రాజమౌళి ప్రపోజల్ 'మీనింగ్ లెస్': రమా రాజమౌళి
నేడు భారతదేశంలో నంబర్ వన్ దర్శకుడు ఎవరు? అంటే కచ్ఛితంగా ఎస్.ఎస్. రాజమౌళి పేరునే అభిమానులు సూచిస్తారు.
By: Tupaki Desk | 5 Aug 2024 4:10 AM GMTనేడు భారతదేశంలో నంబర్ వన్ దర్శకుడు ఎవరు? అంటే కచ్ఛితంగా ఎస్.ఎస్. రాజమౌళి పేరునే అభిమానులు సూచిస్తారు. బాలీవుడ్ దిగ్గజ దర్శకులు సాధించలేని 1000 కోట్ల క్లబ్ లను వరసగా తన ఖాతాలో వేసుకుంటూ ఆశ్చర్యపరుస్తున్న దర్శకుడిగా రాజమౌళి పేరు మార్మోగుతోంది. బాహుబలి 2- RRR వంటి బ్లాక్‌బస్టర్ లతో ఈ ఫీట్ సాధించాడు.
ఇటీవలే రాజమౌళి జీవితంపై నెట్ ఫ్లిక్స్ డాక్యు సినిమాని స్ట్రీమింగ్ చేసిన సంగతి తెలిసిందే. దీనిలో రమా రాజమౌళి తన భర్త రాజమౌళి గురించి చెప్పిన చాలా విషయాలు అభిమానులను విస్మయపరిచాయి. రాజమౌళి- రమ మధ్య ప్రేమకథ గురించి ఆమె వివరించారు. ఈ జంట ప్రేమకథలో పట్టుదల, పరిపక్వత జీవితాలను మార్చిన చరిత్ర గురించి రమా రాజమౌళి మాట్లాడారు. కుటుంబాలను అందంగా కలపడానికి 2001లో తమ పెళ్లి జరిగిందని వెల్లడించారు.
`మోడరన్ మాస్టర్స్: ఎస్‌ఎస్ రాజమౌళి` డాక్యుమెంటరీలో రమా రాజమౌళి ఇలాంటి చాలా సంగతులు చెప్పారు. రాజమౌళిని మొదటిసారి రమ తన సోదరి వివాహంలో కలుసుకున్నారు. ప్రారంభ కలయిక గురించి ప్రత్యేకంగా చెప్పుకోదగినది ఏమీ లేదని రమ గుర్తుచేసుకున్నారు. SS రాజమౌళి కుటుంబంతో బంధుత్వం.. ప్రేమకథ గురించి రమా రాజమౌళి వెల్లడించారు.
అయితే ఆ ఇద్దరూ డేటింగ్ ప్రారంభించినప్పుడు పరిణతి చెందినవారు. ఎస్ఎస్ రాజమౌళి ప్రపోజ్ చేసినప్పుడు రమ అవాక్కయ్యారట. అంతేకాదు.. వెంటనే నిరాకరించారు. రమ అప్పటి పరిస్థితులను బట్టి ఇది `అర్థం లేని ప్రతిపాదన`గా భావించారట.
రమ అప్పటికే విడాకులు తీసుకున్నారు. ఒక కొడుకు కూడా ఉన్నారు. అయితే తాను రాజమౌళి ప్రపోజల్ కి సంకోచించడానికి కారణం తల్లిగా కొడుకు బాధ్యతల గురించి ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. రాజమౌళితో ఈ ప్రయాణం ఎలా ఉంటుందోనని సంకోచించారు. అయితే తన వృత్తిగత జీవితంలో పట్టుదలకు మారుపేరుగా ఉన్న రాజమౌళి అదే సంకల్పాన్ని తన వ్యక్తిగత జీవితానికి అన్వయించారు. కాలక్రమేణా ఆ ఇద్దరూ తమ కలయిక సరైనదేనని ఒప్పించగలిగాడు.
ఒక సంవత్సరం పాటు రాజమౌళి స్థిరమైన ప్రయత్నాల తరువాత రమ తనను వివాహం చేసుకోవడానికి అంగీకరించారు. వారు 2001లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. రాజమౌళి ఈ రియల్ లైఫ్ సినిమాకి ఎలా సరిపోతాడో చూడాలని రమ అనుకున్నారట. అన్నింటిలాగే అతడు తన ప్రేమ విషయాలలో చాలా పట్టుదలగా ఉన్నారు. ఒక సంవత్సరం తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం అని తెలిపారు.
రమా రాజమౌళి కుమారుడు ఎస్.ఎస్.కార్తికేయ SS రాజమౌళి సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తూ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. సినిమా ప్రొడక్షన్ లో ఆల్ రౌండర్ ప్రతిభ అతడి సొంతం. కార్తికేయకు వివాహం కూడా అయింది. రాజమౌళి- రమ దంపతులకు మయూఖ అనే కుమార్తె ఉన్నారు.
ఖాళీగా ఉంటే లేజీగా ఉంటారు:
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళికి పని రాక్షసుడు అనే పేరుంది. టాలీవుడ్ లో హార్డ్ వర్క్ తో ఎదిగిన దర్శకుడు అతడు. అయితే అంతటి పని రాక్షసుడికి ఖాళీ సమయం దొరికితే ఏం చేస్తాడు? అంటే ఆరోజంతా లేజీగా ఉంటారట. ఇంట్లోనే ఉండి ఏదో ఆలోచిస్తూ ఉంటారట. అలాగే బద్ధకం వదిలించుకునేందుకు బయటకు వెళ్లి గేమ్స్ ఆడతారని రమ తెలిపారు. వ్యవసాయం, ఆటలు, కుటుంబంపైనే ఫోకస్ పెడతానని కూడా రాజమౌళి చెప్పారు.