'రామాయణ', 'యానిమల్ పార్క్' అప్డేట్స్ ఇచ్చిన రణ్‌బీర్
రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రణబీర్ కపూర్ మాట్లాడుతూ.. “నేను ప్రస్తుతం 'రామాయణ' అనే చిత్రంలో నటిస్తున్నాను.
By: Tupaki Desk | 9 Dec 2024 4:30 PM GMTబాలీవుడ్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న ఎపిక్ మైథలాజికల్ మూవీ ''రామాయణ''. ఇందులో రాముడిగా బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ నటిస్తుండగా, సీత పాత్రలో నేచురల్ బ్యూటీ సాయిపల్లవి కనిపించనుంది. రావణుడి క్యారక్టర్ లో కన్నడ హీరో యష్ నటిస్తున్నారు. 'దంగల్' ఫేమ్ నితీశ్ తివారీ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా రణ్‌బీర్ ఈ మూవీ షూటింగ్ అపడేట్ అందించారు. శ్రీరాముడి పాత్ర పోషించడంతో తన కల నిజమైందని అన్నారు.
రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రణబీర్ కపూర్ మాట్లాడుతూ.. “నేను ప్రస్తుతం 'రామాయణ' అనే చిత్రంలో నటిస్తున్నాను. ఇది భారతదేశపు గొప్ప కథ. దీనిని నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది ప్రతిభావంతులైన ఆర్టిస్ట్స్, క్రియేటర్స్ ఈ సినిమా కోసం పని చేస్తున్నారు. ఇది రాముడు, రావణుడిల కథ. ఎంతో గొప్ప కథ. ఈ కొత్త తరానికి సాంకేతికతతో కూడిన ఈ స్టోరీని చెప్పడం ఒక నటుడిగా నాకు చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. ముఖ్యంగా శ్రీరాముడి పాత్రను పోషించడం చాలా గొప్ప అవకాశంగా భావిస్తున్నాను'' అని అన్నారు.
''నితేష్ తివారీ దర్శకత్వంలో రెండు భాగాలుగా 'రామాయణ' సినిమా రూపొందించబడుతోంది. పార్ట్-1లో నా భాగం షూటింగ్ పూర్తి చేశాను. త్వరలోనే పార్ట్-2 చిత్రీకరణ కూడా ప్రారంభిస్తాను. ఈ కథలో భాగం కావడానికి, రాముడి పాత్రలో నటించడానికి నేను చాలా వినయంగా ఉన్నాను. ఇలాంటి పాత్రలో నటించడం నాకు ఒక కల. అన్నీ ఉన్న సినిమా ఇది. ఇది మన భారతీయ సంస్కృతి అంటే ఏమిటో బోధిస్తుంది. ఫ్యామిలీ డైనమిక్స్, భార్యాభర్తల డైనమిక్స్ ని నేర్పిస్తుంది. కాబట్టి నేను ఈ సినిమా గురించి చాలా ఉత్సాహంగా ఉన్నాను" అని రణబీర్ కపూర్ చెప్పుకొచ్చారు.
'రామాయణ' సినిమా నుంచి ఇప్పటికే సోషల్ మీడియాలో లీకైన పిక్ లో రాముడిగా రణబీర్, సీతగా సాయి పల్లవి ఆకట్టుకున్నారు. లక్షణుడిగా రవి దూబే, హనుమంతుడిగా సన్నీ డియోల్ కనిపించనున్నారు. కైకేయిగా లారా దత్తా, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. నమిత్ మల్హోత్రాతో కలిసి హీరో యష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే మేకర్స్ ఈ సినిమాని అధికారికంగా ప్రకటిస్తూ, విడుదల తేదీలను తెలుపుతూ పోస్టర్ రిలీజ్ చేసారు. 2026 దీపావళికి రామాయణ మొదటి భాగం, 2027 దీపావళికి రెండో భాగం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వెల్లడించారు. అయితే ఇప్పటికే పార్ట్-1లో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ చేసినట్లుగా రణబీర్ కపూర్ తెలిపారు. రాముడి పాత్ర కోసం డైట్ ఫాలో అవుతున్నానని, ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకు మద్యపానం మానేసినట్లు రణబీర్ ఇటీవల ఓ సందర్భంలో చెప్పారు.
ఇదిలా ఉంటే రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలోనే రణ్‌బీర్ 'యానిమల్' సినిమా గురించి కూడా మాట్లాడారు. ‘యానిమల్ పార్క్’ పేరుతో సెకండ్ పార్ట్ రానుందని, 2027లో షూటింగ్ ప్రారంభిస్తామని చెప్పారు. ఇందులో తాను డ్యూయెల్ రోల్ లో నటిస్తానని, హీరో - విలన్ రెండు పాత్రల్లోనూ కనిపిస్తానని తెలిపారు. ఫస్ట్ పార్ట్ అప్పుడే దీని పూర్తి కథను సిద్ధం చేసుకున్నారని, ఈ సినిమా ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని రణబీర్ కపూర్ చెప్పుకొచ్చారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన 'యానిమల్' సినిమా భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రభాస్ తో 'స్పిరిట్' సినిమా చేసిన తర్వాత 'యానిమల్' సీక్వెల్ పనులు మెదలుపెట్టనున్నారు.