సూపర్‌స్టార్ రజనీ నికర ఆస్తుల విలువ?
భారతీయ సినీపరిశ్రమకు యూనిక్ స్టైల్ నేర్పించిన మేటి కథానాయకుడు సూపర్ స్టార్ రజనీకాంత్
By: Tupaki Desk | 21 April 2024 4:01 AM GMTభారతీయ సినీపరిశ్రమకు యూనిక్ స్టైల్ నేర్పించిన మేటి కథానాయకుడు సూపర్ స్టార్ రజనీకాంత్. ఆయన స్టైల్, మ్యానరిజమ్స్ సమకాలికుల్లో ఎవరికీ సాధ్యం కానివి. యూనిక్‌నెస్ విలక్షణత ఆయనకు వెన్నతో పెట్టిన విద్యలు. అందుకే పరిశ్రమలో ఎందరు స్టార్లు ఉన్నా రజనీ గురించే ప్రత్యేకించి మాట్లాడుకుంటారు. తమిళనాడు సహా దేశవ్యాప్తంగా భారీగా మాస్ ఫాలోయింగ్ ఉన్న నటుడు రజనీకాంత్. ఉత్తరాదిన బిగ్ బి అమితాబ్ బచ్చన్ సూపర్ స్టార్.. దక్షిణాదిన రజనీకాంత్ సూపర్‌స్టార్! అంటూ మెగాస్టార్ చిరంజీవి కీర్తించారంటే వారి స్థాయి అంత గొప్పది అని అర్థం చేసుకోవాలి.
రజనీకాంత్ సినీప్రేక్షకులను తన మేనరిజమ్స్‌తో ఆశ్చర్యపరిచిన నటుడు. తెరపై విభిన్నమైన పాత్రలు.. ఆఫ్ ద స్క్రీన్ దాతృత్వ కార్యకలాపాలతో రజనీకాంత్ భారతదేశంలో గొప్ప ఆదరణ పొందారు. అసాధారణమైన నటప్రతిభ భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకరిగా ఆయన ఎదిగారు. ఫోర్బ్స్ ఇండియా నివేదిక ప్రకారం.. భారతదేశంలో అత్యధిక పారితోషికం పొందుతున్న నటులలో రజనీకాంత్ రెండవ స్థానంలో ఉన్నారు. సూపర్ స్టార్ సుమారుగా రూ. జైలర్ ఘనవిజయం తర్వాత ఒక్కో సినిమాకు 150 కోట్ల నుంచి 210 కోట్లు (లాభాల్లో వాటా కలుపుకుని) అందుకుంటున్నారు. కింగ్ ఖాన్ షారూఖ్ ఒక్కో సినిమాకు రూ. 150 కోట్ల నుంచి 250 కోట్ల వరకు వసూలు చేస్తున్నందున అగ్రస్థానంలో ఉన్నాడు. ఇది ఫోర్బ్స్ ప్రకటన.. అలాగే రజనీకాంత్ అత్యధిక పారితోషికం తీసుకునే దక్షిణ భారత నటుల్లో ఒకరు. సూపర్ స్టార్ రజనీకాంత్ నికర ఆస్తుల విలువ 430 కోట్లుగా ఉందని ఒక అంచనా.
రజనీకాంత్ `జైలర్` కోసం 110 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. లాభాల్లో వాటాలు కూడా అందుకున్నారు. రజనీ వాణిజ్య ప్రకటనల్లో అవకాశం ఉన్నా కానీ నటించరు. అందువల్ల ప్రధాన ఆదాయ వనరు నటనతో వచ్చే పారితోషికాలే. నిర్మాతగాను కొనసాగుతున్నా అది ప్రధాన ఆదాయ వనరు కాదు.
రజనీకాంత్ దశాబ్ధాల కెరీర్ లో వివిధ మార్గాల్లో పెట్టుబడుల ద్వారా భారీగా ఆస్తులను కూడగట్టారు. పలుచోట్ల విలాసవంతమైన స్థిరాస్తులు ఉన్నాయి. చెన్నైలోని పోయెస్ గార్డెన్‌లో 2002లో విలాసవంతమైన ఇంటిని రజనీ నిర్మించారు. లైఫ్‌స్టైల్ ఆసియా నివేదిక ప్రకారం 2023లో ఈ ఇంటి మార్కెట్ ధర రూ. 35 కోట్లు. సూపర్‌స్టార్ రజనీకి కళ్యాణ మండపం కూడా ఉంది. దాని అంచనా విలువ రూ. 20 కోట్లు. సూపర్‌స్టార్‌కి కార్లపై మక్కువ ఎక్కువ. అతడికి రోల్స్ రాయిస్ ఘోస్ట్, రోల్స్ రాయిస్ ఫాంటమ్ ఉన్నాయి. గ్యారేజీలో ఉన్న ఇతర లగ్జరీ కార్లు BMW X5, మెర్సిడెస్ బెంజ్ G వ్యాగన్, లంబోర్ఘిణి ఉరుస్, బెంట్లీ లిమోసిన్, టయోటా ఇన్నోవా, హోండా సివిక్, హిందుస్థాన్ మోటార్స్ అంబాసిడర్ ఇష్టమైన కొన్ని ఇతర కార్లు. తదుపరి రజనీకాంత్ `వెట్టయన్`లో నటిస్తున్నారు. టిజే జ్ఞానవేల్ ఈ యాక్షన్ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా సుభాష్కరణ్ నిర్మిస్తున్నారు. కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ తెరకెక్కించిన `లాల్ సలామ్` డిజాస్టరవ్వడం రజనీని నిరాశపరిచింది.