విజయవాడలో 'వ్యూహం'..అసలు సంగతేంటి వర్మా?
జూనియర్ ఆర్టిస్ట్ లను రోజువారి కూలి ప్రాతిపదికన తీసుకొచ్చిన బొలెడంత ఖర్చు? అనుకున్నారో ఏమోగానీ... ఈ అవకాశం మీ కోసం అంటూ ప్రేక్షలకు ఆఫర్ ఇచ్చారు.
By: Tupaki Desk | 9 Aug 2023 11:15 AM GMTసంచలనాల రాంగోపాల్ వర్మ 'వ్యూహం' గురించి తెలిసిందే. 2024 ఎన్నికల కాక ముందు వర్మ నుంచి రాబోతోన్న మరో పొలిటికల్ ఎంటర్ టైనర్ ఇది. కుట్రలకి-ఆలోచనలకీ మధ్య వ్యూహం కథ నడుస్తుంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కోణంలో కథసాగుతుందని ఇప్పటికే ప్రచారం సాగుతోంది. దీనిలో భాగంగా సినిమాలో ఇంకా చాలా పొలిటికల్ పాత్రలు భాగం కానున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే కొద్ది భాగం షూటింగ్ పూర్తిచేసిన వర్మ తాజా షెడ్యూల్ విజయవాడలో ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.
దీనిలో భాగంగానే నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా ఉన్న బైబిల్ మిషన్ గ్రౌండ్‌లో 'వ్యూహం' చిత్రం కోసం ప్రేక్షకుల సన్నివేశాలని చిత్రీకరిస్తున్నట్టు ఆర్జీవీ ట్వీట్ చేశారు. అందుకు గాను తానెంతో థ్రిల్ అవుతున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఔత్సాహిక కళాకారులకు ఆహ్వానం పలికారు. చిత్రీకరణలో పాల్గొనేవారిని ఆహ్వానిస్తున్నట్టు వెల్లడించారు. వందలా మంది ప్రేక్షకులకు షూటింగ్ కి అవసరం అని భావించిన నేపథ్యంలో వర్మ ఇలాంటి ఆఫర్ ఇచ్చారు.
జూనియర్ ఆర్టిస్ట్ లను రోజువారి కూలి ప్రాతిపదికన తీసుకొచ్చిన బొలెడంత ఖర్చు? అనుకున్నారో ఏమోగానీ... ఈ అవకాశం మీ కోసం అంటూ ప్రేక్షలకు ఆఫర్ ఇచ్చారు. మరి ఇందులో ఎంత మంది స్వచ్ఛందంగా పాల్గొన్నారో తెలియదు. అయితే వర్మ ఇలా విజయవాడలో దుకాణం పెట్టడం రాజకీయంగానూ కొంత కాక మొదలైంది.
తన సినిమాలో పాత్ర ధారులు విజయవాడ వాసులే కావాలనుకోవడం వెనుక వర్మ ఉద్దేశం ఏంటి? కులాల కోణంలో వర్మ కథ సాగుతుందా? అంటూ కొత్త డౌట్ కూడా రెయిజ్ అవుతుంది. ఇప్పటికే వర్మ వాస్తవ సంఘటనలు ఆధారంగా కులాల్ని బేస్ చేసుకుని విజయవాడ వేదికగా కొన్ని సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. ఆ రెండు కులాల మధ్య ఎప్పటి నుంచో ఉన్న వైరాన్ని సినిమా రూంపలో చెప్పే ప్రయత్నం చేసారు. తాజాగా 'వ్యూహం' వెనుక అలాంటి స్ట్రాటజీ ఏదైనా ఉందా? అన్నది మెజార్టీ వర్గం అంచనా వేస్తుంది.