1992 యానిమే 'రామాయణం' మ్యాజిక్ రీక్రియేట్ చేస్తుందా?
4కే వెర్షన్లలో రీరిలీజ్ చేయడం ఇటీవలి ట్రెండ్. అగ్ర హీరోల బ్లాక్ బస్టర్ సినిమాలను రీమాస్టర్ చేసి కొత్త వెర్షన్లను రీరిలీజ్ చేస్తూ నిర్మాతలు మళ్లీ ఆర్జిస్తున్నారు.
By: Tupaki Desk | 21 Sep 2024 3:00 AM GMT4కే వెర్షన్లలో రీరిలీజ్ చేయడం ఇటీవలి ట్రెండ్. అగ్ర హీరోల బ్లాక్ బస్టర్ సినిమాలను రీమాస్టర్ చేసి కొత్త వెర్షన్లను రీరిలీజ్ చేస్తూ నిర్మాతలు మళ్లీ ఆర్జిస్తున్నారు. అయితే ఇప్పుడు ఇదే ట్రెండ్ ని ఫాలో అవుతూ 1992లో విడుదలైన `రామాయణం` యానిమేషన్ మూవీని 4కేలో రీమాస్టర్ చేసి తిరిగి రిలీజ్ చేస్తున్నారు.
`రామాయణం: ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ` ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఇష్టపడే యానిమేషన్ చిత్రం. హిందీ, ఇంగ్లీష్, తమిళం, తెలుగు భాషలలో అక్టోబర్ 18న భారతీయ థియేటర్లలో ప్రదర్శితమవుతుంది. 1992లో విడుదలైన ఈ మూవీని అప్పట్లో జపనీస్ నిర్మాత యుగో సాకో - భారతీయ నిర్మాత రామ్ మోహన్ సంయుక్తంగా నిర్మించారు. ఇప్పుడు దీనిని రీమాస్టర్ చేసి ఫర్హాన్ అక్తర్ - రితేష్ సిధ్వానిల ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ విడుదల చేస్తోంది.
ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్, ట్రైలర్‌ను గీక్ పిక్చర్స్ ఇండియా విడుదల చేసింది.
అభిమానులను ఉర్రూతలూగించిన ఒక కథ ప్రతి హృదయంలో ఎప్పటికీ సజీవంగా ఉంది. `రామాయణం: ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ` అక్టోబర్ 18న భారతదేశం అంతటా విడుదలవుతోందని వారు టీజర్‌కు క్యాప్షన్ ఇచ్చారు. గీక్ పిక్చర్స్ ఇండియా సహ వ్యవస్థాపకుడు అర్జున్ అగర్వాల్ మాట్లాడుతూ-``ఈ రామాయణం అన్ని రకాల కొత్త రికార్డులను బద్దలు కొట్టబోతోంది.. ఎందుకంటే ఇండో-జపాన్ సహకారం కోసం ఇక్కడ కొత్త శకం ప్రారంభమవుతుంది. ఇది డైనమిక్ ఆలోచన. చాలా స్పష్టమైన రంగురంగుల చిత్రణతో రామాయణం అందరినీ అలరిస్తుంది. రామ్ కథ అన్ని వయసుల వారికోసం ..`` అని తెలిపారు. దసరా - దీపావళి సెలవులలో విడుదలవుతున్నందున `రామాయణం: ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ` సినిమా ప్రేక్షకులను కచ్చితంగా ఆకర్షిస్తుంది. రామాయణం అభిమానులైనా లేదా యానిమేషన్ చిత్రాలను ఇష్టపడేవారైనా థియేటర్లకు తప్పక విచ్చేస్తారు.. అని తమ గణాంకాలను కూడా చెప్పారు నిర్మాతలు.
ఒక ముఖ్యమైన హిందూ ఇతిహాసం విష్ణువు ఏడవ అవతారం అయిన రాముడి కథను చెబుతుంది. రాకుమారుడైన రాముడి జీవితాన్ని తెరపరిచింది. ఈ యానిమేషన్ వెర్షన్‌లో యుగయుగాలకు సంబంధించిన మంత్రముగ్ధత వెండితెరపై జీవం పోసుకుంది. `రామాయణం: ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ`లో రాముని వనవాసం, సీత అపహరణ, హనుమంతుని అంకితభావం, రావణుడు - శ్రీరాముడి మధ్య చివరి ఘర్షణ సహా రామాయణంలోని కీలక సన్నివేశాలతో అలరిస్తుంది. పవిత్రమైన హిందూ పురాణంపై తీసిన `రామాయణం` మొదటి యానిమేటెడ్ సినిమా కూడా. ఈ సినిమా సజీవ యానిమేషన్, సంగీత కూర్పు, ఇతిహాసాన్ని మరో లెవల్ లో ఆవిష్కరించిందని నిపుణులు చెబుతున్నారు.