60 ప్లస్ లో వర్మ అంత కసితో సాధ్యమయ్యేనా?
ఆ సినిమాకు ఇప్పుడు కూడా గొప్ప రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రాన్ని చూసిన వర్మలో రియలైజేషన్ మొదలైంది.
By: Tupaki Desk | 20 Jan 2025 4:30 PM GMTవర్మ మార్క్ సినిమా రిలీజ్ అయి కొన్ని సంవత్సరాలవుతుంది. గత కొంత కాలంగా వర్మ సినిమాలు ఎలా ఉంటు న్నాయో చెప్పాల్సిన పనిలేదు. బయోపిక్ లు..వాస్తవ సంఘటనలు ఆధారంగా ఆయన చేస్తోన్న సినిమాలు సక్సెస్ అవుతున్నాయా? పోతున్నాయా? సంగతి అటుంచిదే ఆయన్ని తీవ్ర వివాదాల పాలైతే చేస్తున్నాయి. ప్రతిగా కేసులు..కోర్టులు...జైళ్లు అంటూ ఆయన ప్రతిష్ట దెబ్బతినే వ్యవహారమే కనిపిస్తుంది.
ఇంకా చెప్పాలంటే వర్మ అంటే ఇదీ అని 'ముంబై ఎటాక్ సినిమా తర్వాత మళ్లీ ఆ రేంజ్ సినిమా వర్మ చేయలేదు. చెప్పుకోవడానికి చాలా సినిమాలు చేసారు. కానీ అవేవి కూడా వర్మని బౌన్స్ బ్యాక్ చేయలేకపోయాయి. ఈ క్రమంలో వర్మ అభిమానులు ఎంతో నిరుత్సాహానికి గురయ్యారు. గురువు గారు ఇలాంటి సినిమాలు చేస్తున్నారంటే ప్రియ శిష్యుడు పూరి జగన్నాధ్ కూడా ఒకానొక సందర్భంలో వాపోయారు.
ఇంకా వర్మ వీరాభిమాని అయిన స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ సైతం ఇది నేను చూసిన వర్మ కాదు... ఆ వర్మ వేరే ఉన్నారు? ఆవర్మని బయటకు తీయడం లేదంటూ ఎన్నో వేదికలపై వ్యాఖ్యా నించారు. అయినా సరే వర్మ రియలైజ్ అవ్వలేదు. అవన్నీ వర్మ చెవికి తాటాకు చప్పుడులాగా వినిపించాయి తప్ప వాటిని సీరియస్ గా తీసుకోలేదు. అయితే ఇటీవలే వర్మ తెరకెక్కించిన 'సత్య' మళ్లీ రీ-రిలీజ్ అయింది.
ఆ సినిమాకు ఇప్పుడు కూడా గొప్ప రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రాన్ని చూసిన వర్మలో రియలైజేషన్ మొదలైంది. ఇంతకాలం తానెంతగా సమయం వృద్దా చేసాడు అన్నది తన సత్యనే మళ్లీ ఆయన్ని తట్టి లేపింది. సత్య తీసే టైంలో ఉన్న నిజాయితీ కొరవడిందని, సినిమా చూసి ఇంటికొచ్చాక ఆయన్ని ఒకరకమైన శూన్య ఆవ హించిందని, ఇకపై మేల్కొని పాత వర్మని చూపిస్తాను అన్న రేంజ్ లో ఓ పోస్ట్ పెట్టారు వర్మ.
ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. దీంతో వర్మ అభిమానులు వర్మ ఈజ్ బ్యాక్ అంటూ సమర్ధిస్తున్నారు. అయితే ప్రస్తుతం వర్మ వయసు 62 ఏళ్లు. 'సత్య' సినిమా రిలీజ్ అయ్యే సమయానికి వర్మ వయసు 36 ఏళ్లు. మరి 62 ఏళ్ల వయసులో 36 వర్మని మళ్లీ తలపించాలంటే? ఓ భారీ బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాతే మాట్లాడాలి.