గేమ్ ఛేంజర్.. 1000 టన్నుల బరువైన ప్రశ్న
కమల్ హాసన్ - శంకర్ కలయికలోని `భారతీయుడు 2` టీజర్ రిలీజైంది.
By: Tupaki Desk | 5 Nov 2023 8:29 AM GMTకమల్ హాసన్ - శంకర్ కలయికలోని `భారతీయుడు 2` టీజర్ రిలీజైంది. అయితే ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం టీజర్ నిరాశపరిచిందని సమీక్షలు వచ్చాయి. సర్వత్రా మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి. అయితే ఇది కేవలం సరైన ప్రచార మెటీరియల్ ఏదీ రావడం లేదు! అంటూ ఎదురు చూస్తున్న అభిమానుల కంటి తుడుపు కోసం రిలీజ్ చేసిన మిక్స్ డ్ వీడియో అనే సందేహాలు లేకపోలేదు. ఒకవేళ ఇదే నిజమైతే గనుక శంకర్ బృందం నుంచి భారతీయుడు 2 కి సంబంధించిన అదిరిపోయే టీజర్ గ్లింప్స్ మరొకటి వస్తుందని ఆశించవచ్చు. ఇటీవలి కాలంలో వరుస టీజర్లు రిలీజ్ చేసేందుకు మేకర్స్ వెనకాడడం లేదు. అంటే శంకర్ బృందం నుంచి భారతీయుడు 2 కి సంబంధించిన మరిన్ని వీడియో గ్లింప్స్ విడుదలవుతాయి.
కానీ ఇప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిందనేది ఒక సెక్షన్ క్రిటిక్స్ విశ్లేషణ. అసలు శంకర్ అంత పెద్ద సినిమాకి ఇలాంటి టీజర్ రిలీజ్ చేస్తాడా? అని నిరాశపడిన వాళ్లు ఉన్నారు. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు! కనీసం ఆ లాజిక్ ని కూడా మర్చిపోయారు అని విమర్శిస్తున్నారు కొందరైతే. నిజానికి ఈ టీజర్ ఏమంత గ్రిప్పింగ్ గా లేదు. పైగా అనిరుధ్ రవిచందర్ నేపథ్య సంగీతం కూడా తేలిపోయిందనేది మరికొందరి విమర్శ.
ఏదైతేనేం ఇప్పుడు `భారతీయుడు 2` ప్రభావం `గేమ్ ఛేంజర్` పైనా పడుతుందా? అంటూ రకరకాల సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై మెగాభిమానుల్లో బోలెడంత చర్చ సాగుతోంది. అయితే భారతీయుడు 2 సినిమాని శంకర్ ఎలాంటి కండిషన్ లో తెరకెక్కించారో తెలిసినదే. చిత్రనిర్మాత సుభాష్కరణ్ తో వివాదం కారణంగా ఈ సినిమా చాలా ఆపసోపాలు పడింది. దాని ప్రభావం ఇప్పుడు సినిమా మీద ఏమైనా ఉంటుందా? అన్న సందేహాలను కూడా తాజా టీజర్ రేకెత్తించింది. అయితే అలాంటిదేమీ ఉండకపోవచ్చని శంకర్ అభిమానులు సర్ధి చెబుతున్నారు.
ఇకపోతే భారతీయుడు 2 (ఇండియన్ 2 ) ప్రభావం రామ్ చరణ్-శంకర్ ల `గేమ్ ఛేంజర్` పై పడేందుకు ఛాన్స్ లేదని, దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాత ప్రతిదీ తరచి తరచి చూశాకే ముందుకు వెళతాడని కూడా విశ్లేషిస్తున్నారు. చిత్రీకణ సమయంలో రకరకాల కారణాలతో కొన్ని బ్రేకులు పడినా కానీ గేమ్ ఛేంజర్ ని అత్యుత్తమ కంటెంట్ తో విజువల్ ఫీస్ట్ గా తీర్చిదిద్దాలని దిల్ రాజు అండ్ టీమ్ చాలా సీరియస్ గా వర్క్ చేసారు. శంకర్ తో కావాల్సిన ఔట్ పుట్ తీసుకునే సత్తా పేరున్న నిర్మాతగా దిల్ రాజుకు ఉందని కొందరు ధీమాను కనబరుస్తున్నారు. అలాగే శంకర్ తో ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా దిల్ రాజు బడ్జెట్లు సమకూర్చడం కూడా గేమ్ ఛేంజర్ కంటెంట్ కి భరోసాని పెంచుతుందని భావిస్తున్నారు.
రాజీ లేని బడ్జెట్లతో రూపొందుతున్న గేమ్ ఛేంజర్ రామ్ చరణ్ కి చాలా కీలకమైన సినిమా. ఆర్.ఆర్.ఆర్ లాంటి సంచలనం తర్వాత మరో పాన్ ఇండియా హిట్ కొట్టి సత్తా చాటేందుకు చరణ్ భారీ ప్రణాళికలతో దూసుకుపోతున్నారు. ఇలాంటి సమయంలో శంకర్ తో జత కట్టడం అన్నది అతడి అదృష్టంగా భావిస్తున్నాడు. మరి ఈ ఆశల్ని నెరవేరుస్తూ శంకర్ ఒక అద్భుత చిత్రాన్ని అందిస్తాడని మెగాభిమానులు భావిస్తున్నారు. మోస్ట్ అవైటెడ్ 2024 మూవీ `భారతీయుడు 2` తొలి టీజర్ ని తొలి ఇంప్రెషన్ కొట్టేలా శంకర్ ఎందుకు ఇవ్వలేదు? అన్నదే వెయ్యి టన్నుల బరువైన ప్రశ్న. దీనికి అతడి నుంచి జవాబు వస్తే కొంత క్లారిటీ వస్తుందేమో!