Begin typing your search above and press return to search.

'ల‌గ్గం' మరో 'పెళ్లి పుస్తకం' అంత హిట్ అవుతుంది

'భీమదేవరపల్లి బ్రాంచి' సినిమాతో ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌గా మంచి పేరు గుర్తింపు సంపాదించుకున్నారు రమేష్ చెప్పాల.

By:  Tupaki Desk   |   20 Oct 2024 2:22 PM GMT
ల‌గ్గం మరో పెళ్లి పుస్తకం అంత హిట్ అవుతుంది
X

'భీమదేవరపల్లి బ్రాంచి' సినిమాతో ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌గా మంచి పేరు గుర్తింపు సంపాదించుకున్నారు రమేష్ చెప్పాల. ఇప్పుడు నేటిత‌రం పెళ్లిళ్ల‌పై బ‌ర్నింగ్ టాపిక్ ని ఎంపిక చేసుకుని 'ల‌గ్గం' అనే సినిమా తీసారు. ఇటీవ‌లే విడుద‌లైన ట్రైల‌ర్‌ ఆక‌ట్టుకుంది. పెళ్లంటే రెండు కుటుంబాలు క‌ల‌వ‌డం కాదు రెండు మ‌న‌సులు క‌ల‌వ‌డం అని ఎంతో అందంగా చెప్పారు ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌. న‌ట‌కిరీటి రాజేంద్ర ప్ర‌సాద్ లాంటి సీనియ‌ర్ కీల‌క పాత్ర‌లో న‌వ‌త‌రం న‌టీన‌టుల‌తో ట్రైల‌ర్ ర‌క్తి క‌ట్టించింది. సాఫ్ట్ వేర్ పెళ్లి కొడుకుల కోసం వెంప‌ర్లాడే అంద‌మైన‌ అమ్మాయిల‌ త‌ల్లిదండ్రుల‌కు క‌నువిప్పు క‌లిగించేలా ఏదో చెప్ప‌బోతున్నార‌ని ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతోంది.

ఈనెల 25న సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది. తాజా ప్ర‌మోష‌న‌ల్ ఇంట‌ర్వ్యూలో ద‌ర్శ‌కుడు ర‌మేష్ చెప్పాల సినిమా గురించి చెప్పిన సంగ‌తులివి...

*భీమదేవరపల్లి బ్రాంచి చేసాక నెక్స్ట్ ఎలాంటి కథ చెయ్యాలి? అనే విషయంలో చాలా ఆలోచించాను. ఆ ఆలోచనల్లోనుండి పుట్టిన కథ లగ్గం. తెలంగాణ కల్చర్లో లగ్గం అనేది ఎన్నో ఎమోషన్స్ తో ముడిపడి ఉంటుంది. తెలంగాణ లగ్గానికి చాలా ప్రత్యేకత ఉంది. ఆ ఎమోషన్స్ ని, కల్చర్ ని కలిపి తెరమీదకు తీసుకురావాలి అనుకున్నాను. చిన్నతనం నుండి నా చుట్టూ చూసిన ఎన్నో క్యారెక్టర్లనీ ఈ కథలో రాసుకున్నా. మొదట లగ్గం అని టైటిల్ అనుకున్నప్పుడు టైటిల్ చెప్పగానే చాలా మంది కనెక్ట్ అయ్యారు. టైటిల్ కి అంత రెస్పాన్స్ అస్సలు ఊహించలేదు. ఇది ప్రతి ప్రవాస భారతీయులు &సాఫ్టువేర్ ఇంజనీర్, రైతు, పెళ్లి చేసుకోబోయే అమ్మాయి, అలాగే ఆడపిల్ల ఉన్న ప్రతి తండ్రి తప్పక చూడాల్సిన సినిమా ఇది. ఈ కధలో ఎమోషన్స్ ఒక పెయింటింగ్ లా పోట్రెయిట్ చేసాను.

