Begin typing your search above and press return to search.

ర‌జ‌నీకాంత్‌ దత్త‌త తండ్రి ఎవ‌రో తెలుసా?

రజనీకాంత్ - పరిచయం అవసరం లేని పేరు. భార‌తీయ సినిమా లెజెండ్.. మ‌హిమాన్వితుడు.. స్వ‌యంకృషితో ఎదిగిన అసాధార‌ణ‌ న‌టుడు

By:  Tupaki Desk   |   13 Aug 2024 4:40 PM GMT
ర‌జ‌నీకాంత్‌ దత్త‌త తండ్రి ఎవ‌రో తెలుసా?
X

రజనీకాంత్ - పరిచయం అవసరం లేని పేరు. భార‌తీయ సినిమా లెజెండ్.. మ‌హిమాన్వితుడు.. స్వ‌యంకృషితో ఎదిగిన అసాధార‌ణ‌ న‌టుడు. ఒక సాధార‌ణ బ‌స్ కండ‌క్ట‌ర్ న‌టుడిగా మారి ఇండ‌స్ట్రీని ఏలిన చ‌రిత్ర‌కు సాక్ష్యం. తన అద్భుతమైన నటనతో పాటు విన‌య‌విధేయ‌త‌లు, సింప్లిసిటీతో హృద‌యాల‌ను గెలుచుకున్న గొప్ప వ్య‌క్తి. ఫ‌క్తు ఫ్యామిలీమ్యాన్.. త‌న‌ భార్య, పిల్లల గురించి ప్ర‌జ‌ల‌కు తెలుసు కానీ, రజనీకాంత్ తన తండ్రిగా ఒకరిని దత్తత తీసుకున్నార‌నేది చాలామందికి తెలియదు.

అవును.. మీరు చ‌దువుతున్న‌ది నిజ‌మే. ర‌జ‌నీని ఎవ‌రూ ద‌త్త‌త తీసుకోలేదు..! ర‌జ‌నీయే ఒక‌రిని ద‌త్త‌త తీసుకున్నారు. అత‌డిని `నాన్న` అని పిలుస్తాడు. పూర్తి వివ‌రాలను ప‌రిశీలిస్తే.. రజనీకాంత్ 2012లో ఒక‌ లైబ్రేరియన్‌ను దత్తత తీసుకున్నాడు. అత‌డి పేరు పాలెం కల్యాణసుందరం. ఈ నిస్వార్థ వ్యక్తి తన సంపాదన మొత్తాన్ని పేదలకు ఇచ్చాడు. తన 30 ఏళ్ల సర్వీసులో కల్యాణసుందరం తన డబ్బునంతా దాతృత్వానికి విరాళంగా ఇచ్చాడు.

2012లో రజనీకాంత్ ఈ సామాజిక కార్యకర్తను తన తండ్రిగా స్వీకరించారు. అతడి గొప్ప పని ర‌జ‌నీ మ‌న‌సును గెలుచుకుంది. అందుకే క‌ల్యాణ సుంద‌రంని తండ్రిగా స్వీక‌రించాల‌ని ర‌జ‌నీ నిర్ణయించుకున్నారు. జాతీయ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం.. రజనీకాంత్ ఆయ‌న‌ను తన ఇంటికి మారమని చాలాసార్లు అడిగారు. అయితే కల్యాణసుందరం ప్రతిసారీ దానిని తిరస్కరించారు. ఒక దశాబ్దం పాటు హోటల్‌లో సర్వర్‌గా కూడా పనిచేసిన కల్యాణసుందరం తన పెన్షన్‌ రూ. 10 లక్షలను ఛారిటీకి విరాళంగా ఇచ్చారు. ప్రపంచంలోనే తన సంపాదన మొత్తాన్ని సామాజిక ప్రయోజనం కోసం వెచ్చించిన మొదటి వ్యక్తి శ్రీ కల్యాణసుందరం. అతడి సామాజిక సేవకు గుర్తింపుగా, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ (UNO), అతన్ని 20వ శతాబ్దపు అత్యుత్తమ వ్యక్తులలో ఒకరిగా ఎంపిక చేసింది.

వృత్తిరీత్యా చూస్తే.. రజనీకాంత్ తదుప‌రి `వేట్టయాన్` షూటింగ్‌ను ఇప్పటికే పూర్తి చేశారు. టిజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో చాలా సంవత్సరాల తర్వాత అమితాబ్ బచ్చన్ -రజనీకాంత్ కలయిక సాధ్య‌మ‌వుతోంది. ఆ ఇద్ద‌రినీ అభిమానులు ఒకే ఫ్రేమ్‌లో చూసి ఆనందించ‌నున్నారు. `వేట్ట‌యాన్‌`లో ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్‌ సహా అద్భుత తారాగణం న‌టిస్తున్నారు. లోకేష్ కనగరాజ్ తదుపరి దర్శకత్వం వహించే కూలీలో కూడా ర‌జ‌నీ న‌టిస్తారు. అంతేకాకుండా రజనీకాంత్ తన 2023 చిత్రం `జైలర్` సీక్వెల్ కోసం దిలీప్ కుమార్ తో క‌థా చ‌ర్చ‌లు సాగిస్తార‌ని తెలుస్తోంది. ప్రస్తుతం `జైలర్ 2`కి సంబంధించిన స్క్రిప్ట్ రాసుకుంటున్నట్లు తాజాగా యోగి బాబు వెల్లడించారు.