పూరి ఎక్కువ రోజులు తీసుకున్న స్క్రిప్టు ఇదే: రామ్
రామ్ డబుల్ ఇస్మార్ట్ పాత్రలో మరోసారి మైండ్ బ్లాక్ చేసే మాస్ పెర్ఫామెన్స్ ని కనబరుస్తున్నాడు.
By: Tupaki Desk | 5 Aug 2024 4:14 AM GMTరామ్ పోతినేని- పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ `డబుల్ ఇస్మార్ట్` ఆగస్టు 15న విడుదలకు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ ఇప్పటికే యువతరంలోకి, మాస్ ఫ్యాన్స్ లోకి దూసుకెళ్లింది. కేజీఎఫ్ లో అధీరగా అద్భుత నటనతో ఆకట్టుకున్న సంజయ్ దత్ డబుల్ ఇస్మార్ట్ ప్రధాన అస్సెట్ అనడంలో సందేహం లేదు. ట్రైలర్ లో రామ్ వర్సెస్ సంజూ సన్నివేశాలు ఆసక్తిని కలిగించాయి. మెమరీ చిప్ కన్సెప్ట్ ఉత్కంఠను పెంచుతోంది.
రామ్ డబుల్ ఇస్మార్ట్ పాత్రలో మరోసారి మైండ్ బ్లాక్ చేసే మాస్ పెర్ఫామెన్స్ ని కనబరుస్తున్నాడు. పూరి జగన్నాధ్, ఛార్మీ కౌర్ నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో ఆగస్ట్ 15 స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ట్రైలర్ వేడుకలో ఉస్తాద్ రామ్ పోతినేని మాట్లాడుతూ.. పూరి జగన్నాథ్ ఎక్కువ రోజులు పని చేసిన స్క్రిప్ట్ ఇదేనని వ్యాఖ్యానించారు.
రామ్ మాట్లాడుతూ-``2018లో పూరి గారిని గోవాలో కలిశాను. ఎలాంటి సినిమా చేద్దామని అనుకున్నప్పుడు పదేళ్ళ తర్వాత కూడా గుర్తుండిపోయే పాత్రను చేద్దామని అన్నాను. అప్పుడు ఆయన ఇస్మార్ట్ శంకర్ రాశారు. ఇస్మార్ట్ శంకర్ క్యారెక్టర్ మెంటల్ మాస్ మ్యాడ్ నెస్ లాంటివాడు.. నటించేప్పుడు ఆ కిక్ వేరు. అలాంటి మెంటల్ మాస్ మ్యాడ్ నెస్ క్యారెక్టర్ తో ఒక మంచి స్క్రిప్టు ఉంటే ఎలా ఉంటుందోనని వేచి చూసాం. అప్పుడు ఈ డబుల్ ఇస్మార్ట్ స్క్రిప్ట్ రాశారు. ఇప్పటివరకూ ఆయన చేసిన సినిమాల్లో అన్నిటికంటే ఎక్కువ టైం తీసుకొని చేశారు. చాలా కష్టపడ్డారు. ఆయనతో పని చేసినప్పుడు ఎంత కిక్ వుంటుందో స్క్రిప్ట్ విన్నప్పుడు కూడా అంతే కిక్ వుంటుంది. కమర్షియల్ సినిమా అంటే గుర్తుకువచ్చేది పూరి గారే. కమర్షియల్ సినిమా అంటే అంత ఈజీ కాదు. కానీ ఒక్కసారి కమర్షియల్ సినిమా హిట్ అయితే దాంట్లో వచ్చే కిక్ ఇంక దేంట్లో రాదు`` అని అన్నారు.
ఇస్మార్ట్ శంకర్ తర్వాత మళ్ళీ డబుల్ ఇస్మార్ట్ కి ఆ కిక్ వుంటుంది. అందరం చాలా ఇష్టపడి చేశాం. అలీ గారు ట్రాక్ చాలా ఎంజాయ్ చేస్తారు. కావ్య నటనను, టెంపర్ వంశీ క్యారెక్టర్ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు... అని అన్నారు. ఆగస్టు 15న థియేటర్లలో కలుద్దామని రామ్ అన్నారు.