Begin typing your search above and press return to search.

దిల్ రాజు - చరణ్.. ఇది అసలు మ్యాటర్!

టాలీవుడ్‌లో భారీ అంచనాల మధ్య విడుదలైన గేమ్ చేంజర్ అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

By:  Tupaki Desk   |   28 Jan 2025 10:44 AM GMT
దిల్ రాజు - చరణ్.. ఇది అసలు మ్యాటర్!
X

టాలీవుడ్‌లో భారీ అంచనాల మధ్య విడుదలైన గేమ్ చేంజర్ అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా డిజాస్టర్‌ తో నిర్మాత దిల్ రాజు భారీ నష్టాలను ఎదుర్కొన్నారు. ఇప్పటివరకు కెరీర్ లో ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలను నిర్మించిన దిల్ రాజు ఇలాంటి ఫలితాన్ని అయితే ఎదుర్కోలేదు. ఇక ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ఈ సినిమాతో దిల్ రాజుకు కనీసం 120 కోట్ల నష్టం వాటిల్లింది. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో వసూళ్లను సాధించకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది.

కేవలం దిల్ రాజుకి మాత్రమే కాదు సౌత్ ఇండస్ట్రీ మొత్తంలో కూడా అత్యధిక స్థాయిలో నష్టాలను కలిగించిన సినిమా ఇది. సాధారణంగా ఇలాంటి డిజాస్టర్‌ తర్వాత నిర్మాతలను ఆదుకోవడం హీరోలు లేదా దర్శకులు చేస్తుంటారు. మరో సినిమా తీసి పెట్టి నష్టాలను కవర్ చేసేందుకు ముందుకు వస్తుంటారు. గేమ్ చేంజర్ పరాజయం తర్వాత కూడా రామ్ చరణ్ దిల్ రాజుకు భరోసా ఇచ్చి, "మీ బ్యానర్‌లో మరో సినిమా చేస్తాను," అని చెప్పారన్న వార్తలు వ్యాపించాయి.

అయితే, ఈ విషయంపై చరణ్ పీఆర్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. చరణ్ ప్రస్తుత షెడ్యూల్ పూర్తిగా బిజీగా ఉందని పీఆర్ టీమ్ స్పష్టం చేసింది. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ 2025 వరకు పూర్తయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత చరణ్ సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమాను ప్రారంభించనున్నారు. ఈ సినిమా, సుకుమార్ స్టైల్‌ని అనుసరిస్తే, కనీసం రెండు సంవత్సరాలపాటు కొనసాగేలా ఉంటుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

దీంతో, 2027 వరకు చరణ్ కొత్త ప్రాజెక్టులు చేయడం సాధ్యం కాకపోవచ్చని తేలింది. దిల్ రాజు కూడా ఒక ఫ్లాప్ సినిమా తర్వాత హీరోల వెంట తిరిగే వ్యక్తి కాదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. తాత్కాలిక లాభాల కంటే, శాశ్వతమైన వ్యూహాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారన్న పేరుంది. గేమ్ చేంజర్ నష్టాలను సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ద్వారా ఆయన కొంతవరకు పూడ్చుకున్నారు.

ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టి 100 కోట్లకు పైగా వరకు ప్రాఫిట్స్ ఇవ్వడంతో, దిల్ రాజు ఆర్థికంగా మళ్లీ స్థిరపడినట్లు అనిపిస్తోంది. రామ్ చరణ్ - దిల్ రాజు కాంబినేషన్ మరోసారి వస్తుందా లేదా అన్నది ప్రస్తుతం అయితే నిజం కాదని ఓ క్లారిటీ వచ్చింది. అలాగే శంకర్ తో కూడా రాజు మరో సినిమా చేయకపోవచ్చు. ఇక నుంచి దిల్ రాజు మీడియం రేంజ్ సినిమాలను చేస్తూ కొత్త ప్రాజెక్టులపై దృష్టి పెట్టే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.