రానా ప్రయోగాలు ఇప్పట్లో ఆపేట్టు లేడు
అమెజాన్ ప్రైమ్ వీడియోలో `రానా టాక్ షో` అద్భుత ఆదరణ పొందింది. ఓటీటీలో రానా నాయుడు లాంటి భారీ ప్రయోగంతోను అతడు చర్చల్లో నిలిచాడు.
By: Tupaki Desk | 27 Feb 2025 1:30 AM GMTరానా ఆల్ రౌండర్ నైపుణ్యం పరోపకార స్వభావం గురించి ఎంత చెప్పినా తక్కువే. నటుడు.. నిర్మాత.. స్టూడియో యజమాని... హోస్ట్.. డబ్బింగ్ కళాకారుడు.. పరోపకారి.. ఇలా ఏ కోణంలో చూసినా రానా దగ్గుబాటి టాలీవుడ్ లో చాలా ప్రత్యేకత ఉన్న వ్యక్తి. ఇటీవల సినిమాలతో పాటు, రానా తన డిజిటల్ వెంచర్లతో కూడా సంచలనం సృష్టిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో `రానా టాక్ షో` అద్భుత ఆదరణ పొందింది. ఓటీటీలో రానా నాయుడు లాంటి భారీ ప్రయోగంతోను అతడు చర్చల్లో నిలిచాడు.
అయినా అతడి దాహం ఇంకా తీరలేదు. నిరంతరం కొత్త ఫార్మాట్‌లతో ప్రయోగాలు చేస్తున్నాడు. తాజాగా హాలీవుడ్ సినిమాకి హిందీ డబ్బింగ్ అందించి సర్ ప్రైజ్ చేసాడు. ఈ డబ్బింగ్‌తో ఆగుతాడా? లేక ఇంకేవైనా ప్రయోగాలు చేస్తాడా? అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. నటనలో, నిర్మాణంలో ఇప్పటికే చాలా ప్రయోగాలు చేసాడు. ఇంకా అతడు ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు క్రంచైరోల్‌లోని హాలీవుడ్ సిరీస్ కోసం తన డబ్బింగ్ స్కిల్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచాడు.
రానా `నేను నా హిందీ` అనే పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చాడు. ఇది ఒక సరదా ట్విస్ట్. అయితే రానా దగ్గుబాటి హిందీని పర్ఫెక్ట్ గా మాట్లాడగల నేర్పరి. అతడు తెలుగు-తమిళం-హిందీ-ఇంగ్లీష్ లో మాట్లాడగలడు. అతడి బహుభాషా నైపుణ్యం అతడి పరిధిని విస్తరించుకునేలా చేసిందని చెప్పాలి. అలాగే బాలీవుడ్ అతడికి కొత్త కాదు. దమ్ మారో దమ్, డిపార్ట్‌మెంట్, బేబీ లాంటి హిందీ చిత్రాల్లో నటించాడు. యే జవానీ హై దీవానీలో మరపురాని చిరస్మరణీయమైన అతిధి పాత్రలో కనిపించాడు. ఇప్పుడు ఓ హిందీ సినిమాకి అనువాదం చెబుతూ అందరి దృష్టిని ఆకర్షించాడు.