వరుసగా రెండు షోలు చూస్తున్న వర్మ...
మ్యాటనీ ఆట ఉంది.. బోటనీ క్లాస్ ఉంది.. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చిత్రం శివలో సూపర్ హిట్ పాట ఇది.
By: Tupaki Desk | 7 Feb 2025 3:04 PM GMTమ్యాటనీ ఆట ఉంది.. బోటనీ క్లాస్ ఉంది.. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చిత్రం శివలో సూపర్ హిట్ పాట ఇది. ఒకపూట సినిమా చూడటానికి జనం ఎంత ఆసక్తి చూపుతారో వివరిస్తూ సాగిపోతోంది ఆ పాట. అయితే ఇప్పుడు అదే వర్మకు పోలీసులు మార్నింగ్ షో సమయానికి స్టేషనులోకి తీసుకువెళ్లారు. మ్యాట్నీ ముగిసి.. ఫస్ట్ షో మొదలవుతున్నా.. వర్మ మాత్రం పోలీసు స్టేషన్ నుంచి బయటకు రాలేదు. హర్రర్, మాఫియా చిత్రాలకు దర్శకత్వం వహించి సంచనల విజయాలు నమోదు చేసిన వర్మ.. తన జీవితంలో ఇలాంటి రోజు ఒకటి వస్తుందని అసలు ఊహించి ఉండరు. తన సినిమాల్లో ఎందరో పోలీసు విలన్స్ ను విలన్ హీరోలను చూపించిన వర్మ.. ఇప్పుడు తన విచారణ సమయంలో ఏ పాత్రను ఊహించుకుంటున్నాడో? తెలియడం లేదని అంటున్నారు.
తెలుగు సినిమా రంగం నుంచి బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు వెళ్లి బాక్సీఫీసును బద్ధలు కొట్టిన ఎన్నో చిత్రాలకు దర్శకత్వం వహించారు వర్మ. ముంబై మాఫియా ఎలా పనిచేస్తుందో వివరిస్తూ ఆయన రూపొందించిన చిత్రం కంపెనీ బాలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీ. అంతటి పేరున్న దర్శకుడు ఓ చిన్న కేసులో రోజంతా పోలీసుల ఎదుట కూర్చోవడం ఖర్మ ఫలమనే విమర్శలు వినిపిస్తున్నాయి. ‘అంతా నా ఇష్టం’ అని చెప్పుకునే వర్మ తొలిసారిగా తనకు ఇష్టంలేని పనిచేస్తున్నాడని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఎన్ని విమర్శలు వచ్చినా సినిమాల్లో తాను అనుకున్న విధంగానే కథను రూపొందించేవాడు వర్మ. తన సినిమా తన ఇష్టం అన్నట్లు ఉండేది ఆయన వెర్షన్. లాభనష్టాలతో పనిలేకుండా మొండిగా వ్యవహరించడం వల్ల కొన్నిసార్లు ఆయనకు కలిసి వచ్చింది. మరికొన్నిసార్లు నష్టమూ వచ్చింది. అయితే లాభాలు వచ్చినప్పుడు పొంగిపోని వర్మ.. నష్టాలు వచ్చాయని కుంగిపోలేదు. నేనింతే.. ఇలానే ఉంటానని బతికాడు. కానీ, తనకు సంబంధంలేని రాజకీయాల్లో తలదూర్చి ప్రస్తుతం నిందితుడిగా పోలీసు మెట్లు ఎక్కడం ఆర్జీవీ జీవితంలో పెద్ద సంఘటనగా చెబుతున్నారు. గతంలో ముంబైలో తీవ్ర దాడుల సందర్భంగా అప్పటి కేంద్ర హోంమంత్రితో కలిసి తిరిగిన పెద్ద మనిషి వర్మ.. ఈ రోజు చేతులు ముడుచుకుని.. పోలీసులు అడిగిన ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పాల్సి వస్తుందని ఎప్పుడూ ఊహించి ఉండరని అంటున్నారు.
ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికీ తెలియదు.. చివరికి తనపై తనకే ఓ అంచనా ఉండదన్నట్లు నడుచుకున్న వర్మ.. ఒక్క ఫొటో మార్ఫింగ్ కేసులో ఇరుక్కోవడం పెద్ద విషయమేనంటున్నారు. కేసు చిన్నదైనా వర్మ సాధించిన విజయాలు, ఆయన ఒకప్పటి స్థాయికి ఇది మచ్చగా మిగిలిపోతుందని అంటున్నారు.