Begin typing your search above and press return to search.

రామ్ చరణ్ క్షమాపణలు చెప్పాలి: న్యాయవాదులు

అయ్యప్ప మాలధారణలో ఉన్న టాలీవుడ్ స్టార్ హీరో రామ్‌ చరణ్‌.. కడప దర్గాను ఇటీవల సందర్శించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

By:  Tupaki Desk   |   21 Nov 2024 5:27 PM GMT
రామ్ చరణ్ క్షమాపణలు చెప్పాలి: న్యాయవాదులు
X

అయ్యప్ప మాలధారణలో ఉన్న టాలీవుడ్ స్టార్ హీరో రామ్‌ చరణ్‌.. కడప దర్గాను ఇటీవల సందర్శించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కొందరు చరణ్ ను సమర్థిస్తుంటే.. మరికొందరు తప్పుబడుతున్నారు. చరణ్ సతీమణి ఉపాసన దానిపై వివరణ ఇచ్చినా కూడా రామ్‌ చరణ్‌ క్షమాపణ చెప్పాల్సిందేనని ఇంకొందరు డిమాండ్ చేస్తున్నారు.

శబరిమల యాత్రికులు వావర్ మసీదును దర్శించే విషయాన్ని ఉపసాన ప్రస్తావించినా, చరణ్ దర్గా విజిట్ వెనుక కారణాన్ని చెప్పినా.. ఇంకా కొందరు తప్పుబడుతున్నారు. ఇప్పటికే.. అయ్యప్పస్వామి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా రామ్ చరణ్ వ్యవహరించారని, వెంటనే క్షమాపణ చెప్పాలని తెలంగాణ అయ్యప్ప ఐక్యవేదిక డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.

బహిరంగ క్షమాపణ చెప్పకపోతే ఆందోళనకు దిగుతామని కూడా హెచ్చరించింది. ఇప్పుడు తాజాగా రంగారెడ్డి జిల్లా కోర్టు న్యాయవాదులు రామ్ చరణ్ హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని న్యాయవాదులు హెచ్చరించారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

"పవిత్రమైన అయ్యప్ప మాలలో ఉండి కడపలోని అమీన్ పీర్ దర్గాను సందర్శించడాన్ని అయ్యప్ప భక్తులుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. చరణ్ గారు.. మీరు ఎవరికోసమైనా ఎక్కడికైనా ఎప్పుడైనా ఏ దర్గాకైనా వెళ్లండి. మేం దానికి వ్యతిరేకం కాదు. కానీ అయ్యప్ప మాల ధరించి వెళ్లడం, హిందువుల మనోభావాలు దెబ్బతీయడం క్షమించరాని నేరం" అని వ్యాఖ్యానించారు.

"మా నుంచి ఒకటే విజ్ఞప్తి. మీరు వెంటనే మాలను తీసేసి అయ్యప్ప స్వామిని దర్శించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పు అయిపోయిందని దేవుడిని కోరుకోండి. దర్గాలు, సమాధులు సందర్శించి ఆ 18 మెట్లు ఎక్కి అపవిత్రం చేయవద్దని తెలియజేస్తున్నాం. వెంటనే మాలను తొలగించి హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలి" అని డిమాండ్ చేశారు.

మరోవైపు, చరణ్ కు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రాధా మనోహర్ దాస్ అండగా నిలిచిన విషయం తెలిసిందే. రామ్ చరణ్ నిజమైన భక్తుడని ఆయన అన్నారు. శివాలయాన్ని చరణ్ శుభ్రం చేస్తారని, తన కుమార్తెకు లలితలోని పదాన్ని తీసి క్లీంకార అనే పేరు పెట్టారని తెలిపారు. చరణ్ గురించి ఎవరూ తప్పుగా మాట్లాడొద్దని చెప్పారు.