కరణ్ కాఫీతో ఎవరికీ ప్రయోజనం లేదన్న కుంద్రా
కరణ్ జోహార్ `కాఫీ విత్ కరణ్ షో` వల్ల ఎవరికైనా ఏదైనా ఉపయోగం ఉందా?
By: Tupaki Desk | 5 Nov 2023 10:02 AM GMTకరణ్ జోహార్ `కాఫీ విత్ కరణ్ షో` వల్ల ఎవరికైనా ఏదైనా ఉపయోగం ఉందా? అంటే ఎవరికీ ఎలాంటి ఉపయోగం లేదని భావించేవారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. మునుముందు ఈ సెలబ్రిటీ రియాలిటీ షో నుంచి దూరంగా ఉండేవారి సంఖ్య పెరుగుతోందనేది ఒక సర్వే.
ప్రస్తుతం `కాఫీ విత్ కరణ్ సీజన్ 8` ఓటీటీలో రన్ అవుతోంది. ఈ షోకి కరణ్ జోహార్ హోస్టింగ్ చేస్తున్నారు. రియాలిటీ షోల్లో ఇది అత్యంత విజయవంతమైన షోగా ఖ్యాతికెక్కింది. ఇప్పుడు సీజన్ 8పైనా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే ఈ షో వల్ల ప్రయోజనం పొందని సెలబ్రిటీలు మునుముందు కరణ్ ముందరి మంచం(సీట్)పైకి వస్తారా రారా? అనే సందిగ్ధత నెలకొంది. నిజానికి ఇలాంటి షో వల్ల వీక్షకులకు పసందైన విషయాలు తెలుసుకునేందుకు అవకాశం ఉంటుందే కానీ.. రహస్యంగా దాచాల్సిన తమ బెడ్ రూమ్ రహస్యాలు, ఎఫైర్ కహానీలు ఓపెనవ్వాల్సి వస్తోందన్న భయాందోళనలు సెలబ్రిటీల్లో ఉన్నాయి. అందుకే ఇప్పుడు కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొనేందుకు చాలా మంది విముఖంగా ఉన్నారన్న చర్చ సాగుతోంది.
కొత్త సీజన్ లో దీపికా పదుకొణె - రణ్వీర్ సింగ్ జంట ఎపిసోడ్ ఇప్పటికే చాలా అపఖ్యాతిని మూటగట్టుకుంది. కరణ్ జోహార్ షో `కాఫీ విత్ కరణ్ 8`లో తమ ఉనికిని కచ్చితంగా పునరాలోచించుకునే అనేక మంది ప్రముఖులు ఉన్నారు. ఇప్పటికే షోను నిషేధించిన రణబీర్ కపూర్, అనుష్క శర్మ వంటి చాలా మంది ప్రముఖులు ఉన్నారు. ఇప్పుడు ఈ జాబితాలో మరొకరు చేరారు. వివాదాస్పద రాజ్ కుంద్రా UT 69తో బాలీవుడ్లో నటుడిగా ఆరంగేట్రం చేసేందుకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. బిజినెస్ మేన్ టర్న్ డ్ ఆర్టిస్ట్ గా శిల్పాశెట్టి భర్త కుంద్రాజీ రాణించాలని కలలుగంటున్నారు. అయితే అతడు తన సినిమాని ప్రమోట్ చేయడానికి కరణ్ జోహార్ షో కాఫీ విత్ కరణ్ 8కి వెళతారా? అని ప్రశ్నించగా, అతడు నిష్కపటంగా సమాధానం ఇచ్చాడు. `కాఫీ విత్ కరణ్ పే కిసీ కా భలా నహీ హువా హై? అని బదులిచ్చారు. దీని అర్థం `కాఫీ విత్ కరణ్‌తో ఎవరూ ప్రయోజనం పొందలేదు` అని.
షోలో కనిపించిన తర్వాత చాలా మంది సెలబ్రిటీలు భారీ ట్రోలింగ్‌ను ఎదుర్కొన్నారు. ఇంతకుముందు, షోలో తమ నిజాయితీని ప్రదర్శించిన షాహిద్ కపూర్ - మీరా రాజ్‌పుత్ ట్రోలింగుకి గురయ్యారు. ఈ సీజన్లో మొదటి ఎపిసోడ్ జంట రణవీర్ సింగ్- దీపికా పదుకొనే నిజాయితీ ఒప్పుకోలు ట్రోలింగుకి దారి తీసింది. రణ్వీర్తో తన సంబంధం గురించి దీపిక బహిరంగంగా కరణ్‌తో మాట్లాడుతూ, ``నేను కష్టతరమైన సంబంధాల నుండి వచ్చాను కాబట్టి నేను కొంతకాలం ఒంటరిగా ఉండాలనుకున్నాను. నేను ఒక దశలో ఉన్నాను. నేను అటాచ్ అవ్వడం ఇష్టం లేదు,.. `కమిట్ అవ్వడం ఇష్టం లేదు`. అటుపై అతను (రణవీర్) వచ్చాడు. తనకు తానుగా నాకు ప్రపోజ్ చేసే వరకు నేను కమిట్ అవ్వలేదు`` అని తెలిపారు. తాము ఒకరితో ఒకరు సంబంధంలో ఉన్నా కానీ, సాంకేతికంగా ఇతర వ్యక్తులను చూడటానికి మాకు అనుమతి ఉందని కూడా దీపిక అనడం ఆక్షేపణకు కారణమైంది. నిజానికి అనుష్క శర్మతో సుదీర్ఘ రిలేషన్ షిప్ తర్వాత రణవీర్ సింగ్ .. రణబీర్ తో సుదీర్ఘ రిలేషన్ షిప్ తర్వాత దీపిక .. లవ్ లో పడ్డారు. వారి గత సంబంధాలపై ఓపెన్ గా మాట్లాడారు.
షాహిద్ కపూర్ - మీరా రాజ్‌పుత్‌లు తమ కాఫీ అపజయం తర్వాత KWKలో ఎలా కనిపించలేదు. ఇకపై రణవీర్ సింగ్ - దీపిక పదుకొనే కూడా కాఫీ విత్ కరణ్ షోలో కనిపించరన్న చర్చ సాగుతోంది. ఇప్పుడు రాజ్ కుంద్రా కూడా కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొనడం వల్ల ప్రయోజనం ఏం ఉంటుందని ప్రశ్నించారు. అంటే కుంద్రా- శిల్పాశెట్టి జంట ఇకపై ఈ షోలో కనిపించరని అర్థం. ఇలా జంటలంతా దూరమైతే కరణ్ షో సక్సెసయ్యేదెలా? అన్న సందేహాలు ముసురుకున్నాయి.