Begin typing your search above and press return to search.

అభిమానుల మృతిపై చరణ్ ఎమోషనల్.. ఆ కుటుంబాలకు ఆర్థికసాయం

రాజమండ్రిలో జనవరి 4న జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ వేడుక భారీగా నిర్వహించిన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   6 Jan 2025 9:21 AM GMT
అభిమానుల మృతిపై చరణ్ ఎమోషనల్.. ఆ కుటుంబాలకు ఆర్థికసాయం
X

రాజమండ్రిలో జనవరి 4న జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ వేడుక భారీగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. అయితే ఈ వేడుక అనంతరం చోటుచేసుకున్న ప్రమాదం అందరిని విషాదంలోకి నెట్టింది. ఈ ఘటనలో కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ (23), తోకాడ చరణ్ (22) ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.

వీరు వేడుక అనంతరం ద్విచక్ర వాహనంపై ఇళ్లకు వెళ్తుండగా వాడిసలేరు వద్ద వ్యాన్ ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. రామ్ చరణ్ ఈ వార్త విన్న వెంటనే తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు. తన సిబ్బందిని బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు పంపి, మానసిక దైర్యం కల్పించారు.

అంతేకాదు, ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఆయన ఈ విషాదం గురించి మాట్లాడుతూ, "మన కార్యక్రమాలకు హాజరైన అభిమానులు సురక్షితంగా ఇళ్లకు చేరుకోవాలని ఎల్లప్పుడూ మనస్ఫూర్తిగా కోరుకుంటాం. కానీ ఈ సంఘటన ఎంతో విచారకరం. బాధిత కుటుంబాల ఆవేదనను నేను పూర్తిగా అర్థం చేసుకుంటున్నాను. నా ప్రగాఢ సానుభూతి వారికి ఉంటుంది" అని చెప్పారు.

వేడుకలో పాల్గొన్న అభిమానులకు అందరూ సురక్షితంగా తిరిగి వెళ్లాలని పవన్ కళ్యాణ్ కూడా ఈవెంట్ లో సూచించిన విషయం తెలిసిందే. ఈ సంఘటన నేపథ్యంలో రోడ్డు భద్రతపై మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. మృతుల కుటుంబాలకు జనసేన పార్టీ తరఫున అదనంగా రూ.5 లక్షల సాయం అందించనున్నట్లు ప్రకటించారు.

ఈ సంఘటన గేమ్ ఛేంజర్ చిత్ర యూనిట్‌ను తీవ్రంగా కలచివేసింది. రామ్ చరణ్ చూపించిన సానుభూతి అభిమాన హృదయాలను ద్రవింపజేసింది. ఈ సంఘటన నుంచి అందరూ పాఠాలు నేర్చుకోవాలని, భవిష్యత్‌లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. అలాగే నిర్మాత దిల్ రాజు కూడా ఒక్కో కుటుంబానికి 5 లక్షల ఆర్థిక సాయం అందించారు.