*లగ్గం సినిమా తెలంగాణ నేపథ్యంలో జరిగే తెలుగు సినిమా. ఇందులో ఆర్టిస్టులు అందరూ వాడుక భాషలో మాట్లాడుతారు. సినిమా షూట్ చేస్తున్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు ఈ సినిమా మరో 'పెళ్లి పుస్తకం' అంత హిట్ అవుతుందని పదేపదే చెప్పేవారు. ఈ సినిమాలో అనేకమంది ప్రముఖ నటినటులు ఉన్నారు. వారందరితో కలిసి పనిచేయడంతో ప్రతిరోజు షూటింగ్ ఒక లగ్గంలా ఉండేది.

*లగ్గం ఐడియా అనుకున్నప్పుడు ఈ సినిమానీ ఒక ట్రూత్ తో ఎండ్ చెయ్యాలి అనుకున్నాను.. అదే చేసాను. క్లైమాక్స్ ఈ సినిమాని మరో మెట్టు ఎక్కిస్తుంది. ఈ లగ్గం అరిటాకులో విందుభోజనంలా ఉండబోతుంది. పెళ్ళైన ప్రతీ ఒక్కరికీ వాళ్ళ లగ్గాన్ని వాళ్ళకి మరోసారి గుర్తు చేస్తాను. పెళ్లి చేసుకోబోయే వాళ్ళు ఎలా చేసుకోవాలో... ఎంటర్‌టైన్‌మెంట్ వేలో చెప్పాను.

*నేను లగ్గం అనే ఒక ప్రపంచాన్ని సృష్టించి ప్రేక్షకులను బంధువులుగా మార్చబోతున్నాను. ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదలవుతుంది. అందరూ తప్పకుండా వచ్చి మమ్మల్ని దీవించండి. అందరూ ఆహ్వానితులే...

*ప్రతి మనిషి జీవితంలో పుట్టుక, పెళ్లి, చావు మూడు ప్రధానమైన ఘట్టాలు... జీవితంలో అంతటి విలువైన పెళ్లి చేసే సమయంలో రెండు కుటుంబాల ఎలా ఆలోచించాలి ? అనే అంశం ఈ లగ్గం సినిమాలో అందరిని ఆలోచింపజేసే విధంగా ఉంటుంది.

ఇది మీ ఇంటి లగ్గం...సేవ్ ది డేట్! అంటూ సినిమా విజయం పట్ల ధీమా వ్యక్తం చేశారు దర్శకులు. ఈ చిత్రాన్ని సుబిషి ఎంటర్టైన్మెంట్స్ వేణుగోపాల్ రెడ్డి నిర్మించారు. సాయి రోనక్, ప్రజ్ఞ నగ్ర, రాజేంద్రప్రసాద్,రోహిణి,సప్తగిరి, ఎల్బి.శ్రీరామ్, కృష్ణుడు, రఘుబాబు, రచ్చ రవి, కనకవ్వ, వడ్లమని శ్రీనివాస్, కావేరి, చమ్మక్ చoద్ర, చిత్రం శ్రీను, సంధ్య గంధం, టి. సుగుణ ,లక్ష్మణ్ మీసాల, ప్రభావతి,కంచరపాలెం రాజు, ప్రభాస్ శ్రీను, వివా రెడ్డి, సత్య ఏలేశ్వరం, అంజిబాబు, రాదండి సదానందం, కిరీటి, రవి వర్మ, తదితరులు ప్రముఖ పాత్రలు పోషించారు. నిర్మాణం: సుబిషి ఎంటర్‌టైన్‌మెంట్స్, ఈ చిత్రానికి కథ - మాటలు - స్క్రీన్ ప్లే- దర్శకత్వం రమేశ్ చెప్పాల, నిర్మాత: వేణుగోపాల్ రెడ్డి, నేపధ్య సంగీతం: మణిశర్మ, కెమెరామెన్: బాల్ రెడ్డి. సంగీతం:చరణ్ అర్జున్. ఎడిటర్: బొంతల నాగేశ్వర రెడ్డి. కొరియోగ్రఫీ: అజయ్ శివశంకర్.