టాలీవుడ్ పై రణబీర్ ఫోకస్.. ఆ సంస్థలో బిగ్ ప్లాన్?
బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ కూడా ఈ మధ్య తెలుగు ప్రేక్షకులకు బాగానే దగ్గరవుతున్నాడు. ‘బ్రహ్మాస్త్రం’ సినిమా ద్వారా టాలీవుడ్ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకున్నారు.
By: Tupaki Desk | 13 Feb 2025 6:30 PM GMTబాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ కూడా ఈ మధ్య తెలుగు ప్రేక్షకులకు బాగానే దగ్గరవుతున్నాడు. ‘బ్రహ్మాస్త్రం’ సినిమా ద్వారా టాలీవుడ్ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకున్నారు. అప్పట్లో చేసిన తెలుగు ప్రమోషన్స్‌లో చూపిన ఎఫర్ట్, మన హీరోలపై చూపించిన గౌరవం, ఆయనకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి. బాలీవుడ్ హీరో అయినా తెలుగు ప్రేక్షకులతో నేరుగా కనెక్ట్ కావడం రణబీర్ ప్రత్యేకత. ఇప్పుడు ఆ బాండింగ్ ను మరింత పెంచడానికి రణబీర్ కపూర్ మరో క్రేజీ ప్లాన్ వేశారట.
టాలీవుడ్ జాతీయ స్థాయిలో మరింత ప్రాధాన్యత పొందుతోన్న విషయం తెలిసిందే. రాజమౌళి, సుకుమార్, ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకుల సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో సంచలనాలు సృష్టిస్తున్నాయి. బాలీవుడ్ సహా ఇతర భాషల స్టార్ హీరోలు టాలీవుడ్‌కు మక్కువ చూపడం పెరిగింది. ఇప్పటికే దుల్కర్, శివకార్తికేయన్, ధనుష్ లాంటి స్టార్ హీరోలు డైరెక్ట్ తెలుగు దర్శకులతో వర్క్ చేస్తుండడం విశేషం.
ఈ ట్రెండ్‌లో ఇప్పుడు రణబీర్ కపూర్ కూడా తెలుగులో స్ట్రైట్ మూవీ చేయాలని ఆసక్తి చూపుతున్నట్లు ఫిల్మ్ నగర్‌లో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం, రణబీర్ కపూర్ తన తదుపరి సినిమా కోసం ప్రముఖ తెలుగు నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో చర్చలు జరుపుతున్నట్లు టాక్. రణబీర్ కపూర్ ఇటీవల ‘యానిమల్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను శభాష్ అనిపించుకున్నారు. ఆ సినిమాలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగ, రణబీర్‌ను ఎవరూ ఊహించని విధంగా న్యూ అవతార్‌లో చూపించారు.
ఈ సినిమా రూ.700 కోట్లకు పైగా వసూలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ కాంబినేషన్ సక్సెస్ తర్వాత రణబీర్ తెలుగులో మరో క్రేజీ ప్రాజెక్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ఈ సినిమా కోసం రణబీర్ కపూర్ ఓ టాప్ తెలుగు దర్శకుడిని లైన్‌లో పెట్టినట్లు సమాచారం. ఆ దర్శకుడి పేరు ఏంటనే విషయంలో ఇంకా సరైన క్లారిటీ అయితే లేదు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ ప్రాజెక్ట్‌ను అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందించబోతున్నట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇది రణబీర్‌కు టాలీవుడ్‌లో స్ట్రైట్ ఎంట్రీ ఇవ్వడమే కాదు, తెలుగులో ఆయనకున్న ఫ్యాన్ బేస్‌ను మరింత పెంచే చాన్స్ అని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక రణబీర్ కపూర్ ప్రస్తుతానికి రెండు భారీ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టారు. రామాయణ: పార్ట్ 1 షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. అలాగే, మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘లవ్ అండ్ వార్’ కూడా షూటింగ్ దశలో ఉంది. ఈ రెండు సినిమాలు 2026లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ ప్రాజెక్ట్‌లతో పాటు టాలీవుడ్ ఎంట్రీపై కూడా ఆయన ఫోకస్ పెట్టడం అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతోంది.