రానా ఎప్పుడూ ఇంతే...!
కానీ ఆయన అలా చేయలేదు. తెలుగులో లీడర్‌తో ఎంట్రీ ఇచ్చిన వెంటనే హిందీలో 'దమ్ మారో దమ్' సినిమాలో నటించాడు.
By: Tupaki Desk | 22 March 2025 5:00 PM ISTటాలీవుడ్ హీరోల్లో రానా ఎప్పటికప్పుడు తన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తున్నాడు. తెలుగు లెజెండ్రీ నిర్మాత రామానాయుడు మనవడు, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కొడుకు కావడంతో రానా తల్చుకుంటే ఏడాదిలో అర డజను సినిమాలను హీరోగా చేయగలడు. కానీ అలా ఎప్పుడూ చేయలేదు. చేతిలో బ్యానర్ ఉంది కదా అని ఇష్టానుసారంగా తాను హీరోలుగా సినిమాలు చేయలేదు. 2010లో లీడర్ సినిమాతో హీరోగా పరిచయం అయిన రానా ఆ వెంటనే పెద్ద దర్శకుడితో సొంత బ్యానర్‌లో హీరోగా సినిమాలు చేసే అవకాశం ఉంది. కానీ ఆయన అలా చేయలేదు. తెలుగులో లీడర్‌తో ఎంట్రీ ఇచ్చిన వెంటనే హిందీలో 'దమ్ మారో దమ్' సినిమాలో నటించాడు.
రానా హీరోగా స్టార్‌డం దక్కించుకోవాలి, ఇతర స్టార్ హీరోల మాదిరిగా వందల కోట్ల వసూళ్లు సాధించే సినిమాలు చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. హీరోగానే నటించాలని కూడా రానా ఎప్పుడూ అనుకోలేదు. అందుకే కెరీర్ ఆరంభం నుంచి కూడా విభిన్నమైన కథలను ఎంపిక చేసుకుంటూ వచ్చాడు. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా హిందీ, తమిళ్ సినిమాల్లో నటించడం ద్వారా పాన్ ఇండియా నటుడిగా గుర్తింపు దక్కించుకున్నాడు. హీరోగా సాఫీగా కెరీర్ సాగించకుండా తనకు నచ్చిన కథలను ప్రేక్షకులకు అందించే ఉద్దేశంతో నిర్మాతగానూ రానా పలు ప్రయత్నాలు చేశాడు. రానా సమర్పణలో వచ్చిన చిన్న బడ్జెట్ సినిమాలు చాలా వరకు మంచి ఫలితాన్ని చవి చూశాయి. రానా నటుడిగానే కాకుండా టాక్ షో హోస్ట్‌గానూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
బాహుబలి సినిమాలో విలన్‌గా నటించడం ద్వారా మరోసారి పాన్ ఇండియా రేంజ్‌లో మంచి గుర్తింపు దక్కింది. ఆ సమయంలో హిందీలో వరుసగా సినిమాలు చేసే అవకాశాలు వచ్చాయి. కానీ రానా ఆచితూచి సినిమాలను ఎంపిక చేస్తూ వచ్చాడు. కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలోనూ రానా సినిమాలు చేయకుండా బ్రేక్ తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. రానా చివరగా 2022లో విరాటపర్వం సినిమాతో వచ్చాడు. ఆ తర్వాత రెండు మూడు సినిమాల్లో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చాడు. హీరోగా ఆయన నటించేందుకు ఆసక్తి కనబర్చుతున్నట్లు లేడు. అందుకే ఇప్పటి వరకు రానా హీరోగా కొత్త సినిమా మొదలు కాలేదు. రానా హీరోగా సినిమా ఎప్పుడు మొదలు అవుతుందా అని అభిమానులు ఎదురు చూస్తుంటే మరోసారి రానా సర్‌ప్రైజింగ్ నిర్ణయం తీసుకున్నాడు.
నిర్మాతగా రానా మరో సినిమాకు రెడీ అయ్యాడు. అయితే ఈసారి ఇండియన్ మూవీ కాకుండా ఇండో అమెరికన్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్ధం అయ్యాడు. ఇండో అమెరికన్ దర్శకుడు బెన్ రేఖీతో రానా ఒక సినిమాను నిర్మించబోతున్నాడు. ఆ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు మనోజ్ బాజ్ పాయ్ ముఖ్య పాత్రలో నటించబోతున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న ఈ సినిమాను త్వరలోనే పట్టాలెక్కించే అవకాశాలు ఉన్నాయి.
ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించిన బెన్ దర్శకత్వంలో రానా సినిమాను చేయబోతున్న నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో నిర్మాతగా గుర్తింపు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. భారీ బడ్జెట్‌తో రానా నిర్మించబోతున్న ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి రానా ఎప్పటిలాగే హీరోగా సినిమాతో వస్తాడు అనుకుంటే ఏకంగా ఇండో అమెరికన్ సినిమాకు నిర్మాతగా రాబోతున్నాడు. ముందు ముందు రానాను ఎక్కడ, ఎలా చూస్తామో అనేది కాలమే నిర్ణయించాలి.