చరణ్ ఆడించే 'గేమ్'.. అన్ ప్రిడిక్టబుల్
ఒకటిన్నర నిమిషాల నిడివితో కట్ చేసిన ఈ వీడియో.. శంకర్ మార్క్ గ్రాండ్ విజువల్స్ తో చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకుంటోంది.
By: Tupaki Desk | 10 Nov 2024 3:31 AM GMTగ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ పాన్ ఇండియా చిత్రం ''గేమ్ చేంజర్''. కార్తీక్ సుబ్బరాజు కథ అందించగా.. దిల్ రాజు నిర్మిస్తున్నారు. మూడేళ్ళకు పైగా నిర్మాణంలో ఉన్న ఈ పొలిటికల్ యాక్షన్ మూవీ ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో లక్నో వేదికగా ప్రమోషనల్ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. గ్రాండ్ గా టీజర్ ను లాంచ్ చేసారు. ఒకటిన్నర నిమిషాల నిడివితో కట్ చేసిన ఈ వీడియో.. శంకర్ మార్క్ గ్రాండ్ విజువల్స్ తో చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకుంటోంది.
'గేమ్ చేంజర్' సినిమాలో తండ్రీకొడులుగా రామ్ చరణ్ రెండు పాత్రల్లో కనిపించనున్న సంగతి ముందుగానే రివీల్ అయింది. ఇప్పుడు టీజర్ లో రెండు పాత్రలనూ పరిచయం చేస్తూ.. ఇద్దరినీ బ్యాలెన్స్ చేసి చూపించారు. కాకపోతే ఆల్రెడీ రెండు పాత్రలకు సంబంధించిన లుక్స్ లీక్ అవడంతో, ఇప్పుడు ఎగ్జైటింగ్ గా ఏమీ అనిపించదు. అయితే సినిమాలో చెర్రీ మూడు గెటప్స్ ను చూపించి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసారు. తండ్రి అప్పన్న పాత్ర పంచె కట్టు లాల్ఛీలో ఒక రైతుగా కనిపించగా.. కొడుకు రామ్ నందన్ మాత్రం రెండు గెటప్స్ లో కనిపించాడు.
కాలేజ్ స్టూడెంట్ గా లాంగ్ హెయిర్ గడ్డం మీసాలతో కొన్ని చోట్ల, ఐఎఎస్ ఆఫీసర్ గా క్లీన్ షేవ్ లో మరికొన్ని చోట్ల కనిపించాడు చరణ్. బేసిక్ గా అతను మంచోడే కానీ, కోపం వస్తే మాత్రం తనను ఎవరూ కంట్రోల్ చెయ్యలేరు అనే విధంగా ఆ పాత్రను చూపించారు. ఇక పొలిటీషియన్ గా నాలుగో గెటప్ కూడా ఉందేమో అనిపిస్తోంది. యాక్షన్ కు కొదువ లేదని హింట్ ఇచ్చారు. అలానే తండ్రి చెప్పులు పట్టుకొని కొడుకు పాత్ర ఏడ్చే సీన్, కోపంతో బిగ్గరగా అరిచే సన్నివేశాలను బట్టి చూస్తే ఎమోషనల్ కంటెంట్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
అప్పన్న పాత్రకు జోడీ అయిన అంజలి ఒక జాతర సాంగ్ లో స్టెప్పులేస్తూ కనిపించింది. కియారా అద్వానీకి కాస్త ఎక్కువ స్క్రీన్ స్పేస్ దొరికింది. సాంగ్ బిట్స్ లో గ్లామర్ లుక్స్ లో కనిపించడంతో పాటు, ఒక చిన్న డైలాగ్ కూడా వినిపించింది. ఎస్.జె సూర్యతో పాటుగా శ్రీకాంత్, జయరాం, నవీన్ చంద్ర నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు పోషించారు. వయసు మీద పడిన వ్యక్తిగా శ్రీకాంత్ ఇంతకముందెన్నడూ చూడని గెటప్ లో కనిపించారు. సముద్రఖని, అచ్యుత్ కుమార్, సునీల్, వెన్నెల కిశోర్, నరేష్.. తలొక షాట్ లో తళుక్కున మెరిశారు.
టీజర్ లో పవర్ ఫుల్ పంచ్ డైలాగ్స్ కానీ, వన్ లైనర్స్ కానీ ఏమీ లేవు. చివర్లో 'ఐ యామ్ అన్ ప్రిడిక్టబుల్' అని రామ్ చరణ్ చెప్పే డైలాగ్ తో సినిమా అతని పాత్ర ఎలా ఉంటుందో అనే ఆసక్తిని కలిగించారు. ఏం చేసాడు వాడు అని విలన్లు షాక్ అవ్వడాన్ని బట్టి చూస్తే, అతని అన్ ప్రిడిక్టబుల్ గేమ్ ప్లాన్స్ కథలో కీలకమని తెలుస్తోంది. ఓవరాల్ గా అన్ని అంశాలతో ఒక కమర్షియల్ ప్యాకేజ్ గా 'గేమ్ చేంజర్' టీజర్ ను కట్ చేసారు. మెగా ఫ్యాన్స్ తో పాటుగా అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేసారు. శంకర్ గత చిత్రాల తరహాలోనే ప్రతీ ఫ్రేమ్ కలర్ ఫుల్ విజువల్స్ తో, జనాలతో నిండిపోయి చాలా గ్రాండ్ గా కనిపించింది.