Begin typing your search above and press return to search.

చరణ్ దర్గా విషయం.. కారణం చెప్పినా అలా చేయడం తప్పే!

కడప దర్గాకు టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ అయ్యప్ప మాలలో వెళ్లిన నేపథ్యంలో సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది.

By:  Tupaki Desk   |   21 Nov 2024 8:59 AM GMT
చరణ్ దర్గా విషయం.. కారణం చెప్పినా అలా చేయడం తప్పే!
X

"మంచికి మతం ఉండదు.. మంచి మనసుకు అస్సలు ఉండదు.. అలాంటిది దేవుడి దగ్గరకు వెళ్లడానికి మతం అవసరమా?.. మంచి మనసుతో దేవుడిని దర్శించడానికి వెళ్లేవాళ్లను తప్పు పడితే ఎలా?".. ఇప్పుడు పలువురు అభిప్రాయం ఇదే.. కడప దర్గాకు టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ అయ్యప్ప మాలలో వెళ్లిన నేపథ్యంలో సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది.

దానిపై రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఇటీవల స్పందించిన విషయం తెలిసిందే. దేవుడిపై విశ్వాసం అనేది అందరినీ ఏకం చేస్తుందే తప్ప విడిపోయేలా చేయదని, తన మతాన్ని అనుసరిస్తూనే ఇతర మతాలను గౌరవించడం సనాతన ధర్మాన్ని పాటించడం అవుతుందని పోస్ట్ పెట్టారు ఉపాసన. అదే సమయంలో మరో మహిళ పెట్టిన పోస్ట్ కు రిప్లైగా.. ఎరుమేలిలో ఉన్న వావర్ స్వామి మసీదు గురించి ప్రస్తావించారు.

నిజానికి శబరిమల వెళ్లే భక్తులు వావర్ స్వామి మసీదును దర్శించుకున్న తర్వాత అయ్యప్పను దర్శించుకుంటారు. మసీదులో ప్రదక్షిణలు చేసి శబరిమల యాత్ర కొనసాగిస్తారు. దీంతో అక్కడ లేని వివాదం.. ఇక్కడ రామ్ చరణ్ విషయంలో ఎందుకని నెటిజన్లు అంటున్నారు. అయ్యప్ప సన్నిధానం లేదా భజనల్లో వావర్ స్వామి భజనను కూడా కీర్తిస్తారని ప్రస్తావిస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోస్ ను కూడా పోస్ట్ చేస్తున్నారు.

అయితే వావర్ యుద్ధ విద్యలో ఎంతో నైపుణ్యం కలవాడని, ఒకసారి అయ్యప్ప స్వామితో మూడు రోజుల పాటు యుద్ధం చేశాడని పెద్దలు చెబుతుంటారు. యుద్ధంలో ఇద్దరూ సమ ఉజ్జీలుగా నిలిచారని, ఆ తర్వాత వావర్ అయ్యప్పకు ప్రముఖ శిష్యుడుగా మారారని అంటుంటారు. అనంతరం వావర్ కు ఒక మసీదు కట్టించమని అయ్యప్ప సూచించినట్లు పెద్దలు చెబుతారు.

అదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో హిందూముస్లింల సామరస్యం గురించి కొందరు నెటిజన్లు మాట్లాడుతున్నారు. కడపలోని అనేక మంది ముస్లింలు.. వెంకటేశ్వరస్వామిని తమ ఇంటి అల్లుడిగా భావిస్తుంటారు. వేములవాడ శివాలయంలో ఓ దర్గా ఉన్న విషయం తెలిసిందే. అక్కడికి వచ్చిన భక్తులను ముస్లిం పెద్దలు ఆశీర్వదిస్తుంటారు. చార్మినార్ ఆవరణలో భాగ్యలక్ష్మి ఆలయంతోపాటు గోల్కొండ కోటలోని అమ్మవారి ఆలయంలో జరిగే పూజలు, బోనాల గురించి తెలిసిందే.

దీంతో రామ్ చరణ్ పై కొందరు అనవసరంగా కామెంట్లు చేస్తున్నారని అనేక మంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. తన మతాన్ని గౌరవించే ఇతర మతాలను గౌరవించారని చెబుతున్నారు. హిందూ మతంపై ఆయనకు అపారమైన గౌరవం ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇప్పటికే చరణ్ పలుమార్లు సోమవారం శివాలయానికి వెళ్లి శుభ్రం చేశారు. తన కుమార్తెకు లలిత సహస్రనామ స్తోత్రంలోని పదాన్ని తీసుకుని క్లీంకార అని పేరు పెట్టారు.

ఆర్ ఆర్ ఆర్ సినిమాకు వచ్చిన ఓ అవార్డును తీసుకునేందుకు విదేశాలకు వెళ్ళినప్పుడు రాముడు పట్టాభిషేక విగ్రహాన్ని తీసుకెళ్లారు రామ్ చరణ్, ఉపాసన. ఇప్పుడు ఆ విషయాలను ఓ స్వామీజీ ప్రస్తావించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. "చరణ్ కడప దర్గాకు వెళ్లారు.. ఎవరో పిల్లాడు నాకు కాల్ చేసి కఠువగా మాట్లాడాడు.. ఒకడు వెళ్లాడు దర్గాకి.. అయ్యప్ప మాలలో వెళ్లాడని అన్నాడు.. వెంటనే నేను రామ్ చరణ్ దగ్గరకు వెళ్లి కూర్చో పెడతా అన్నా.. ఆడు వీడు అనొద్దని అతనికి ముందు చెప్పా.. ఆయనకు పిలిచారు.. ఆయన వెళ్లారు.. కులం ముఖ్యం కాదు.. ధర్మం ప్రదానం..." అంటూ స్వామీజీ ఆ వీడియోలో చెబుతూ కనిపించారు.

ఏదేమైనా.. రామ్ చరణ్ అయ్యప్ప మాలలో దర్గాకు వెళ్లొచ్చా వెళ్లకూడదా అనే నియమం ఎక్కడైనా ఉందా?.. అయినా భక్తిలో రూల్స్ ఏంటి?.. శబరిమల వెళ్ళే ప్రతి భక్తుడు వావర్ మసీదు దర్శించుకున్నప్పుడు.. ఇక్కడ మన దగ్గర ఉన్న దర్గాకు చరణ్ వెళితే తప్పేంటి?.. వీటన్నింటికీ సమాధానాలు ఏమైనా సోషల్ మీడియాలో అతిగా మాట్లాడటం మాత్రం తప్పనే కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. తాను వెళ్లడం వెనుక ఉన్న అసలు కారణాన్ని చరణ్ చెప్పినా.. అతిక్రమించి నెటిజన్లు కామెంట్లు పెట్టడం ముమ్మాటికీ తప్పేనని అంటున్నారు.