Begin typing your search above and press return to search.

రామోజీరావుకు భార‌త‌ర‌త్న ఇవ్వాలి: రాజ‌మౌళి

ఫిలింసిటీకి రద్దీ పెర‌గ‌డంతో దీనిని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   8 Jun 2024 5:30 AM GMT
రామోజీరావుకు భార‌త‌ర‌త్న ఇవ్వాలి: రాజ‌మౌళి
X

హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీని ఒక మ‌హ‌దాద్భుతంగా రూపొందించిన ప్రముఖ వ్యాపారవేత్త, ఈనాడు మీడియా వ్యవస్థాపకుడు రామోజీ రావు జూన్ 8న తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన వ‌య‌సు 87 ఏళ్లు. మ‌ర‌ణానికి ముందు ఆయ‌న తీవ్రమైన దీర్ఘకాలిక శ్వాసకోశ అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నార‌ని, గుండెకు చికిత్స జ‌రిగింద‌ని స‌మాచారం ఉంది. ఆయ‌న మృతి చెందార‌న్న వార్త ఈ శ‌నివారం ఉద‌యం క‌ల‌క‌లం రేపింది. లెజెండ‌రీ మీడియాధిప‌తి మరణించినందుకు ప్రపంచం నలుమూలల నుండి సంతాపం వెల్లువెత్తుతోంది. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీరావుకు నివాళులు అర్పించేందుకు రాజకీయ నాయకులు, సినీ నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు, పారిశ్రామికవేత్తలు వ్యక్తిగతంగా తరలివస్తున్నారు. ఫిలింసిటీకి రద్దీ పెర‌గ‌డంతో దీనిని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

రామోజీరావు గుండె ఆపరేషన్ అనంత‌రం కూడా చాలా కాలంగా చికిత్స పొందుతున్నార‌ని స‌మాచారం. రామోజీరావు అస్వ‌స్థ‌త‌తో మే 5న హైదరాబాద్‌లోని ప్రీమియర్ ఆసుపత్రిలో చేరారు. తెల్లవారుజామున 4.50 గంటలకు ఆసుపత్రిలో ఆయన తుది శ్వాస విడిచినట్లు క‌బురందింది. ఆయ‌న‌ చాలా కాలంగా తీవ్రమైన శ్వాసకోశ సమస్యలతో బాధపడ్డారు. మంచం మీద ఉన్నారు. జూన్ 5న గుండె సమస్య ఉందని ఫిర్యాదు చేయడంతో స్టార్‌ ఆస్పత్రి వైద్యులు గుండెకు స్టెంట్‌ వేశారు. జూన్ 7న పరిస్థితి విషమంగా మారడంతో ఆయ‌న‌ చనిపోయినట్లు ప్రకటించారు.

సినీ రాజకీయ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలిపారు. భార‌త‌దేశ ప్ర‌ధాని నరేంద్ర మోదీ, వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, జయప్రకాష్ నారాయణ, ఎస్ఎస్ రాజమౌళి, ఎంఎం కీరవాణి, జూనియర్ ఎన్టీఆర్, రాజేంద్ర ప్రసాద్, పుల్లెల గోపీచంద్ స‌హా ప‌లువురు రామోజీని ఇప్పటికే తుది దర్శనం చేసుకున్నారు. ఉద్యోగులు, అభిమానులు, సోదరుల కోసం రామోజీరావు భౌతికకాయాన్ని ఆయన ఇంట్లో సంద‌ర్శ‌న కోసం ఉంచ‌గా అక్క‌డ అంద‌రూ నివాళులర్పించారు.

ప్ర‌ధాని నరేంద్ర మోదీ రామోజీ రావు గురించి సుదీర్ఘంగా లేఖ‌ రాశారు. శ్రీ రామోజీ రావు గారు మరణించడం చాలా బాధాకరమని, భారతీయ మీడియాలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన దార్శనికుడని, జర్నలిజంలో చలనచిత్ర ప్రపంచంలో ఆయన చేసిన గొప్ప సేవ‌లు చెరగని ముద్ర వేసాయని, ఆయన విశేష కృషితో కొత్త ప్రమాణాలను నెలకొల్పారని అన్నారు. రామోజీ రావు గారు మీడియా - ఎంటర్‌టైన్‌మెంట్ ప్రపంచంలో చాలా మక్కువ చూపారు ఓం శాంతి..అని మోదీజీ సోష‌ల్ మీడియాలో సంతాపం ప్ర‌క‌టించారు.

ఎవ్వ‌రికీ త‌ల‌వొంచ‌ని మేరు ప‌ర్వ‌తం శ్రీ రామోజీరావు.. అని మెగాస్టార్ చిరంజీవి కొనియాడారు. త‌న‌ను సినీప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌యం చేసింది మీడియా దిగ్గ‌జం శ్రీ రామోజీరావు అని యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ స్మ‌రించుకున్నారు. శ్రీ రామోజీ రావు గారు లాంటి దార్శనీకులు నూటికో కోటికో ఒకరు. మీడియా సామ్రాజ్యాధినేత.. భారతీయ సినిమా దిగ్గజం అయినటువంటి ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిది. ఆయన మన మధ్యన ఇక లేరు అనే వార్త చాలా బాధాకరం. `నిన్ను చూడాలని` చిత్రంతో నన్ను తెలుగు సినీ పరిశ్రమకి పరిచయం చేసినప్పటి జ్ఞాపకాలు ఎప్పటికి మరువలేను. ఆ మహనీయుడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.. అని అన్నారు.

రామోజీకి భార‌త‌ర‌త్న ఇవ్వాలి: రాజ‌మౌళి

తన X హ్యాండిల్ లో ద‌ర్శ‌క‌ధీరుడు SS రాజమౌళి ఇలా రాసారు. ``ఒక వ్యక్తి తన 50 సంవత్సరాల స్థిర‌మైన వ్యాపారం, కృషి, ఆవిష్కరణలతో లక్షలాది మందికి జీవనోపాధిని క‌ల్పించి ఎంద‌రికో జీవ‌న మార్గంలో ఆశను పెంపొందించారు.. రామోజీ రావు గారికి మనం నివాళులర్పించే ఏకైక మార్గం `భారతరత్న` ప్రదానం చేయడం`` అని రాసారు.