'రాజు యాదవ్' మూవీ రివ్యూ
By: Tupaki Desk | 24 May 2024 9:57 AM GMT'రాజు యాదవ్' మూవీ రివ్యూ
నటీనటులు: గెటప్ శీను-అంకిత కారత్-ఆనంద చక్రపాణి-సంతోష్ కల్వచెర్ల-శ్రీరామ్-కళ్యాణ్ భూషణ్ తదితరులు
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
నేపథ్య సంగీతం: సురేష్ బొబ్బిలి
ఛాయాగ్రహణం: సాయిరామ్ ఉదయ్
నిర్మాతలు: రాజేష్ కల్లేపల్లి-ప్రశాంత్ రెడ్డి
రచన-దర్శకత్వం: కృష్ణమాచారి
రాజు యాదవ్.. జబర్దస్త్ కమెడియన్ గెటప్ శీను హీరోగా నటించిన చిత్రం. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు కృష్ణమాచారి రూపొందించాడు. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ: రాజు యాదవ్ (గెటప్ శీను) మహబూబ్ నగర్లో ఆవారాగా తిరిగే ఓ కుర్రాడు. డిగ్రీలో నాలుగు సబ్జెక్టులు ఫెయిలైన అతను ఏ పని చేయకుండా స్నేహితులతో గాలి తిరుగుళ్లు తిరుగుతూ.. క్రికెట్ ఆడుతూ గడిపేస్తుంటాడు. ఐతే ఒక రోజు క్రికెట్ ఆడుతుండగా బంతి బలంగా తాకడంతో ముఖానికి తీవ్ర గాయాలవుతాయి. ప్రాథమిక చికిత్స సరిగ్గా జరగకపోవడంతో తన ముఖం ఎప్పుడూ నవ్వుతూ ఉండేలా విచిత్రంగా తయారవుతుంది. ఇది రాను రాను రాజుకు పెద్ద సమస్యగా మారుతుంది. అందరూ అతణ్ని చూసి ఎగతాళి చేస్తుంటారు. ఐతే అనుకోకుండా పరిచయం అయిన స్వీటీ (అంకిత కారత్)కి తన నవ్వు ముఖం నచ్చి స్నేహం చేస్తుంది. ఆమెతో రాజు ప్రేమలో పడతాడు. స్వీటీకి దగ్గరై ఆమె మీద ఆశలు పెంచుకుంటున్న సమయంలో ఆమె అతడికి హ్యాండిచ్చి వెళ్లిపోతుంది. ఈ స్థితిలో మనోవేదనకు గురైన రాజు ఏం చేశాడు.. చివరికి అతడి జీవితం ఎలాంటి మలుపు తీసుకుంది అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ: గత కొన్నేళ్లలో చాలామంది కమెడియన్లు హీరోలైపోయారు. కానీ వాళ్లలో చెప్పుకోదగ్గ ఇంపాక్ట్ వేసిన వాళ్లు తక్కువ మందే. ఇప్పుడు జబర్దస్త్ ఫేమ్ గెటప్ శీను కూడా హీరో అయిపోయాడు. మామూలుగా అయితే ఇప్పుడున్న బాక్సాఫీస్ స్లంప్ లో గెటప్ శీను హీరోగా నటించిన సినిమాను జనాలు పెద్దగా పట్టించుకోకూడదు. కానీ 'రాజు యాదవ్' ట్రైలర్ చూసిన సినీ ప్రియులకు ఈ చిత్రంపై ఓ లుక్కేయాలని అనిపించి ఉంటే ఆశ్చర్యమేమీ లేదు. అందుక్కారణం.. ఈ సినిమా కథాంశం. క్రికెట్ బంతి తగిలి ముఖం ఎప్పుడూ నవ్వుతూ ఉండేలా మారిపోతే దాని వల్ల ఓ కుర్రాడు ఎలా ఇబ్బంది పడ్డాడనే కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. వాస్తవంగా జరిగిన కథే కావడం మరింత క్యూరియాసిటీని పెంచేదే. ఈ కాన్సెప్ట్ ను ఆరంభంలో డీల్ చేసిన విధానం.. కొన్ని కామెడీ సీన్లు చూస్తే ఒక ఫన్ రైడ్ చూడబోతున్న ఫీలింగ్ కలుగుతుంది. కానీ ఆ మెరుపులన్నీ కొన్ని నిమిషాల వరకే. ఈ పాయింట్ చుట్టూ మరింత వినోదం పండించడానికి.. ఎమోషన్లనూ వర్కవుట్ చేయడానికి మంచి అవకాశమున్నా దర్శకుడు దాన్ని ఉపయోగించుకోకుండా 'ఆర్ఎక్స్ 100' దారిలో వేరే ఓ కథను ఎత్తుకుని 'రాజు యాదవ్'ను ట్రాక్ మళ్లించేశాడు. ఏ ప్రత్యేకతా లేని ఆ కథ విసుగు తెప్పించి ప్రేక్షకులతో రాజు యాదవ్‌కో దండం అనిపించేస్తుంది.
