రజనీకాంత్ బయోపిక్.. ఒకటే ఉత్కంఠ..
స్ఫూర్తివంతమైన వ్యక్తిత్వాలను, జీవితకథలను వెండితెరపై ఆవిష్కరిస్తే, వాటికి గొప్ప జనాదరణ దక్కుతుందని ప్రూవ్ అయింది
By: Tupaki Desk | 1 May 2024 6:40 AM GMTస్ఫూర్తివంతమైన వ్యక్తిత్వాలను, జీవితకథలను వెండితెరపై ఆవిష్కరిస్తే, వాటికి గొప్ప జనాదరణ దక్కుతుందని ప్రూవ్ అయింది. గాంధీజీ, మహానటి సావిత్రి, ఎం.ఎస్.ధోని, మేరికోమ్, మిల్కాసింగ్, అమర్ సింగ్ చమ్కీలా(పంజాబీ గాయకుడు) ఇలా పలువురి బయోపిక్ లు బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపించాయి.
అదే బాటలో ఇప్పుడు సూపర్‌స్టార్ రజనీకాంత్ అద్భుతమైన జీవితంపై సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. రజనీ వ్యక్తిగత జీవితం, స్టార్ డమ్ సహా ప్రతిదీ సినిమాగా చూసేందుకు అవకాశం కలగనుంది. గత కొన్ని వారాలుగా ఇంటర్నెట్‌లో దీనిపై కథనాలు వెలువడుతున్నాయి. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిదీ ఆసక్తిగా మారింది.
సూపర్ స్టార్ రజనీకాంత్ వ్యక్తిగత జీవితంలో విలువలు, ఆయన స్టైల్.. మ్యానరిజమ్స్.. అసాధారణ స్టార్ డమ్ ఇలా ప్రతిదీ ప్రత్యేకమైనవే. ఒక సాధారణ బస్ కండక్టర్ గా జీవితాన్ని ప్రారంభించి, అటుపై నటుడిగా మారి, అసాధారణ స్టార్ డమ్ ని సాధించిన గొప్ప హీరోగా రజనీకి పేరుంది. తమిళనాడు వ్యాప్తంగా అసాధారణమైన మాస్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ ఆయన. పాన్ ఇండియాలోను రజనీకి గొప్ప పేరుంది. 70 ప్లస్ వయసులోను ఆయన కథానాయకుడిగా సత్తా చాటుతున్నారు. యూత్ లో స్ఫూర్తిని రగిలించే గొప్ప చరిత్ర ఆయనకు ఉంది. అందుకే ఈ బయోపిక్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
హిందీ మీడియాలో తాజా కథనం ప్రకారం.. ప్రముఖ నిర్మాత సాజిద్ నడియాద్వాలా రజనీకాంత్ బయోపిక్‌ని అన్ని ప్రధాన భారతీయ భాషలలో నిర్మించేందుకు బాధ్యతలు స్వీరించారని తెలిసింది. సాజిద్ ప్రస్తుతం సల్మాన్ ఖాన్ - AR మురుగదాస్ కాంబినేషన్ లో `సికందర్` అనే భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈద్ 2025 కానుకగా ఇది విడుదల కానుంది. ప్రస్తుతం రజనీకాంత్ బయోపిక్ ప్రారంభ దశలో ఉందని, తారాగణం,టెక్నీషియన్లను ఇంకా ఖరారు చేయలేదని తెలుస్తోంది. రజనీకాంత్ బయోపిక్‌లో ఆయన మాజీ అల్లుడు, తమిళ స్టార్ హీరో ధనుష్ నటించేందుకు అవకాశం ఉందని, అతడు రేసులో అందరి కంటే ముందున్నాడని కథనాలొస్తున్నాయి.