'రామానాయుడ'ని ఎప్పుడు వేయించుకుంటావ్ రానా?
అంత గొప్ప లెజెండ్ పేరుతో తనని పిలవడం ఇష్టం లేదని.. తనకి ఆ అర్హత లేదని...ఆ పేరును ఓ బాధ్యతగా భావించి రానాగా మార్చుకున్నాడు.
By: Tupaki Desk | 19 Oct 2024 5:30 PM GMTరానా అసలు పేరేంటో తెలుసా? రామానాయుడు. తాతగారైన మూవీ మొఘల్ రామానాయుడు పెద్దకుమారుడు సురేష్ బాబు తొలి కుమారుడు కావడంతో రానాకి తాత పేరు పెట్టారు. కానీ ఆ పేరు ను రానాగా మార్చుకున్నాడు. ఎందుకంటే? అలా పిలుపించుకోవాలంటే రానాకి భయం. అంత గొప్ప లెజెండ్ పేరుతో తనని పిలవడం ఇష్టం లేదని.. తనకి ఆ అర్హత లేదని...ఆ పేరును ఓ బాధ్యతగా భావించి రానాగా మార్చుకున్నాడు.
ఈ విషయాన్ని రానా స్వయంగా ఓ సందర్భంలో తెలిపాడు. మరి రానా రామానాయుడిగా మారేది ఎప్పుడు అంటే తాత గారిలా బాగా ఫేమస్ అయిన వేళ అలా మారుతాడేమో. రానా నటుడిగా ఇప్పటికే ఫేమస్. అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తున్నాడు. వైవిథ్యమైన కంటెంట్ ఉన్న సినిమాలు చేయడం అతడి ప్రత్యేకత. అతడు నటించిన `ఘాజీ` సినిమాకు జాతీయ అవార్డు కూడా వచ్చింది. బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయ్యాడు.
కానీ ఇది సరిపోదు. రానా ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. నటుడిగా సోలోగా 500 కోట్లు వసూళ్లు తేగల సామర్ద్యం ఉన్న నటుడు. కానీ ఇంకా అలాంటి ప్రయత్నాలు చేయలేదు. కథలు అనుకుంటున్నాడు గానీ కుదరడం లేదు. అతడి మార్కెట్ సహా చాలా అంశాలు దృష్టిలో పెట్టుకుని చేయాల్సిన సినిమాలు కాబట్టి తొందర పడటం లేదు. అలాగే నిర్మాతగానూ సినిమాలు చేస్తున్నాడు.
నవతరం ప్రతిభావంతుల్ని తాతగారి తరహాలోనే ప్రోత్సహించడంలో ముందుంటున్నాడు. ఇతర భాషల చిత్రాల్ని నిర్మాతగా అనువదించి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నాడు. కానీ తాతగారి పేరు వేసుకోవడానికి ఇది సరిపోదు. నటుడిగా, నిర్మాతగా రానా చేయాల్సింది..సాధించాల్సింది ఇంకా చాలా ఉంది. ముందుగా పాన్ ఇండియాలో అతడు సోలోగా ఫేమస్ అవ్వాలి. నిర్మాతగా అతడు చేసే ప్రయత్నాలనేవి వాటంతటవే పలిస్తాయి. కానీ నటుడిగా మాత్రం తనకు తాను గా ఇంకా ఎదిగి చూపించాలి. అప్పుడే ధైర్యంగా దగ్గుబాటి రామానాయుడు అని టైటిల్స్ కార్డులో వేయించుకోగలడు.