Begin typing your search above and press return to search.

జ‌న్మాష్ట‌మి స్పెష‌ల్: శ్రీ‌కృష్ణుడిగా ఈ స్టార్ హీరో యాప్ట్

అయితే తారక రాముని త‌ర్వాత మ‌ళ్లీ ఆ పాత్ర‌కు ఎవ‌రు యాప్ట్? అంటే దానికి ర‌కుల్ ప్రీత్ సింగ్ ఇచ్చిన స‌మాధానం ఆక‌ట్టుకుంది.

By:  Tupaki Desk   |   27 Aug 2024 5:40 AM GMT
జ‌న్మాష్ట‌మి స్పెష‌ల్: శ్రీ‌కృష్ణుడిగా ఈ స్టార్ హీరో యాప్ట్
X

టాలీవుడ్ హిస్ట‌రీలో శ్రీ‌కృష్ణుడిగా న‌టించిన చాలా మంది హీరోలు ఉన్నారు. కానీ లార్డ్ కృష్ణ స్ఫుర‌ద్రూపాన్ని త‌లుచుకోగానే ముందుగా గుర్తుకొచ్చేది న‌వ‌ర‌స‌న‌ట‌సార్వ‌భౌముడు నంద‌మూరి తారక రామారావు. ఆయ‌న‌ను అభిమానులు సాక్షాత్తూ కృష్ణుని అవ‌తారంగా కొలుస్తారు. అంత‌గా తార‌క రాముడు ఆ పౌరాణిక పాత్ర‌కు యాప్ట్ అయ్యారు. ఆయ‌న ఫోటోనే దేవుని గ‌దుల్లోను పెట్టుకుని పూజించిన రోజులున్నాయి. అయితే తారక రాముని త‌ర్వాత మ‌ళ్లీ ఆ పాత్ర‌కు ఎవ‌రు యాప్ట్? అంటే దానికి ర‌కుల్ ప్రీత్ సింగ్ ఇచ్చిన స‌మాధానం ఆక‌ట్టుకుంది.

ఈ సోమ‌వారం నాడు శ్రీ‌కృష్ణ జ‌న్మాష్ఠ‌మిని పుర‌స్క‌రించుకుని భార‌త‌దేశంతో పాటు దాదాపు 170 దేశాల్లో శ్రీ‌కృష్ణుని భ‌క్తులు స్వామివారికి పూజ‌లాచ‌రించారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న హిందువుల‌తో పాటు, క్రిస్టియ‌న్లు, ముస్లిములు దేవాది దేవుడు లార్డ్ శ్రీ‌కృష్ణుని 'అంత‌ర్జాతీయ కృష్ణ సేవా స‌మాజం (ఇస్కాన్)' ని సంద‌ర్శించ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశం. ఇదే స‌మ‌యంలో కృష్ణ భ‌క్తురాలు ర‌కుల్ ప్రీత్ సింగ్ కి ఒక ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌శ్న ఎదురైంది.

భారతీయ ఇతిహాసమైన మహాభారతాన్ని ఎప్పుడైనా సినిమాగా ప్లాన్ చేస్తే, శ్రీకృష్ణుడి పాత్రను రూపొందించడానికి ఆదర్శవంతమైన హీరో ఎవ‌రు? అనేదానిపై ఇటీవల రకుల్ ప్రీత్ సింగ్ తన అభిప్రాయాన్ని షేర్ చేసింది. ర‌కుల్ తొలిగా తన చిన్ననాటి జన్మాష్టమి వేడుకలను కూడా గుర్తుచేసుకుంది.

