వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో రానా
వరుసగా ఒకదాని వెంట ఒకటిగా ప్రయోగాలు చేస్తున్నాడు దగ్గుబాటి హీరో రానా. కానీ వీటిలో సఫలమయ్యేది చాలా అరుదు. కానీ కొత్తదనం నిండిన కంటెంట్ కోసం అతడు ప్రయత్నాలు ఆపడు.
By: Tupaki Desk | 4 Nov 2023 2:30 AM GMTవరుసగా ఒకదాని వెంట ఒకటిగా ప్రయోగాలు చేస్తున్నాడు దగ్గుబాటి హీరో రానా. కానీ వీటిలో సఫలమయ్యేది చాలా అరుదు. కానీ కొత్తదనం నిండిన కంటెంట్ కోసం అతడు ప్రయత్నాలు ఆపడు. తదుపరి హిరణ్య కశిపతో పాన్ ఇండియా స్టార్ గా మరోసారి సత్తా చాటాలని రానా ధృడమైన సంకల్పంతో ఉన్నాడు. ఇంతలోనే తలైవార్ 170లో నటిస్తున్నాడని కథనాలొచ్చాయి. ఇంతలోనే అంతకుమించి అనిపించేలా మరో వార్త టాలీవుడ్ లో దావానలంలా మారింది.
రానా దగ్గుబాటి తదుపరి బాహుబలి నిర్మాణ సంస్థ ఆర్కామీడియాలో ఓ సినిమాకి సన్నాహాలు చేస్తున్నాడనేది ఈ వార్త సారాంశం. ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్స్ శోభు యార్లగడ్డ - ప్రసాద్ దేవినేని రానా కోసం అద్భుతమైన కాన్సెప్టును ఎంపిక చేసారని తెలిసింది. దీనికి కొత్త దర్శకుడు కిషోర్ దర్శకత్వం వహించనున్నారని సమాచారం.
ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ వర్క్ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రారంభమవుతుందని తెలుస్తోంది. ప్రముఖ దర్శకుడు కె రాఘవేంద్రరావు సమర్పణలో ఇది రానా కెరీర్ లో మరో భారీ చిత్రం కానుంది. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించనున్నారు. అతి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని కూడా తెలుస్తోంది.
రజనీకాంత్ సినిమాలో కీలక పాత్ర:
రానా దగ్గుబాటి 'తలైవర్ 170' టీమ్‌లో చేరాడని ఇంతకుముందే గుడ్ న్యూస్ అందింది. ఇది అతడికి మరో భారీ పాన్ ఇండియా సినిమా అవుతుంది. ఇందులో రానాతో పాటు, ఫహద్ ఫాసిల్ ఒక ప్రధాన పాత్రలో కనిపిస్తారని కూడా కథనాలొస్తున్నాయి. హిరణ్యకశిప-తలైవార్ 170- ఆర్కా మీడియా సినిమాలతో రానా కెరీర్ ఫుల్ స్వింగ్ లోకి వచ్చిందని భావించాలి.
తలైవర్ 170లో మంజు వారియర్, రితికా సింగ్, దుషార విజయన్‌లు ఇతర సహాయక పాత్రలు పోషించనున్నారు. లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని అత్యంత భారీగా నిర్మించనుంది. అక్టోబర్‌లో తలైవర్ 170 షూటింగ్ ప్రారంభమవుతుంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ తిరువనంతపురంలో ప్రారంభం కానుంది. 'జై భీమ్' దర్శకుడు టీజే జ్ఞానవేల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ చివరిసారిగా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ 'జైలర్'లో కనిపించారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.650 కోట్లు వసూలు చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు తలైవర్ విరామంలో ఉన్నారు.