కంటెంట్ మాత్రమే కింగ్ అన్న వర్మ!
సంచలనాల రాంగోపాల్ వర్మ తన సినిమాల్ని తప్ప ఇతర సినిమాల్ని రిలీజ్ కి ముందు ప్రమోట్ చేయరు.
By: Tupaki Desk | 22 Aug 2024 7:37 AM GMTసంచలనాల రాంగోపాల్ వర్మ తన సినిమాల్ని తప్ప ఇతర సినిమాల్ని రిలీజ్ కి ముందు ప్రమోట్ చేయరు. రిలీజ్ అయిన అనంతరం అవి హిట్ తో సంచలనమైతే తనదమైన మార్క్ పీడ్ బ్యాక్ ఇస్తారు తప్ప అంత వరకూ ఎలాంటి కామెంట్ చేయరు. అదీ సినిమా బాగుంటే పాజిటివ్ గా స్పందిస్తారు..ఒక వేళ ప్లాప్ అయితే ఎలాంటి నెగిటివ్ కామెంట్ జోలికి వెళ్లరు. ఒకవేళ అలా వెళ్లారు? అంటే అది ఏ పూరి జగన్నాధ్ సినిమానో అయి ఉండాలి.
పూరి తన ప్రియ శిష్యుడు కాబట్టి అతడి సినిమాలకే ఎక్కువగా స్పందిస్తుంటాడు. అయితే తాజాగా ఓ హారర్ థ్రిల్లర్ సినిమాని వర్మ ప్రమోట్ చేయడానికి రావడం విశేషం. కోలీవుడ్ సినిమా `డీమాంటీ కాలనీ`కి సీక్వెల్ గా `డిమాంటీ కాలనీ-2` తెరకెక్కిన సంగతి తెలిసిందే. తొలి భాగం తమిళ్ సహా తెలుగులోనూ మంచి విజయం సాధించింది. దీంతో రెండవ భాగాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.
ఈసినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకకు గెస్ట్ గా రాంగోపాల్ వర్మ హాజరయ్యారు. ఈసందర్భంగా నేడు ఎలాంటి సినిమాలు విజయం సాధిస్తున్నాయి? అన్న సంగతిని మరోసారి గుర్తు చేసారు. `నేను 20 ఏళ్ల క్రితం `భూత్` అనే సినిమా చేసా. అదంతా అపార్ట్ మెంట్ లోనే జరుగుతుంది. అది రిలీజ్ అయ్యాక చాలా మంది భయపడి అపార్ట్ మెంట్ లోకి వెళ్లడం మానేసారు.
`డీమాంట్ కాలనీ` రిలీజ్ అయ్యాక ఆ పేరు పెట్టినందుకు వివాదం అయిందని దర్శకుడు నాతో చెప్పారు. ఈరోజు సినిమాకి కేవలం కంటెంట్ మాత్రమే. కంటెంట్ ఉన్న చిన్న సినిమాలే పెద్ద విజయం సాధిస్తు న్నాయి. ప్రస్తుతం ట్రెండ్ కూడా వాటిదే. ఏ కథ అయినా ప్రేక్షకుడిని సీట్ లో కూర్చబెట్టాలి. ఈ మధ్య అలాంటి కథలే ఎక్కువగా వస్తున్నాయి` అని అన్నారు.