చిన్నప్పుడు స్కూల్‌లో మేము దహీ హండి గురించి చాలా ఉత్సాహంగా ఉండేవాళ్లం. ఈ వేడుకలో పాల్గొనడం చాలా సంతోషకరమైన అనుభవం. ఎన‌ర్జీతో పాటు టీమ్ వ‌ర్క్ ఈ పండుగ స్ఫూర్తి. అలాగే గత ఏడాది నేను మహారాష్ట్రలోని దహీ హండికి మొదటిసారిగా హాజరయ్యాను. ఆ అనుభవం నిజంగా అద్భుతమైనది... అని తెలిపింది. అంతేకాదు పాఠశాల నాటకంలో రాధ పాత్రను నేను పోషించినట్లు గుర్తుంది. అందమైన ఘూన్‌ఘట్, ఆభరణాలు, పూలతో సంప్రదాయ వస్త్రధారణలో క‌నిపించ‌డం చాలా ఉత్సాహంగా అనిపించింది. వేదికపై ప్రదర్శనలు ఇవ్వడం, నృత్యం చేయడం, స్నేహితులతో కలిసి ఆ వేడుకలో భాగం కావడం స్వచ్ఛమైన ఆనందాన్నిచ్చింది.. అని తెలిపింది. అలాగే తాను 'మధుర'ను సందర్శించినప్పటికీ జన్మాష్టమి సమయంలో నగరాన్ని సందర్శించే అవకాశం ఆమెకు ఎప్పుడూ లభించలేదని తెలిపింది. జన్మాష్టమి సమయంలో నేను అక్కడికి వెళ్లాలి, అది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అక్కడ ఉన్న శక్తి, ఆత్మ - భక్తితో సెల‌బ్రేష‌న్ చేస్తారు. ఇది చాలా అందమైన వేడుకగా ఉంటుంది. శ్రీకృష్ణుని సన్నిధిలోని గొప్ప అనుభూతితో ఒక దివ్య ప్రపంచంలోకి అడుగు పెట్టడం ఆనందాన్నిస్తుంది.. అని తెలిపింది.

మహాభారతాన్ని సినిమాగా తీస్తున్నారా? కృష్ణుడి పాత్రను ఎవరు పోషించాలని మీరు అనుకుంటున్నారు? అని ప్ర‌శ్నించ‌గా.. శ్రీకృష్ణుడు బహుముఖ పాత్రల‌తో తెలివైనవాడు, కొంటెవాడు, మనోహరమైనవాడు.. లోతైన ఆధ్యాత్మిక భావ‌న‌ను క‌లిగిస్తాడు. ఈ లక్షణాలన్నింటినీ సమతుల్యం చేయగల ఆదర్శవంత‌మైన హీరో ఎవ‌రున్నారు? అని అంటే..బహుశా మ‌హేష్ బాబు లేదా హృతిక్ రోషన్.. అని ర‌కుల్ అన్నారు. ఆ ఇద్ద‌రిలో ఎవరైనా కృష్ణుడి ఉల్లాసభరితమైన లోతైన పార్శ్వాలను తన శక్తి , బహుముఖ ప్రజ్ఞతో తెరపైకి తీసుకురాగలరు అని వ్యాఖ్యానించింది.

పండుగ సమయంలో తనకు ఇష్టమైన ప్రసాదం గురించి ర‌కుల్ మాట్లాడింది. ''నేను వ్యక్తిగతంగా జన్మాష్టమి నాడు ప్రసాదం వండలేదు.. కానీ ఇంట్లో తయారుచేసిన ప్రత్యేక ప్రసాదం, ఆహారాన్ని ఆస్వాధించిన జ్ఞాపకాలు మరచిపోలేనివి. నాకు ఇష్టమైనది ఎప్పుడూ మక్ఖాన్ మిశ్రి. ఇది నేను ప్రతి సంవత్సరం ఎదురుచూసే ప్ర‌సాదం'' అని తెలిపింది.

17 సినిమాల్లో శ్రీ‌కృష్ణుడిగా ఎన్టీఆర్

ఎన్టీఆర్ నాటి రోజుల్లో జాన‌ప‌ద పౌరాణికాల్లో శ్రీ‌కృష్ణుడి పాత్ర‌కు ఎంతో ప్రసిద్ధి చెందారు. ఆయ‌న‌ ఎన్ని సినిమాల్లో కృష్ణుడిగా క‌నిపించారు అంటే .. వివ‌రాల్లోకి వెళ్లాలి. మాయాబజార్ తో మొదలుపెట్టి.. వినాయకచవితి, దీపావళి, భక్త రఘునాథ్, శ్రీ కృష్ణార్జున యుద్ధం, కర్ణన్, వీరాభిమన్యు, శ్రీకృష్ణ తులాభారం, శ్రీ కృష్ణావతారం, శ్రీ కృష్ణ విజయం, కన్నన్ కరుణై, శ్రీకృష్ణాఆంజనేయ యుద్ధం, శ్రీమద్విరాట పర్వం.. ఇలా దాదాపు 17 సినిమాల్లో కృష్ణుడిగా ఎన్టీఆర్ నటించారు ఎన్టీఆర్. ఇందులో తమిళ్, తెలుగు సినిమాలు ఉన్నాయి. అన్ని సినిమాల్లో న‌టించారు గ‌నుక‌నే ఎన్టీఆర్ కృష్ణుడి వేషంలో ఉన్న ఫోటోల‌ను దేవుళ్ల గ‌దిలో పెట్టుకుని మ‌రీ పూజించారు జ‌నం.