Begin typing your search above and press return to search.

పవన్ మూవీ ఉంటుందా? నిర్మాత ఏం చెప్పారంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎంత బిజీగా ఉన్నారో తెలిసిందే.

By:  Tupaki Desk   |   28 July 2024 4:34 PM GMT
పవన్ మూవీ ఉంటుందా? నిర్మాత ఏం చెప్పారంటే?
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎంత బిజీగా ఉన్నారో తెలిసిందే. ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వరుస మీటింగ్స్, సమీక్షలు నిర్వహిస్తూ తన మార్క్ చూపిస్తున్నారు. కొన్ని విషయాల్లో అధికారులను నిలదీస్తున్నారు. అదే సమయంలో ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ రాజకీయాల్లో కూడా పవర్ స్టార్ అనిపించుకున్నారు. అయితే పవన్ చేతిలో ఉన్న మూడు సినిమాలు కూడా ప్రస్తుతం హోల్డ్ లో ఉన్నాయి.

హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్.. ఈ మూడు సినిమాల షూటింగ్స్ ఇప్పటికే కొంత భాగాన్ని పూర్తి చేసుకున్నాయి. కానీ ఎన్నికల ముందు నుంచే పవన్ బిజీ అవ్వడంతో ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మళ్లీ పవన్ సెట్స్ లో అడుగుపెడితే మూడు సినిమాల వర్క్స్ చకచకా జరగనున్నాయి. అయితే కొన్నేళ్ల క్రితం అనౌన్స్మెంట్‌ వచ్చి కూడా షూటింగ్ స్టార్ట్ కాని పవన్ కళ్యాణ్ చేయాల్సిన సినిమా ఒకటి ఉందన్న మీకు తెలుసా? ఆ విషయం గుర్తుందా?

అదేనండీ ఎస్ ఆర్ టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దర్శకుడు సురేంద్రరెడ్డి.. పవన్ కళ్యాణ్ తో మూవీని 2020లో అనౌన్స్ చేశారు. ఆ తర్వాత ఏడాది పవన్ బర్త్ డే సందర్భంగా యథా కాలమ్.. తథా వ్యవహారమ్ పేరుతో పోస్టర్ ను కూడా విడుదల చేశారు. కానీ ఇప్పటి వరకు ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లలేదు. అక్కినేని అఖిల్ ఏజెంట్ మూవీ తర్వాత పవన్ తో సురేందర్ రెడ్డి వర్క్ చేస్తారని అంతా భావించినా అలా జరగలేదు. దీంతో ఆ సినిమా ఆగిపోయిందని సందేహాలు వ్యక్తమయ్యాయి.

ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ పై నిర్మాత, ఎస్ ఆర్ టీ ఎంటర్టైన్మెంట్స్ అధినేత రామ్ తాళ్లూరి స్పందించారు. విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్ లో పవన్ మూవీ గురించి ఆయన మాట్లాడారు. తమ సైడ్ పనులన్నీ అయిపోయాయని తెలిపారు. స్క్రిప్ట్ లాక్ చేసినట్లు పేర్కొన్నారు. పూజా కార్యక్రమం కూడా జరిగిందని చెప్పారు. అన్ని పనులు పూర్తి అయినట్లు వెల్లడించారు. అంతా పవన్ కళ్యాణ్ చేతుల్లోనే ఉందని తెలిపారు. వారం రోజుల ముందే పవన్ ను కలిశానని పేర్కొన్నారు రామ్ తాళ్లూరి.

తన వీలు చూసుకుని చేతిలో ఉన్న సినిమాలను పవన్ కంప్లీట్ చేయొచ్చని అని రామ్ తాళ్లూరి తెలిపారు. ఇటీవల తన మంత్రిత్వ శాఖల పైనే దృష్టి అంతా పెట్టినట్లు పవన్ చెప్పిన విషయం తెలిసిందే. మూడు నెలలు పూర్తిగా ఆ పనులపైనే ఉంటానని పరోక్షంగా చెప్పారు. వీలు చిక్కినప్పుడు షూటింగ్ లు పూర్తి చేస్తానన్నారు. మరి పవన్ మళ్లీ మూవీ సెట్స్ లోకి ఎప్పుడు అడుగుపెడతారో.. అసలు సురేంద్రరెడ్డి ప్రాజెక్ట్ లో నటిస్తారో లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే.