ట్రెండింగ్... వెర్ ఈజ్ ఆర్జీవీ!
సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అరెస్టుకు రంగం సిద్ధమైందని తెలుస్తోంది.
By: Tupaki Desk | 25 Nov 2024 8:20 AM GMTసినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అరెస్టుకు రంగం సిద్ధమైందని తెలుస్తోంది. ఆచూకీ తెలిస్తే ఏ క్షణమైనా అరెస్ట్ చేసేందుకు, మద్దెపాడుకు తీసుకువెళ్లేందుకు పోలీసులు ఆర్జీవీ నివాసానికి చేరుకున్నారు. ఇద్దరు ఎస్సైలతో పాటూ ఆరుగురు పోలీసులు ప్రస్తుతం వర్మ ఇంటివద్ద ఉన్నారని తెలుస్తోంది. అయితే వర్మ మాత్రం ఇంట్లో లేరు!
అవును... ప్రకాశం జిల్లా మద్దెపాడుకు చెందిన టీడీపీ నేత ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఈ నెల 19న విచారణకు రావాల్సిందిగా వర్మకు హైదరాబాద్ వచ్చి నోటీసులు అందించారు. అయితే.. తనకు నాలుగు రోజుల సమయం కావాలని వర్మ వాట్సప్ లో పోలీసులకు మెసేజ్ చేశారు. దీంతో.. ఈ నెల 25న విచారణకు రావాలని మరో నోటీసు పంపించారు.
అయితే.. మొదట నోటీసు అందిన అనంతరం అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ విజ్ఞప్తిని ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం.. ముందస్తు బెయిల్ కోరుతూ మరో పిటిషన్ వేశారు వర్మ. దీనిపై ప్రస్తుతం విచారణ జరుగుతుందని అంటున్నారు. అయితే ఈ లోపు విచారణ తేదీ రానే వచ్చింది.
అయినప్పటికీ వర్మ విచారణకు హాజరుకాకపోవడంతో ఏపీ పోలీసులు హైదరాబాద్ లోని ఆయన నివాసానికి చేరుకున్నారు. అయితే... ఆర్జీవీ మాత్రం ఇంట్లో లేరని అంటున్నారు. నిన్న ఆర్జీవీ ఎక్స్ లో మోహన్ లాల్ తో ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు! ఈ నేపథంలో వర్మ.. తమిళనాడులోని కోయంబత్తూరులో ఉండి ఉంటారనే చర్చ తెరపైకి వచ్చింది.
మరోపక్క వర్మ ఫోన్ స్విచ్చాఫ్ వస్తోందని అంటున్నారు. ఈ రోజు ఇప్పటివరకూ ఎక్స్ లో ఎలాంటి అప్ డేట్స్ లేవు. మరోపక్క.. డిజిటల్ మోడ్ లో విచారణకు జారవుతానని ఆర్జీవీ రిక్వస్ట్ చేస్తున్నారు. అయితే.. అందుకు అవకాశం లేదని పోలీసులు తేల్చి చెప్పారు. విచారణకు రావాల్సిందే అని అంటున్నారు.
పోలీసులు ఇచ్చిన నోటీసులను దిక్కరించారు కాబట్టే.. చట్టప్రకారం అతన్ని అరెస్ట్ చేస్తామని చెబుతున్నారని అంటున్నారు! దీంతో ఇప్పుడు "వేర్ ఈజ్ ఆర్జీవీ?" అనే విషయంలో ఏపీ పోలీసులు సెర్చ్ మొదలైందని చెబుతున్నారు! ఈ సమయంలో ఆర్జీవీని ట్రాక్ చేసేందుకు తెలంగాణ పోలీసుల సాయం కోరనున్నారని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో... తాజా పరిణామాలపై ఆర్జీవీ లాయర్ స్పందించారు. దేశం ఇంత అభివృద్ధి చెంది ముందుకు వెళ్తున్న కారణంగా ఫిజికల్ గా కాకుండా వర్చువల్ గా హాజరవుతారని చెబుతున్నామన్నారు! పైగా ఆయన బిజీ డైరెక్టర్ కావడంతో ఆ సదుపాయాన్ని కోరినట్లు తెలిపారు. ఈ సమయంలో తెరపైకి థర్డ్ డిగ్రీ ప్రస్థావన వచ్చింది.
ఇందులో భాగంగా... ఇలా పోలీసు విచారణకు హాజరుకాకుండా వర్మ తప్పించుకుంటున్నారని.. అంటే థర్డ్ డిగ్రీకి వర్మ భయపడ్డారా? అంటూ మీడియా ప్రశ్నించింది! దీనికి సమాధానంగా స్పందించిన లాయర్.. వర్మ థర్డ్ డిగ్రీకి భయపడడు అని చెప్పుకొచ్చారు! ఏది ఏమైనా... వర్మ ఇప్పుడు ఎక్కడున్నారనేది ఆసక్తిగా మారింది