Begin typing your search above and press return to search.

పార్లమెంట్‌కి చరణ్‌... కారణం ఏంటంటే!

ఇప్పటికే షూటింగ్‌ ప్రారంభం అయిన ఈ సినిమాలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   19 March 2025 4:47 PM IST
పార్లమెంట్‌కి చరణ్‌... కారణం ఏంటంటే!
X

రామ్‌ చరణ్‌ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. మొదటి సినిమా 'ఉప్పెన'తో దర్శకుడిగా సూపర్‌ హిట్ సొంతం చేసుకున్న బుచ్చిబాబు రెండో సినిమానే చరణ్‌ తో చేసే అవకాశం దక్కించుకోవడం విశేషం. ఉప్పెన సినిమాతో వంద కోట్లకు పైగా వసూళ్లు దక్కించుకున్న బుచ్చిబాబు తన గురువును ఆదర్శంగా తీసుకుని విభిన్నమైన సినిమాలను రూపొందించే ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగానే రామ్ చరణ్‌తో ప్రస్తుతం ఒక భారీ స్పోర్ట్స్ డ్రామాను రూపొందించేందుకు గాను సిద్ధం అయ్యాడు. ఇప్పటికే షూటింగ్‌ ప్రారంభం అయిన ఈ సినిమాలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే.

కన్నడ సూపర్‌ స్టార్‌ శివ రాజ్ కుమార్‌ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ మొన్నటి వరకు హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌ సిటీలో, శివారు ప్రాంతంలో చిత్రీకరణ జరిగిన విషయం తెల్సిందే. త్వరలో సినిమా షూటింగ్‌ కోసం యూనిట్‌ సభ్యులు ఢిల్లీ వెళ్లనున్నారు. కథలో భాగంగా కొన్ని కీలక సన్నివేశాలను ఢిల్లీలోని పార్లమెంట్‌ ఆవరణలో చిత్రీకరించాల్సి ఉందట. అంతే కాకుండా జామా మసీదు పరిసర ప్రాంతాల్లోనూ సినిమా షూటింగ్‌ నిర్వహించేందుకు బుచ్చిబాబు ప్లాన్‌ చేశాడు. అందుకోసం ఇప్పటికే అనుమతులు తీసుకున్నారని, త్వరలోనే చరణ్‌తో పాటు కీలక నటీనటులు, సాంకేతిక నిపుణుల బృందం ఢిల్లీ వెళ్లే అవకాశాలు ఉన్నాయి.

స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ వివిధ ఆటలు ఆడుతూ కనిపించనున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా స్పోర్ట్స్ డ్రామా అంటే ఒకే ఆట నేపథ్యంలో సాగుతూ ఉంటుంది. కానీ ఈ సినిమాలో మాత్రం రామ్ చరణ్‌ పలు ఆటల క్రీడాకారుడిగా కనిపించనున్నాడట. ఆట కూలీ పాత్రలో రామ్ చరణ్ కనిపించబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈమధ్య కాలంలో ఎప్పుడూ చూడని వైవిధ్యభరిత కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందుతున్నట్లు సమాచారం అందుతోంది. రామ్‌ చరణ్‌ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయాలని భావిస్తున్నారు. అదే సమయంలో సినిమా టైటిల్‌ను రివీల్‌ చేసే అవకాశాలు ఉన్నాయి.

రామ్‌ చరణ్‌ గత చిత్రం 'గేమ్‌ ఛేంజర్‌' బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశ పరిచింది. దాంతో మెగా ఫ్యాన్స్ బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా పెంచుకున్నారు. ఈ సినిమా షూటింగ్ అనుకున్న దాని కంటే స్పీడ్‌గా జరుగుతుందని, ఇదే ఏడాదిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ఉద్దేశం ఉన్నట్లు తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్‌తో కలిసి వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఆస్కార్‌ అవార్డ్‌ గ్రహీత ఏ ఆర్‌ రెహమాన్‌ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్న నేపథ్యంలో అంచనాలు మరింతగా పెరిగాయి. దేవర సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్‌ ఈ సినిమాతో తన స్థానంను మరింత పదిలం చేసుకునే అవకాశాలు ఉన్నాయి.