Begin typing your search above and press return to search.

మీకు తెలుసా.. సాయిరామ్‌ శంకర్‌తో మొదలైన 'చిరుత'

మెగా పవర్‌ స్టార్‌, గ్లోబల్ స్టార్‌గా వెలుగు వెలుగుతున్న రామ్‌ చరణ్ మొదటి సినిమా ఏంటి అనేది అందరికీ తెలిసిందే.

By:  Tupaki Desk   |   4 April 2025 7:30 AM
మీకు తెలుసా.. సాయిరామ్‌ శంకర్‌తో మొదలైన చిరుత
X

మెగా పవర్‌ స్టార్‌, గ్లోబల్ స్టార్‌గా వెలుగు వెలుగుతున్న రామ్‌ చరణ్ మొదటి సినిమా ఏంటి అనేది అందరికీ తెలిసిందే. డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ను 'చిరుత' సినిమాతో ప్రముఖ నిర్మాత అశ్వినీదత్‌ పరిచయం చేశారు. చిరుత సినిమాకు మంచి స్పందన వచ్చింది. హీరోగా రామ్‌ చరణ్‌ కు మంచి ఆరంభంను ఇచ్చిన విషయం తెల్సిందే. హీరోయిన్‌గా నేహా శర్మను చిరుత సినిమాతో పరిచయం చేశారు. ఆ సినిమాలోని హీరో, హీరోయిన్‌ పాత్రలకు మంచి గుర్తింపు దక్కడంతో పాటు, సినిమా కమర్షియల్‌గా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో రామ్‌ చరణ్‌ ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నాడు అనడంలో సందేహం లేదు.

'చిరుత' సినిమాతో చరణ్‌ను పరిచయం చేయాలనే ఆలోచన ఎవరిది, ముందుగా ఈ కథ ఎవరి వద్దకు వెళ్లింది, ఎక్కడ నుంచి ఎటు వచ్చింది అనే విషయాల గురించి ప్రముఖ రచయిత తోట ప్రసాద్‌ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆయన చెప్పిన దాని ప్రకారం 'చిరుత' కథను మొదట పూరి జగన్నాధ్‌ సోదరుడు సాయి రామ్‌ శంకర్‌ కోసం దర్శకుడు మెహర్‌ రమేష్‌ రాసుకున్నారు. మెహర్‌ రమేష్‌ స్క్రిప్ట్‌ వర్క్‌ అంతా పూర్తి చేయడంతో పాటు, బ్యాంకాక్‌లో సినిమా షూటింగ్‌ ప్రారంభించారు. కీలకమైన ఒక షెడ్యూల్‌ను ముగించారు. కానీ కొన్ని కారణాల వల్ల సినిమాను అక్కడే ఆపేశారు. కొన్నాళ్ల తర్వాత అదే కథ మెగా ఫ్యామిలీ ముందుకు వెళ్లింది.

అశ్వినీదత్‌కు మెహర్‌ రమేష్ వద్ద ఉన్న కథ గురించి తెలియడం, ఆ కథ గురించి పూరి జగన్నాధ్‌కి కూడా ఐడియా ఉండటంతో రామ్ చరణ్‌ను పరిచయం చేయడంకు పర్‌ఫెక్ట్‌ కథ అనే అభిప్రానయంకు వచ్చారట. సాయి రామ్‌ శంకర్‌తో అనుకున్న కథలో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసి, హీరో పాత్రను మరింత స్ట్రాంగ్‌గా చూపించే విధంగా క్లైమాక్స్‌ను డిజైన్‌ చేసి 'చిరుత' సినిమా కథను చిరంజీవి ముందు ఉంచగా ఆయన గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని, మెహర్‌ రమేష్ చేతిలో కాకుండా పూరి జగన్నాధ్‌ చేతిలో దర్శకత్వ బాధ్యతలు పెట్టినట్లు తెలుస్తోంది. సాయి రామ్‌ శంకర్‌ కి చిరుత సినిమా పడి ఉంటే కచ్చితంగా ఆయన కెరీర్‌ టర్న్‌ అయ్యి ఉండేది.

ప్రతి కథ మీద ఒక హీరో పేరు రాసి ఉంటుందని ఇండస్ట్రీలో నమ్ముతూ ఉంటారు. ఎన్నో సంవత్సరాలు కథ అటు ఇటు తిరిగి తన హీరో వద్దకు చేరుతుంది అంటారు. అలా సాయి రామ్‌ శంకర్‌తో ఒక షెడ్యూల్‌ పూర్తి అయినప్పటికీ చిరుత సినిమా కథ ఫైనల్‌గా రామ్‌ చరణ్ వద్దకు వచ్చి సక్సెస్‌ అయింది. చిరుత అనే టైటిల్‌ కూడా కుదరడంతో సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు చరణ్‌ను తండ్రికి తగ్గ తనయుడు అని నిలబెట్టింది. చరణ్‌ మొదటి సినిమాతో బలమైన పునాది దక్కించుకున్న కారణంగానే అద్భుతమైన సినిమాలను ఆయన చేయగలిగాడు, ఇంకా చేస్తున్నాడు అనడంలో సందేహం లేదు. చిరుత మిస్ అయిన మెహర్‌ రమేష్‌కి ఆ తర్వాత కొన్ని ఆఫర్లు వచ్చినా పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇప్పటికీ మెహర్‌ రమేష్, సాయి రామ్ శంకర్‌ల హిట్‌ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు.