కోర్టు చిక్కుల్లో రజనీకాంత్ జైలర్ టైటిల్?
ఈ టైటిల్ వల్ల తమ సినిమా మునిగిపోతోందంటూ మలయాళ నిర్మాత ఒకరు కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ఇప్పుడు చిక్కులు తప్పేట్టు లేవన్న చర్చ సాగుతోంది.
By: Tupaki Desk | 17 July 2023 4:09 AM GMTసూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే రిలీజ్ ముంగిట ఈ సినిమా చట్టపరమైన సమస్యల్లో చిక్కుకుంది. ఈ టైటిల్ వల్ల తమ సినిమా మునిగిపోతోందంటూ మలయాళ నిర్మాత ఒకరు కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ఇప్పుడు చిక్కులు తప్పేట్టు లేవన్న చర్చ సాగుతోంది.
ఇంతకీ అసలు ఈ వివాదం దేనికి? అంటే.. మలయాళ నిర్మాత ఎన్.కె మొహమ్మద్ నిర్మించిన పీరియాడికల్ డ్రామా 'జైలర్' (సక్కీర్ దర్శకుడు) కూడా రజనీకాంత్ 'జైలర్' తో పాటుగా రిలీజ్ బరిలోకొస్తోంది. అయితే ఒకే సమయంలో రెండు సినిమాలు ఒకే టైటిల్ తో విడుదలైతే అది ఆడియెన్ లో గందరగోళానికి తావిస్తుందని మలయాళ చిత్ర నిర్మాత సక్కీర్ ఆందోళనకు గురవుతున్నారు. ''తమ సినిమా చిన్న సినిమా.
ఇప్పటికే నష్టాల్లో ఉన్నాం.. మేం మునిగిపోతాం!'' అంటూ అతడు కోర్టు మెట్లు ఎక్కారని తెలిసింది. రజనీకాంత్ జైలర్ ని నిర్మిస్తున్న సన్ పిక్చర్స్ సంస్థను తాము సంప్రదించినా కేరళలో టైటిల్ మార్పు వరకూ అయినా అంగీకరించడం లేదని సదరు నిర్మాత వాదిస్తున్నారు.
అయితే సన్ పిక్చర్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ ఇలాంటి ఆరోపణలకు తలొగ్గి టైటిల్ ని మార్చేస్తుందా? పైగా రజనీకాంత్ లాంటి స్టార్ హీరో నటించిన సినిమా టైటిల్ ని మార్చుకోమనడం సబబేనా? అంటూ నెటిజనుల్లో డిబేట్ స్టార్టయింది. రజనీకాంత్ జైలర్ దక్షిణాదిన అన్ని భాషల్లోను విడుదలవుతోంది. హిందీ అనువాదం కూడా విడుదల కానుంది.
అయితే కేరళ మినహా ఇతర భాషల్లో టైటిల్ పరంగా వచ్చిన చిక్కులేవీ లేవు. కానీ మలయాళ వెర్షన్ వరకూ టైటిల్ మార్చుకోవాల్సిందిగా మలయాళీ నిర్మాత అభ్యర్థిస్తున్నారు. మరి కోర్టులో దీనిపై విచారణలో ఏం తేలనుందో వేచి చూడాలి. ఒక చిన్న నిర్మాత సౌలభ్యం కోసం అంత పెద్ద హీరోతో అగ్ర నిర్మాణ సంస్థ తెరకెక్కించిన సినిమా టైటిల్ ని మార్చుకోమని కోర్టు తీర్పునిస్తుందా ? అంటూ డిబేట్ వేడెక్కిస్తోంది.