శంకర్ సర్‌తో 'గేమ్ ఛేంజర్'... కల నిజమైనట్లు అనిపిస్తుంది : రామ్ చరణ్
రెండు దశాబ్దాల క్రితమే పాన్ ఇండియా రేంజ్ సినిమాలను తీసి దేశం మొత్తం తనవైపు తిరిగి చూసుకునేలా చేసిన దర్శకుడు శంకర్.
By: Tupaki Desk | 4 Jan 2025 10:15 AM GMTరెండు దశాబ్దాల క్రితమే పాన్ ఇండియా రేంజ్ సినిమాలను తీసి దేశం మొత్తం తనవైపు తిరిగి చూసుకునేలా చేసిన దర్శకుడు శంకర్. అప్పట్లో ఆయన తమిళ్‌లో రూపొందించిన సినిమాలు హిందీ, తెలుగు ఇతర భాషల్లోనూ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న దాఖలాలు ఉన్నాయి. అందుకే అన్ని భాషల హీరోలు శంకర్‌తో ఒక్క సినిమా అయినా చేయాలని కోరుకున్న సందర్భాలు ఉన్నాయి. రామ్ చరణ్ సైతం శంకర్‌తో ఒక్క సారి అయినా వర్క్ చేయాలని కోరుకున్నారట. గేమ్ ఛేంజర్ సినిమాతో తన కల సాకారం అయ్యిందని రామ్ చరణ్ తాజా ఈవెంట్‌లో పేర్కొన్నారు.
తమిళ్ సినిమా ఇండస్ట్రీలో దిగ్గజ దర్శకుడు, భారీ చిత్రాల దర్శకుడిగా పేరు సొంతం చేసుకున్న శంకర్ దర్శకత్వంలో వచ్చిన చాలా సినిమాలు తెలుగు, హిందీ భాషలతో పాటు అన్ని భాషల ప్రేక్షకులను మెప్పించాయి. ఆయన నుంచి వచ్చిన సినిమాలు ఒకానొక సమయంలో బాక్సాఫీస్ వద్ద సందడి చేయడం మాత్రమే కాకుండా జనాల్లోనూ మార్పు తీసుకు వచ్చింది. జనాల్లో మార్పు తీసుకు వచ్చే మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలను ఆయన రూపొందించి గొప్ప దర్శకుడిగా నిలిచారు. భారీతనంకు పెట్టింది పేరు అయిన శంకర్ అద్భుతమైన విజువల్ వండర్‌లను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. అలాంటి శంకర్ సర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమాను చేయడంతో తన కల నిజమైందని రామ్ చరణ్ అన్నారు.
తాజాగా ముంబైలో జరిగిన గేమ్ ఛేంజర్ సినిమా మీడియా సమావేశంలో రామ్ చరణ్ పాల్గొన్నారు. ఆ సమయంలో రామ్ చరణ్ మాట్లాడుతూ... తాను శంకర్ సర్ దర్శకత్వంలో వచ్చిన నన్బన్ సినిమా తెలుగు డబ్బింగ్ వర్షన్ ప్రమోషన్‌లో నేను ముఖ్య అతిథిగా పాల్గొన్నాను. ఆ సమయంలో శంకర్ సర్‌తో తెలుగు లో నాతో కాకున్నా ఎవరో ఒక హీరోతో సినిమా చేయవచ్చు కదా అని చెప్పాలి అనుకున్నాను. కానీ ఆ సమయంలో నాకు అంత ఘట్స్ సరిపోలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత నేను రామోజీ ఫిల్మ్ సిటీలో ఆర్‌ఆర్ఆర్ సినిమా క్లైమాక్స్ షూట్‌లో ఉండగా దిల్ రాజు గారు ఫోన్ చేసి శంకర్ గారు మీతో సినిమా చేయాలని అనుకుంటున్నారు అన్నారు.
దిల్ రాజు గారు ఆ విషయం చెప్పిన వెంటనే నేను జోక్ అనుకున్నాను. కానీ ఆయన నిజంగానే శంకర్ గారితో మీరు సినిమా చేయాలి అంటూ చెప్పగానే షాక్ అయ్యి ఆయనకు ఫోన్ చేయండి అన్నాను. ఆయన వంటి పెద్ద గొప్ప దర్శకుడితో సినిమా చేయడం అనేది కచ్చతంగా తన కల సాకారం అయ్యిందని భావించాల్సిందే. ఈ సినిమా చేయడం పట్ల తన ఫ్యామిలీ మెంబర్స్ అంతా చాలా సంతోషంగా ఉన్నారని, ఆయన చేయలేక పోయిన శంకర్ సర్ దర్శకత్వంలో నేను సినిమా చేయడంతో నాన్న గారు చిరంజీవి గారు సైతం చాలా సంతోషంగా ఉన్నారని చెప్పుకొచ్చాడు. రామ్ చరణ్ ఈ సినిమాతో సంక్రాంతి కానుకగా జనవరి 10వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.