చరణ్ 250 అడుగుల కటౌట్.. రికార్డులు బ్లాస్ట్
అందులో భాగంగా త్వరలో మెగా అభిమానుల సమక్షంలో ఇండియాలో అతి పెద్ద కటౌట్ ను ఆవిష్కరించనున్నారు.
By: Tupaki Desk | 21 Dec 2024 4:45 AM GMTటాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్.. గేమ్ ఛేంజర్ మూవీతో థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఆ సినిమాతో సంక్రాంతికి కానుకగా జనవరి 10వ తేదీన రానున్నారు. దీంతో మెగా అభిమానులు.. గేమ్ ఛేంజర్ కోసం ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.
గేమ్ ఛేంజర్.. బ్లాక్ బస్టర్ హిట్ ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ సోలోగా నటిస్తున్న సినిమా కావడంతో అంతా భారీ అంచనాలు పెట్టుకున్నారు. కచ్చితంగా మంచి హిట్ కొడతారని మెగా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అదే సమయంలో మేకర్స్ జోరుగా ప్రమోట్ చేస్తున్నారు. సినిమాపై పీక్స్ లో హైప్ ను క్రియేట్ చేసేందుకు అన్ని మార్గాలు చూస్తున్నారు.
అందులో భాగంగా త్వరలో మెగా అభిమానుల సమక్షంలో ఇండియాలో అతి పెద్ద కటౌట్ ను ఆవిష్కరించనున్నారు. విజయవాడలోని దావన్ కాలనీలో ఉన్న వజ్రా గ్రౌండ్స్ లో ఏర్పాటు చేస్తున్నారు. డిసెంబర్ 29వ తేదీన సాయంత్రం 4 గంటలకు గ్రాండ్ గా కటౌట్ రివీల్ ఈవెంట్ జరగనున్నట్లు అనౌన్స్మెంట్ వచ్చేసింది.
అయితే ఇప్పటి వరకు ఇండియాలో 230 అడుగులతో అతిపెద్ద కటౌట్ గా రికార్డు ఉండగా.. ఇప్పుడు రామ్ చరణ్ కటౌట్ 250 అడుగులతో ఏర్పాటు అవ్వనుంది. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. చరణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. నిజంగా గర్వకారణంగా ఉందని చెబుతున్నారు.
ఇక మేకర్స్.. నేడు అమెరికాలోని డల్లాస్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించనున్నారు. అందుకుగాను ఇప్పటికే రామ్ చరణ్, శంకర్ సహా పలువురు అమెరికా చేరుకున్నారు. పుష్ప-2తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సుకుమార్.. చీఫ్ గెస్ట్ గా హాజరుకానున్నారు. డల్లాస్ లోని తెలుగు ప్రజలంతా అటెండ్ అవ్వనున్నట్లు తెలుస్తోంది.
ఆ తర్వాత చెన్నైలో మేకర్స్ ఓ ఈవెంట్ ను ఏర్పాటు చేయనున్నారు. అనంతరం హైదరాబాద్ లో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ జరగనుందని టాక్ వినిపిస్తోంది. మెగాస్టార్ ముఖ్య అతిథిగా హాజరవుతారని సమాచారం. అది అయ్యాక జనవరి 4వ తేదీన రాజమండ్రిలో తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనున్నట్లు తెలుస్తోంది. ఆ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని టాక్ వినిపిస్తోంది.