Begin typing your search above and press return to search.

ఒకే దెబ్బకు రెండు పిట్టలు.. రామానాయుడు స్టుడియో భూములపై ప్రభుత్వం పక్కా వ్యూహం!?

టీడీపీకి అత్యంత సన్నిహితమైన సురేశ్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుబాటి వెంకట్ నుంచి భూములను వెనక్కి తీసుకోవడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.

By:  Tupaki Desk   |   4 April 2025 11:30 AM
ఒకే దెబ్బకు రెండు పిట్టలు.. రామానాయుడు స్టుడియో భూములపై ప్రభుత్వం పక్కా వ్యూహం!?
X

విశాఖలో విలువైన రామానాయుడు స్టుడియో భూములను వెనక్కి తీసుకుంటూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2003లో చంద్రబాబు ప్రభుత్వమే కేటాయించిన భూములను తిరిగి తీసుకోనుండటం వెనుక పక్కా రాజకీయ వ్యూహం ఉందని అంటున్నారు. ఈ వ్యవహారంలో వైసీపీలోని కీలక నేతలకు షాక్ ఇవ్వడమే కాకుండా దగ్గుబాటి కుటుంబానికి కూడా ప్రభుత్వం ఝలక్ ఇచ్చినట్లు చెబుతున్నారు. విశాఖ సాగర తీరం ఎదురుగా కొండపై సురేశ్ ప్రొడక్షన్స్ కోసం రెండు దశాబ్దాల క్రితం ప్రభుత్వం భూములు కేటాయించింది. ఇందులో కొంత నిర్మాణం చేపట్టగా, చాలావరకు ఖాళీగా ఉండిపోయింది. ఆ ఖాళీ స్థలంలో లే-అవుట్ వేయడానికి గత ప్రభుత్వంలో ప్రయత్నాలు జరిగాయి. అయితే టీడీపీ నేతలు కోర్టుకు వెళ్లడంతో రామానాయుడు స్టుడియో భూములపై స్టే విధించారు. ఇప్పుడు గతంలో కేటాయించిన భూమిలో 15. 17 ఎకరాలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని అనుకోవడం సంచలనం రేపుతోంది.

టీడీపీకి అత్యంత సన్నిహితమైన సురేశ్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుబాటి వెంకట్ నుంచి భూములను వెనక్కి తీసుకోవడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. అయితే ఆ భూములు దగ్గుబాటి కుటుంబం చేతిలో లేవని, వాటిని వైసీపీ నేతలు బలవంతంగా లాగేసు కోవడంతోనే ప్రభుత్వం చర్యలు తీసుకుందని టీడీపీ వాదిస్తోంది. మొత్తానికి ప్రభుత్వ నిర్ణయంతో విలువైన స్థలం ప్రజలకు దక్కిందని అంటున్నారు. సురేశ్ ప్రొడక్షన్స్ వ్యవస్థాపకుడు దగ్గుబాటి రామానాయుడు టీడీపీ ఎంపీగా ఉండగా, ఈ భూములు కేటాయించారు. 1999-2004 మధ్య అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖలో పర్యాటక అభివృద్ధితోపాటు సినిమాల చిత్రీకరణ కోసం రామానాయుడు స్టుడియోకు భూములను కేటాయించారు. విశాఖ-భీమిలి బీచ్ రోడ్డులోని మధురవాడ రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 336/pలో 34.44 ఎకరాల భూమిని ఎకరా రూ.5.2 లక్షల చొప్పున కేటాయించారు. ఈ భూమి విలువ ఇప్పుడు కోట్లలో ఉంది.

కేటాయించిన భూమిలో దాదాపు సగం స్థలంలో రామానాయుడు స్టుడియో నిర్మించారు. ఇంకా సుమారు 15 ఎకరాలు ఖాళీగా వదిలేశారు. గత ప్రభుత్వంలో ఈ భూమిలో ఎకరా భూమిని తీసుకుని ఇల్లు కట్టుకుందామని వైసీపీలోని ‘ముఖ్య’నేత భావించారని ప్రచారం జరిగింది. ఇందుకోసం భూమిని ఇతర అవసరాల కోసం బదిలీ చేసుకునేందుకు వీలుగా వీఎంఆర్డీఏకు సురేశ్ ప్రొడక్షన్ ద్వారా లేఖ రాయించారు. ముఖ్య నేతకు ఎకరా పోను మిగిలిన స్థలంలో లే-అవుట్ వేసుకుని వైసీపీ నేతలకు 50 శాతం భాగస్వామ్యం ఇచ్చేలా ఒప్పందం జరిగిందని ఆరోపణలు ఉన్నాయి.

ప్రభుత్వ పెద్దలే కోరడంతో వీఎంఆర్డీఏ వెనువెంటనే అనుమతులు ఇచ్చింది. అయితే తీర ప్రాంతంలోని కోస్తా నియంత్రణ మండలి పరిధిలో ఉన్న ఈ భూమిపై జిల్లా యంత్రాంగానికి హక్కులేదని, ఢిల్లీ స్థాయిలోనే అనుమతులు తెచ్చుకోవాలని అభ్యంతరం వ్యక్తం చేస్తూ టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామక్రిష్ణబాబు, జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో రామానాయుడు స్టుడియో భూముల్లో లే అవుట్ వేయడంపై కోర్టు స్టే విధించింది. దీంతో వైసీపీ ముఖ్య నేత ఇక్కడ ఇల్లు నిర్మించుకోవాలనే ఆలోచన విరమించి రుషికొండ వైపు ద్రుష్టి మళ్లించారని అంటున్నారు. దీంతో ఖాళీగా ఉండిపోయిన భూములు సురేశ్ ప్రొడక్షన్ పేరున ఉంటే ఎప్పటికైనా ఆక్రమించుకునే ప్రమాదం ఉందని భావించిన ప్రభుత్వం వాటిని వెనక్కి తీసుకుంటూ నిర్ణయం తీసుకుంది. దీంతో సురేశ్ ప్రొడక్షన్స్ తోపాటు ఆ భూములపై ఆశలు పెట్టుకున్న వైసీపీ నేతలకు షాక్ ఇచ్చినట్లైందని అంటున్నారు.