ జరిగిన దానికి బాధ్యులు శిక్షించబడతారు. మేము దర్యాప్తు ప్రక్రియలో సహకరిస్తాం. పరిస్థితిని సరిదిద్దడానికి మాత్రమే ఇక్కడ ఉన్నాము`` అని అన్నారు. అలాగే పరిశ్రమలో పవర్ గ్రూప్స్ గురించి నాకు తెలియదు. నేను దానిలో భాగం కాదు అని కూడా మోహన్ లాల్ వ్యాఖ్యానించారు. నేను హేమా కమిటీ నివేదికను చదవలేదని కూడా ఆయన అన్నారు. లాల్ తో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులంతా కలిసి రాజీనామాలు సమర్పించారు.
జస్టిస్ హేమ కమిటీ నివేదికను కేరళ ప్రభుత్వం ఆగస్టు 19న విడుదల చేసింది. మలయాళ చిత్రసీమలో 2017లో జరిగిన యువనటిపై వేధింపులు, దాడి కేసుకు ప్రతిస్పందనగా మేమ కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీ నివేదిక ప్రకంపనాలు సృష్టిస్తోంది.