హీరో హీరోయిన్లలో ఒకరిని నెగెటివ్‌గా చూపిస్తున్నపుడు.. ఇంకో పాత్రపై అయినా ప్రేక్షకుల్లో కొంత ఆపేక్ష కలిగేలా తీర్చిదిద్దడం అవసరం. కానీ 'రాజు యాదవ్'లో మాత్రం దర్శకుడు రెండు లీడ్ క్యారెక్టర్లలో దేని మీదా ప్రేక్షకులకు పాజిటివ్ ఫీలింగ్ కలగని విధంగా తయారు చేశాడు. హీరోయిన్ని నెగెటివ్ యాంగిల్లో ప్రెజెంట్ చేసిన దర్శకుడు.. హీరోను అమాయకుడిలా చూపించడం వరకు ఓకే. కానీ కనీస బాధ్యత లేకుండా హీరోయిన్ వెంట తిరగడం తప్ప వేరే పనేమీ లేదన్నట్లు.. ఆమెను పెళ్లి చేసుకుని జీవితంలో సెటిలైపోదాం.. తనకున్న పెద్ద సమస్య తీర్చేసుకుందాం అన్నట్లు చూపించాక ఆ పాత్ర మీద ఏ దశలోనూ సానుకూల అభిప్రాయం కలగదు. హీరోయిన్ కోసం అతను తపించిపోతున్నా.. ఆమె మోసం చేసిందని ఏడుస్తున్నా సింపతీ ఫీలింగే కలగదంటే అది పాత్ర చిత్రణలో ఉన్న లోపమే. లీడ్ క్యారెక్టర్ అలా ఉన్నపుడు ఇక సినిమాలో ఎమోషన్ పండేందుకు అవకాశం ఎక్కడిది? చివరికి హీరో పాత్రను ముగించిన తీరుతో కూడా అయ్యో అన్న ఫీలింగ్ రాకపోగా.. అలాంటి వాళ్ల జీవితం ఇలా కాక ఎలా ముగుస్తుందనే భావన కలగుతుంది తప్ప ప్రేక్షకులు ఎమోషనల్ కావడానికి అవకాశమే లేకపోయింది.
ముందే అన్నట్లు 'రాజు యాదవ్'ను ఒక ఫన్ రైడ్ గా మార్చడానికి దర్శకుడికి మంచి అవకాశమే లభించింది. ఎక్కువ టైం తీసుకోకుండా నేరుగా హీరోకు తలెత్తిన విచిత్రమైన సమస్య ఏంటో చూపించి ప్రేక్షకులను కథలో ఇన్వాల్వ్ చేయడానికి ప్రయత్నించాడు దర్శకుడు. ఎప్పుడూ నవ్వు ముఖంతో కనిపించే పాత్రలో గెటప్ శీను తనదైన శైలిలో వినోదం పండించాడు కాసేపు. చావు ఇంటికి వెళ్లి నవ్వు ముఖం పెట్టడం.. అమ్మాయిలను చూసి నవ్వుతుంటే వాళ్లు చీదరించుకోవడం.. ఈ తరహా సీన్లు కొంతసేపు ప్రేక్షకుల ముఖాల్లో నవ్వు చెరగనీయవు. అందరూ హీరోను చూసి నవ్వుతుంటే.. హీరోయిన్ మాత్రం ఆ నవ్వు ముఖాన్నే ఇష్టపడి తనకు దగ్గర కావడం అన్నది కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపించే విషయమే. ఐతే ఇక్కడి వరకు 'రాజు యాదవ్' ట్రాక్ లో ఉన్నట్లే కనిపిస్తుంది. హీరో తన సమస్యను దాచి పెట్టి హీరోయిన్ తో డ్రామా ప్లే చేసి ఉంటే ఇంకొంతసేపు కథ ఆసక్తికరంగా నడిచేందుకు అవకాశముండేదేమో. కానీ మొదట్లోనే తన రహస్యం బయటపడిపోతుంది. అంతటితో 'రాజు యాదవ్' కథా గమనం కూడా ఆగిపోతుంది. ఆ తర్వాత చూసేదంతా ఒక రొటీన్ ప్రేమకథా వ్యవహారమే. 