వ్యూహంకి పోర్న్‌తో పోలిక పెట్టిన వర్మ
అనేక అవాంతరాలను దాటి వ్యూహం ఈ వారమే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా ప్రోమోలు మరీ వెటకారంగా అనిపించాయి
By: Tupaki Desk | 19 Feb 2024 4:27 PM GMTరామ్ గోపాల్ వర్మ.. ఈ పేరు ఒక బ్రాండ్‌గా ఉండేది ఒకప్పుడు. నటీనటులు ఎవరైనా సరే.. వర్మ డైరెక్ట్ చేసిన సినిమా అంటే ఆయన కోసమే మెజారిటీ ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లేవాళ్లు. స్టార్ హీరోలతో సమానంగా ఇమేజ్ ఉండేది వర్మకు ఒకప్పుడు. కానీ గత పది పదిహేనేళ్లలో ఆయన దర్శకుడిగా ఎలా పతనం అయిపోయారో అందరూ చూశారు. మరీ పోర్న్ సినిమాలు తీసుకునే స్థాయికి పడిపోయాడు. ఇక ఆయన పొలిటికల్ పార్టీల స్పాన్సర్‌షిప్‌తో తీస్తున్న రాజకీయ సినిమాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. గత ఏడాది ‘కొండా’ అనే సినిమా వచ్చింది వర్మ నుంచి. దానికి రిలీజ్ ఖర్చులు కూడా వెనక్కి రాలేదు. ఇప్పుడు ఆయన ఏపీ అధికార పార్టీ కోసం వ్యూహం, శపథం అనే రెండు సినిమాలు తీశారు. జగన్‌కు ఎలివేషన్ ఇస్తూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లను టార్గెట్ చేయడం ఈ సినిమాల ఉద్దేశం.
అనేక అవాంతరాలను దాటి వ్యూహం ఈ వారమే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా ప్రోమోలు మరీ వెటకారంగా అనిపించాయి. సామాన్య ప్రేక్షకుల్లో ఈ సినిమా పట్ల ఏమంత ఆసక్తి కనిపించడం లేదు. కానీ వర్మ మాత్రం ‘వ్యూహం’ సినిమాను జనం బాగా చూస్తారని అంటున్నాడు. ముఖ్యంగా టీడీపీ, జనసేన వాళ్లే ఈ సినిమాను ఎక్కువ చూస్తారని వర్మ అన్నాడు. కాకపోతే వాళ్లందరూ డైరెక్ట్‌గా థియేటర్లకు వెళ్లరని, దాక్కుని వెళ్తారని.. అలాగే బాత్రూముల్లో రహస్యంగా ఈ సినిమా చూస్తారని వర్మ అన్నాడు. ఇంకా ఒక అడుగు ముందుకు వేసి.. తాను పోర్న్ సినిమాలు చూసినట్లే టీడీపీ, జనసేన వాళ్లు ‘వ్యూహం’ సినిమా చూస్తారని వర్మ చిత్రమైన పోలిక చెప్పాడు. ఒకప్పుడు హైదరాబాద్‌లో లాంబా థియేటర్లో శృంగార చిత్రాలు ఆడేవని.. వాటికి ఒకరికి తెలియకుండా ఒకరు రహస్యంగా వెళ్లి చూసేవారని.. ‘వ్యూహం’ సినిమాను కూడా టీడీపీ, జనసేన వాళ్లు రహస్యంగా చూస్తారని వర్మ తేల్చాడు. కానీ యాత్ర, రాజధాని ఫైల్స్ చిత్రాలను అనుకూల పార్టీల వాళ్లు ఓన్ చేసుకున్నట్లు, ప్రతికూల పార్టీల వాళ్లు చూసినట్లు పెద్దగా సంకేతాలు కనిపించలేదు. మరి వర్మ గారి ‘వ్యూహం’ సంగతి ఏమవుతుందో చూడాలి.