రామ్ పోతినేని.. లైన్ లో మరో దర్శకుడు?
దీని కంటే ముందే రామ్ కొంతమంది దర్శకులతో చర్చలు జరిపాడు.
By: Tupaki Desk | 17 March 2025 3:00 PM ISTఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనికి ఇటీవల వరుస అపజయాలు ఎదురయ్యాయి. ‘ఇస్మార్ట్ శంకర్’తో మళ్లీ తన కెరీర్‌ను బూస్ట్ చేసుకున్న రామ్, అదే మాస్ ట్రాక్‌ను కొనసాగించాలని అనుకున్నాడు. కానీ ‘ది వారియర్’, ‘స్కంద’ లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. చివరగా భారీ అంచనాల నడుమ విడుదలైన ‘డబుల్ ఇస్మార్ట్’ ఊహించని విధంగా డిజాస్టర్‌గా మిగిలింది. పూరి జగన్నాథ్‌తో మళ్లీ హిట్ కొట్టాలని చూస్తే, ఆ సినిమా రామ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్‌గా మారింది.
దీంతో, రామ్ తన తదుపరి ప్రాజెక్ట్‌పై ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ప్రస్తుతం రామ్ మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి దర్శకుడు పి. మహేష్ తో లవ్ డ్రామా చేస్తున్నాడు. గతంలో మాస్ మసాలా యాక్షన్ సినిమాలకే ఎక్కువగా మొగ్గుచూపిన రామ్, ఈసారి రొమాంటిక్ కథతో మళ్లీ తన యూత్ ఫ్యాన్ బేస్‌ను బలపర్చాలని చూస్తున్నట్లు సమాచారం. రామ్ తన స్టైల్‌కు తగ్గ కథను మహేష్ నుంచి వినిపించుకున్నాడని తెలుస్తోంది.
దీని కంటే ముందే రామ్ కొంతమంది దర్శకులతో చర్చలు జరిపాడు. హరీష్ శంకర్ వంటి దర్శకులతో కథలు విన్నట్లు సమాచారం. అలాగే, నాని హీరోగా ‘హిట్ 3’ తెరకెక్కిస్తున్న శైలేష్ తో కూడా ఒక మిస్టరీ థ్రిల్లర్ చేయడానికి సితార ఎంటర్టైన్మెంట్స్ ఆలోచిస్తోందని గతంలో టాక్ వచ్చింది. అయితే ఈ ప్రాజెక్ట్ ఓకే అయ్యిందా లేదా అనేది ఇంకా స్పష్టత రాలేదు. మొత్తంగా, రామ్ తన తదుపరి ప్రాజెక్ట్స్ హిట్ అవ్వాలనే ఉద్దేశంతో చాలా కేర్ తీసుకుంటున్నాడు.
అయితే, ఇటీవలి గాసిప్స్‌లో రామ్, కార్తికేయ 2- తండేల్ ఫేమ్ చందూ మొండేటితో ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో ఈ ప్రాజెక్ట్ ఉంటుందని టాక్ షురూ అయ్యింది. కానీ, తాజా సమాచారం ప్రకారం ఇది పూర్తిగా ఫేక్ న్యూస్ అని తేలింది. గీతా సంస్థకు ఈ ప్రాజెక్ట్‌తో ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ వచ్చింది. రామ్ కూడా చందూతో ప్రాజెక్ట్ డిస్కస్ చేయలేదట. ఫ్యాన్స్ మాత్రం ఈ కాంబో జరిగితే బాగుంటుందని భావించినా, ఇది మరో గాలి వార్తగానే మిగిలిపోయింది.
ఇదిలా ఉండగా, రామ్ మరో టాప్ డైరెక్టర్‌తో సినిమా చేసే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. ‘గద్దలకొండ గణేష్’ ఫేమ్ హరీష్ శంకర్, డైరెక్షన్‌లో ఒక ప్రాజెక్ట్ చేసే అవకాసం ఉందని సమాచారం. రామ్ ఇప్పుడిప్పుడు హిట్టు కొట్టి తిరిగి తన మాస్ ఇమేజ్‌ను నిలబెట్టుకోవాలని చూస్తున్నాడు. మరి రామ్ తదుపరి సినిమా ఏ దర్శకుడితో ఫైనల్ అవుతుందనేది చూడాలి.