Begin typing your search above and press return to search.

డ‌ల్లాస్‌లో OG ఫ్యాన్స్‌కి ఫుల్ కిక్కు ఇచ్చాడు

ఈ సంక్రాంతికి నా సినిమా లేక‌పోతే క‌ళ్యాణ్ బాబాయ్ ని బ‌ల‌వంతం చేసి అయినా 'ఓజీ'ని రిలీజ్ చేయ‌మ‌ని అడిగేవాడిని. నిజానికి సంక్రాంతి మా డేట్ కాదు.

By:  Tupaki Desk   |   23 Dec 2024 4:19 AM GMT
డ‌ల్లాస్‌లో OG ఫ్యాన్స్‌కి ఫుల్ కిక్కు ఇచ్చాడు
X

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టించిన 'గేమ్ ఛేంజ‌ర్' సంక్రాంతి- 2025 బ‌రిలో అత్యంత భారీగా విడుద‌లవుతున్న సంగ‌తి తెలిసిందే. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు అత్యంత భారీ బ‌డ్జెట్ తో నిర్మించారు. కియ‌రా అద్వాణీ క‌థానాయిక‌గా న‌టించగా, ఎస్.జే సూర్య విల‌న్ పాత్ర‌లో న‌టించారు.

ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుక డ‌ల్లాస్ (అమెరికా)లో అత్యంత వైభ‌వంగా జ‌రిగింది. వేలాదిగా త‌ర‌లి వ‌చ్చిన రామ్ చ‌ర‌ణ్ అభిమానులతో వేదిక సంద‌డిగా మారిన వీడియోలు ఇప్ప‌టికే వైర‌ల్ అయ్యాయి. వేదిక వ‌ద్ద మెగా ఫ్యాన్స్ ని ఉద్ధేశించి ప్ర‌సంగించిన చ‌ర‌ణ్ .. ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానుల‌ను ఉత్సాహ‌ప‌రుస్తూ 'ఓజీ' గురించి మాట్లాడారు.

ఈ సంక్రాంతికి నా సినిమా లేక‌పోతే క‌ళ్యాణ్ బాబాయ్ ని బ‌ల‌వంతం చేసి అయినా 'ఓజీ'ని రిలీజ్ చేయ‌మ‌ని అడిగేవాడిని. నిజానికి సంక్రాంతి మా డేట్ కాదు. డిసెంబ‌ర్ లో గేమ్ ఛేంజ‌ర్ రావాల్సి ఉంది. కానీ సంక్రాంతికి అవ‌కాశం ఇవ్వ‌మ‌ని నాన్న‌(చిరంజీవి)గారు, యువి క్రియేష‌న్స్ వారిని అభ్య‌ర్థించాము. అవ‌కాశం ఇచ్చినందుకు ధ‌న్య‌వాదాలు అని చ‌ర‌ణ్ అన్నారు. మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న 'విశ్వంభ‌ర' సంక్రాంతికి రావాల్సి ఉండ‌గా, డేట్ ని త‌న‌కోసం స‌ర్ధుబాటు చేసార‌ని చ‌ర‌ణ్ చెప్పారు.

అమెరికా మార్కెట్ చాలా పెద్ద‌ది:

ఇటీవ‌ల తెలుగు సినిమాల‌కు అమెరికా మార్కెట్ నుంచి సులువుగా 100 కోట్లు పైగా ఆదాయం ద‌క్కుతోంది. ఈ నేప‌థ్యంలో అమెరికాలో ఆద‌ర‌ణ‌పైనా చ‌ర‌ణ్ ప్ర‌శంస‌లు కురిపించారు. ఒక నైజాం .. ఒక‌ ఆంధ్రా ఏరియా లాగా పెద్ద మార్కెట్ ఇక్క‌డ ఉంది. భారీ క‌లెక్ష‌న్స్ వ‌స్తున్నాయి. నిజ‌మైన సినీప్రేమికులు మీరంతా. ఒక మంచి సినిమాని వ‌స్తే బాగా ఆద‌రిస్తున్నారు. మీరు మంచి క్రిటిక్స్ కూడా. ఎప్ప‌టికీ అలాగే ఉండండి.. అని చ‌ర‌ణ్‌ వ్యాఖ్యానించారు.

శంక‌ర్ అభిమానులంద‌రికీ గేమ్ ఛేంజ‌ర్ 'ది బెస్ట్ మూవీ' అవుతుంది. థియేట‌ర్ లోకి వెళితే మీరు ఒక మంచి సినిమా చూశామ‌ని ప్ర‌శంసిస్తారని చ‌ర‌ణ్ అన్నారు. గేమ్ ఛేంజ‌ర్ కి సంగీతం అందించిన థ‌మ‌న్ ని చ‌ర‌ణ్ ప్ర‌శంసించారు. థ‌మ‌న్ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. మాకంటే ఎక్కువ‌గా అమెరికాలో షోల‌తో అత‌డు మీకు ట‌చ్ లో ఉన్నాడు. గేమ్ ఛేంజ‌ర్ కు మంచి పాట‌లు ఇచ్చాడు. ఈ సినిమాకు పాట‌లు రాసిన లిరిసిస్టుల‌కు ధ‌న్య‌వాదాలు... అని అన్నారు.

ఆయ‌న నిజ జీవితంలోను వ‌యోలెంట్:

గేమ్ ఛేంజ‌ర్ లో విల‌న్ గా న‌టించిన ఎస్.జే సూర్య పైనా చ‌ర‌ణ్‌ ప్ర‌శంస‌లు కురిపించారు. చ‌ర‌ణ్ మాట్లాడుతూ-''నేను ఎస్.జే సూర్య గారి గురించి చెప్పి తీరాలి. ఈ సినిమాలో సూర్య చేసిన పాత్ర వ‌యొలెంట్ గా ఉంటుంది. ఆయ‌న నిజ జీవితంలో కూడా అలానే ఉంటారు. గేమ్ ఛేంజ‌ర్‌లో మా ఇద్ద‌రి మ‌ధ్యా వ‌చ్చే బెస్ట్ సీన్స్ మీరు చూడ‌బోతున్నారు. జీవితంలో క‌నీ వినీ ఎరుగ‌ని స‌న్నివేశాల్లో న‌టించాను. ఎస్.జే.సూర్య‌తో నువ్వా నేనా? అంటూ ఢీకొట్టే స‌న్నివేశాల్లో న‌టించే అవ‌కాశం క‌ల్పించారు శంక‌ర్. ఒక రాజ‌కీయ నాయ‌కుడితో ఐఏఎస్ అధికారి పోరాటానికి సంబంధించిన సీన్స్ అద్బుతంగా ఉంటాయి.. అని చ‌ర‌ణ్ అన్నారు. డ‌ల్లాస్ లో జ‌రిగిన ఈవెంట్లో దిల్ రాజు, ఎస్.జే సూర్య‌, బుచ్చిబాబు త‌దిత‌రులు పాల్గొన్నారు.