'ఆర్ఎక్స్ 100' తరహాలో కథానాయిక పాత్రకు ట్విస్ట్ ఇచ్చారు కానీ.. అదేమంత ఇంట్రెస్టింగ్ గా అనిపించదు. రాను రాను ఈ కథ ఎటు పోతోందో అర్థం కానట్లు తయారవుతుంది. మరీ ఎబ్బెట్టుగా తయారైన కథనం-సన్నివేశాలతో చివరి వరకు కూర్చోవడమే కష్టమవుతుంది. ముగింపు సన్నివేశాల్లో కూడా మెరుపులు లేక 'రాజు యాదవ్' చివరికి పూర్తి నిరాశకు గురి చేస్తుంది. రెండు గంటల తక్కువ నిడివే అయినా చివరికి భారంగానే థియేటర్ నుంచి కదలాల్సి వస్తుంది. కాన్సెప్ట్.. దాని చుట్టూ అల్లుకున్న ఆరంభ సన్నివేశాలు మినహాయిస్తే 'రాజు యాదవ్'లో చెప్పుకోదగ్గ విశేషాలేమీ లేవు.
నటీనటులు: గెటప్ శీను మంచి పెర్ఫామర్ అని కొత్తగా చెప్పాల్సిన పని లేదు. రాజు యాదవ్ పాత్రకు అతను బాగా సూటయ్యాడు. చిత్రమైన హావభావాలతో ఆకట్టుకున్నాడు. పాత్రకు తగ్గట్లు అమాయకత్వాన్ని ప్రదర్శించడంలో అతను విజయవంతం అయ్యాడు. ఎమోషనల్ సీన్లలో కూడా శీను ఓకే అనిపించాడు. హీరోయిన్ ీఅంకిత కారత్ జస్ట్ ఓకే అనిపించింది. తన నటన గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. కొన్ని సార్లు అందంగా కనిపించింది. హీరో తండ్రి పాత్రలో చేసిన నటుడు సహజంగా నటించాడు. హీరో స్నేహితుల పాత్రల్లో కనిపించన కుర్రాళ్లు బాగానే చేశారు. మిగతా నటీనటులంతా ఓకే.
సాంకేతిక వర్గం: 'రాజు యాదవ్'లో బెస్ట్ ఔట్ పుట్ ఇచ్చింది సంగీత దర్శకులు హర్షవర్ధన్ రామేశ్వర్.. సురేష్ బొబ్బిలి. సినిమా స్థాయి చూడకుండా హర్షవర్ధన్ మంచి పాటలే ఇచ్చాడు. ముఖ్యంగా రాజు యాదవ్ టైటిల్ సాంగ్ మంచి టెంపోతో సాగింది. సురేష్ బొబ్బిలి నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. సాయిరామ్ ఉదయ్ ఛాయాగ్రహణం పర్వాలేదు. బడ్జెట్ పరిమితులు తెరపై కనిపిస్తాయి. కానీ ఈ సినిమా స్థాయికి ఓకే. రచయిత-దర్శకుడు కృష్ణమాచారి ఎంచుకున్న ప్లాట్ పాయింట్ బాగుంది. కానీ దాని చుట్టూ పకడ్బందీ కథనాన్ని అల్లడంలో అతను విఫలమయ్యాడు. ఆరంభ సన్నివేశాల్లో చూపించిన ప్రతిభను సినిమా అంతా కొనసాగించి ఉంటే సినిమా మంచి స్థాయిలో నిలబడేది. కానీ అనుభవ లేమితో కృష్ణమాచారి దర్శకుడిగా పోను పోను తేలిపోయాడు.
చివరగా: రాజు యాదవ్.. ఆరంభ శూరత్వమే
రేటింగ్-1.75/5