కొడుకు కోడలు బ్రేకప్.. అగ్రనిర్మాతకు కారణం తెలీదా?
తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ - సుస్సానే ఖాన్ విడాకుల గురించి రాకేష్ రోషన్ చెప్పిన విషయం ఆశ్చర్యపరిచింది.
By: Tupaki Desk | 31 Jan 2025 4:02 AM GMTసెలబ్రిటీ ప్రపంచంలో నిరంతరం కపుల్స్ బ్రేకప్ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. చాలా బ్రేకప్‌లు సంచలనంగా మారాయి. ఈ తరహా వార్తలకు ముగింపు అన్నదే లేదు. ప్రతిసారీ ఏదో ఒక కొత్త బ్రేకప్ గురించి వినాల్సి వస్తోంది. అయితే అప్పటికే విడిపోయిన కొందరు జంటలు ఎందుకు విడిపోయారో అర్థంగాక అభిమానులు సందేహాలను వ్యక్తం చేస్తూనే ఉన్నారు.
తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ - సుస్సానే ఖాన్ విడాకుల గురించి రాకేష్ రోషన్ చెప్పిన విషయం ఆశ్చర్యపరిచింది. ``జరిగినదంతా ఆ జంట మధ్యే`` అని ఆయన క్లుప్తంగా మాట్లాడారు. వారు ప్రేమలో పడ్డారు.. ఆ తర్వాత అపార్థాలు ఏర్పడ్డాయి.. దాంతో విడిపోయారని అన్నారు. అయితే సుస్సానే ఇప్పటికీ తమ కుటుంబంలో భాగమని తెలిపారు.
నిజానికి హృతిక్ - సుస్సానే ఖాన్ చిన్నప్పటి నుంచి స్నేహితులు.. క్లాస్ మేట్స్ కూడా. స్కూల్ డేస్ నుంచి వారి మధ్య డేటింగ్ కొనసాగింది. డిసెంబర్ 2000లో ప్రేమ వివాహం చేసుకున్నారు. హృతిక్ కహోనా ప్యార్ హైతో సినిమాల్లో అడుగుపెట్టిన సంవత్సరమే పెళ్లి చేసుకున్నారు. నవంబర్ 2014లో మనస్ఫర్థల కారణంగా విడిపోయారు. 14 ఏళ్ల సంతోషకర సంసారం బ్రేక్ అవ్వడం ఆశ్చర్యపరిచింది. వీరికి ఇద్దరు వారసులు ఉన్నారు. విడిపోయినా కానీ, తమ కుమారులు హ్రేహాన్, హ్రిధాన్ లకు సహ తల్లిదండ్రులుగా కొనసాగుతున్నారు.
ప్రస్తుతం హృతిక్ గాయని -నటి సాబా అజాద్ తో డేటింగ్ లో ఉన్నారు. సుస్సానే మోడల్ ఆర్ల్సాన్ గోనీతో డేటింగ్ చేస్తున్నారు. ఇరు జంటలు ఒకరితో ఒకరు స్నేహంగా, కలిసి పార్టీలు చేసుకోవడం చర్చనీయాంశమైంది. 2025 కొత్త సంవత్సర వేడుకల్లోను వారు కలిసి కనిపించారు.
జరిగినదంతా వారి మధ్యనే ఉంది! అని హృతిక్-సుస్సానే గురించి చెప్పిన రాకేష్ రోషన్ అసలు సమస్య ఏమిటన్నది ఇప్పటికీ చెప్పలేదు. వారు ప్రేమలో పడ్డారు.. అపార్థం ఏమిటో వారి మధ్యనే ఉంది.. వాళ్లే దానిని పరిష్కరించుకోవాలి. మా వరకూ ఆమె మా ఇంటికి వచ్చింది..ఇప్పటికీ ఇంటి సభ్యురాలు`` అని రాకేష్ రోషన్ క్లుప్తంగా వ్యాఖ్యానించారు. అలాగే తన పిల్లలు హృతిక్, సునైనా రోషన్ చిన్నప్పుడు తనతో మాట్లాడేందుకు భయపడేవారని, తాను ఎక్కువ క్రమశిక్షణతో ఉండేవాడిని, తాను ఎప్పుడూ కోప్పడలేదని తెలిపారు. ఇప్పుడు ఇద్దరూ తనతో ఎంతో స్నేహంగా ఉంటారని కూడా వెల్లడించారు.
ఇటీవల `ది రోషన్స్` అనే డాక్యుమెంటరీలో రోషన్ ల కుటుంబ కథ రివీలైంది. మూడు తరాల రోషన్ ల ప్రస్థానంపై డాక్యు సిరీస్ ఇది. స్వరకర్త రోషన్ లాల్ నాగ్రత్, రాజేష్ రోషన్, రాకేష్ రోషన్, హృతిక్ ల సినీ ప్రయాణాన్ని డాక్యుమెంటరీలో ఆవిష్కరించారు. దీనిలో షారుఖ్ ఖాన్, ప్రియాంక చోప్రా జోనాస్, ప్రీతి జింటా, ఆశా భోంస్లే, సోను నిగమ్ వంటి ప్రముఖులు రోషన్ ల కుటుంబం గురించి చాలా ఆసక్తికర విషయాలను చెప్పారు.