Begin typing your search above and press return to search.

ఇలాంటి స్పంద‌న ఏనాడూ చూడ‌లేద‌న్న ద‌ర్శ‌కనిర్మాత‌

'ది రోషన్స్' సిరీస్ చూసిన తర్వాత సాధార‌ణ ప్రజలు, పరిశ్రమ వ్య‌క్తుల‌ నుండి మీకు లభించిన ఉత్తమ ప్రశంస ఏమిటి? అని రాకేష్ రోష‌న్ ని ఈటీవీ భార‌త్ ప్ర‌శ్నించ‌గా, దానికి ఆయ‌న అనూహ్యంగా స్పందించారు.

By:  Tupaki Desk   |   28 Jan 2025 10:30 AM GMT
ఇలాంటి స్పంద‌న ఏనాడూ చూడ‌లేద‌న్న ద‌ర్శ‌కనిర్మాత‌
X

బాలీవుడ్ లో ద‌శాబ్ధాల చ‌రిత్ర ఉన్న ద‌ర్శ‌క‌నిర్మాత రాకేష రోష‌న్ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. రాజేష్ రోష‌న్, హృతిక్ రోష‌న్ ఆయ‌న వారసులుగా లెగ‌సీని ముందుకు తీసుకు వెళుతున్నారు. హృతిక్ బాలీవుడ్ అగ్ర‌హీరోల్లో ఒక‌రిగా రాజ్య‌మేలుతున్నారు. రోష‌న్ ల‌కు మూడు త‌రాల గొప్ప చ‌రిత్ర ఉంది. సంగీతకారుడు రోషన్ లాల్ నాగ్రత్, అతని కుమారులు, సంగీత స్వరకర్త రాజేష్ రోషన్, దర్శకన‌టుడు రాకేష్ రోషన్ , రాకేష్ కుమారుడు హృతిక్ రోషన్ ..ఇత‌ర‌ రోషన్ కుటుంబంపై నాలుగు భాగాల డాక్యు-సిరీస్ ఇటీవ‌లే విడుద‌ల కాగా అందులో ఎన్నో ఆస‌క్తిని రేకెత్తించే విష‌యాలు ఉన్నాయి.

షారుఖ్ ఖాన్, సంజయ్ లీలా భ‌న్సాలీ, కరణ్ జోహార్, శత్రుఘ్న సిన్హా, అనుపమ్ ఖేర్, జావేద్ అక్తర్, ఫర్హాన్ అక్తర్, అభిషేక్ బచ్చన్, ఆశా భోంస్లే, సుమన్ కళ్యాణ్‌పూర్, సోనుష్కర్, ఉషా మంగే నిగమ్, ఉషా మంగే నిగమ్ వంటి ప్రముఖులు రోష‌న్ కుటుంబం గురించి డాక్యు సిరీస్ లో వెల్ల‌డించిన సంగ‌తులు ఆస‌క్తిని క‌లిగించాయి.

ఒక సంగీత విద్వాంసుడి వార‌సుడే అయినా రాకేష్ రోష‌న్ ఇండ‌స్ట్రీలో సహాయ దర్శకుడిగా తన సినీప్రయాణాన్ని ప్రారంభించాడు. తరువాత 1970లో 'ఘర్ ఘర్ కి కహానీ' చిత్రంతో నటుడిగా ఆరంగేట్రం చేశాడు. అతడు ఖుబ్సూరత్, ఖేల్ ఖేల్ మే, ఖట్టా మీఠా వంటి చిత్రాలలో నటించాడు. రాకేశ్ ఆ తర్వాత దర్శకనిర్మాత‌గా వృత్తిని ప్రారంభించాడు. ఖూన్ భారీ మాంగ్, కరణ్ అర్జున్, కహో నా ప్యార్ హై, కోయి మిల్ గయా, క్రిష్, క్రిష్2, క్రిష్ 3 వంటి భారీ చిత్రాల‌ను రూపొందించాడు.

'ది రోషన్స్' సిరీస్ చూసిన తర్వాత సాధార‌ణ ప్రజలు, పరిశ్రమ వ్య‌క్తుల‌ నుండి మీకు లభించిన ఉత్తమ ప్రశంస ఏమిటి? అని రాకేష్ రోష‌న్ ని ఈటీవీ భార‌త్ ప్ర‌శ్నించ‌గా, దానికి ఆయ‌న అనూహ్యంగా స్పందించారు. ''నేను నా కెరీర్‌లో 17 సినిమాలు తీశాను కానీ ఈ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ ప్రారంభమైన తర్వాత వ‌చ్చిన‌న్ని మెసేజ్ లు దేనికీ రాలేదు. ఈ అద్భుతమైన స్వ‌రాల్ని మీ నాన్నగారు కంపోజ్ చేశారని మాకు తెలియదు! అని ప్రజలు చెప్పినప్పుడు వినడం హార్ట్ ట‌చింగ్ గా అనిపించింది. కొంతమందికి నా సోదరుడు రాజేష్ ప‌నిత‌నం గురించి కూడా తెలీదు.. వారు నేను దర్శకత్వం వహించిన చిత్రాలను చూడటం మంచిది. న‌న్ను, హృతిక్ ని అభిమానించేవారి నుంచి నా తండ్రి పొందిన ప్రశంస నన్ను చాలా సంతోషపెట్టింది. నేను అతడి కోసం ఏదైనా చేయగలిగినందుకు చాలా సంతోషంగా ఉన్నాను'' అని అన్నారు.

''డాక్యు సిరీస్ నాలుగు గంటలు మాత్రమే.. కానీ నేను చాలా మాట్లాడాను. దాదాపు 100 గంటల ఫుటేజ్ ఉంది. నెట్‌ఫ్లిక్స్ కి కొన్ని మార్గదర్శకాలు ఉన్నందున సమయాభావం కారణంగా మనం గుర్తుంచుకోలేని అనేక విషయాలను ప్ర‌ద‌ర్శించ‌లేని ప‌రిస్థితి. ప్రజల డిమాండ్ మేరకు మేం వారిని మరొక భాగం చేయమని అడుగుతాము'' అంటూ రాకేష్ రోష‌న్ వెల్ల‌డించారు.