రామోజీ కన్నుమూత.. టాలీవుడ్ ఘన నివాళి
ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్, మీడియా మొఘల్ రామోజీ రావు తుదిశ్వాస విడిచారు.
By: Tupaki Desk | 8 Jun 2024 5:13 AM GMTఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్, మీడియా మొఘల్ రామోజీ రావు తుదిశ్వాస విడిచారు. మూడు రోజుల క్రితం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు రావడంతో హైదరాబాద్ లోని స్టార్ ఆస్పత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు కన్నుమూశారు. దీంతో పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. సోషల్ మీడియా వేదికగా అనేక మంది మూవీ సెలబ్రిటీలు సంతాపం తెలిపారు.
రామోజీ రావు మరణం పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతాపం ప్రకటించారు. ఎవరికీ తలవంచని మేరు పర్వతం దివికేగింది.. ఓం శాంతి అని ట్వీట్ చేశారు. తెలుగు పత్రికా రంగంలో రామోజీరావు మకుటం లేని మహారాజు అని హీరో నందమూరి బాలకృష్ణ కొనియాడారు. సినీ ఇండస్ట్రీలో ఉషోదయ కిరణాలు ప్రసరింపజేశారని ట్వీట్ చేశారు. నందమూరి తారక రామారావుతో ఆయన అనుబంధం ప్రత్యేకమైందని బాలయ్య తెలిపారు. విక్టరీ వెంకటేష్ కూడా సంతాపం ప్రకటించారు.
రామోజీరావు తుదిశ్వాస విడిచారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. రామోజీరావు లాంటి దార్శనికులు నూటికో కోటికో ఒకరు ఉంటారని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. ఆయన మన మధ్య ఇక లేరనే వార్త బాధాకరమని తెలిపారు. నిన్ను చూడాలని మూవీతో తనను టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేసిన జ్ఞాపకాలు ఎప్పటికీ మరువలేనని ట్వీట్ చేశారు. నందమూరి కళ్యాణ్ రామ్ కూడా సంతాపం తెలిపారు.
రామోజీరావు మృతి చాలా బాధాకరమని యంగ్ హీరో విష్ణు మంచు తెలిపారు. ఆయన్ను కలిసిన ప్రతిసారీ ఎన్నో జీవిత పాఠాలను నేర్చుకున్నట్లు ట్వీట్ చేశారు. రామోజీరావు మృతి పట్ల దర్శకుడు రాజమౌళి సంతాపం ప్రకటించారు. భారతరత్నతో ఆయనను సత్కరించడమే ఘనమైన నివాళి అని తెలిపారు. కీరవాణి దంపతులు, రాజమౌళి దంపతులు.. రామోజీరావు పార్థివ దేహానికి నివాళులు కూడా అర్పించారు.
ఏ రంగంలో అయినా ఎలాంటి నేపథ్యం లేకపోయినా కష్టపడితే విజయం దక్కుతుందనే స్ఫూర్తిని పంచిపెట్టిన రామోజీ రావు జన్మ ధన్యమని నిర్మాత అశ్వనీదత్ ట్వీట్ చేశారు. తెలుగు కీర్తిని, స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన ఆయన మరణం తెలుగు జాతికి తీరని లోటు అని తెలిపారు. రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు సోషల్ మీడియాలో డైరెక్టర్ బాబీ ట్వీట్ చేశారు.
రామోజీ రావు మరణం నమ్మశక్యం కాదని, ఎందుకంటే ఆయన ఒక వ్యక్తి నుంచి ఒక సంస్థగా రూపాంతరం చెందారని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. ఆయన మనిషి కాదని, శక్తి అని కొనియాడారు. ఆయన మరణాన్ని నమ్మలేకపోతున్నట్లు తెలిపారు. మరోవైపు, హీరో రామ్ చరణ్.. గేమ్ ఛేంజర్ సెట్స్ నుంచి రామోజీ మరణం పట్ల సంతాపం తెలిపారు. రామోజీ రావు మరణం తెలుగు ప్రజలకు తీరని లోటని అన్నారు. వీరితోపాటు మరెందరో ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.