9 వయసున్న ఆలియాతో 20 ఏళ్ల రణబీర్ ఫోటోషూట్?
దేశం మొత్తం ఆదరించినప్పుడే పాన్ ఇండియా స్టార్.. అలాంటి ఒక స్టార్ కావాలని రిషీకపూర్ ఎప్పుడూ అంటూ ఉండేవారని రణబీర్ ఇంటర్వ్యూల్లో వ్యాఖ్యానించారు.
By: Tupaki Desk | 1 Aug 2024 2:45 AM GMT'యానిమల్' సినిమాలో అద్భుత నటనతో తెలుగు వారికి కనెక్టయ్యాడు బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి అత్యంత అభిమానించే బాలీవుడ్ నటుడు రణబీర్ అన్న సంగతి తెలిసినదే. ఇటీవల పరిణామాల అనంతరం రణబీర్ కపూర్ తదుపరి సినిమాల గురించి తెలుగు యువతలోను అంతో ఇంతో ఆసక్తి నెలకొంది. సందీప్ వంగా దర్శకత్వం వహించే యానిమల్ సీక్వెల్ 'యానిమల్ పార్క్' రాక కోసం చాలా మంది ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ప్రస్తుతానికి రణబీర్ రామాయణం ఫ్రాంఛైజీలో మొదటి సినిమాతో బిజీగా ఉన్నాడు. రామాయణం -1 రిలీజ్ తర్వాత అతడి క్రేజ్ దక్షిణాదినా మరింతగా పెరుగుతుందనడంలో సందేహం లేదు. దేశం మొత్తం ఆదరించినప్పుడే పాన్ ఇండియా స్టార్.. అలాంటి ఒక స్టార్ కావాలని రిషీకపూర్ ఎప్పుడూ అంటూ ఉండేవారని రణబీర్ ఇంటర్వ్యూల్లో వ్యాఖ్యానించారు. ఇప్పుడు అతడు తన తండ్రి కలను నెరవేర్చేందుకు ముందుకెళుతున్నాడు.
అదంతా అటుంచితే రణబీర్ కపూర్ బాలీవుడ్‌లో అతిపెద్ద స్టార్లలో ఒకరైన అలియా భట్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని అత్యంత ప్రియమైన జంటలలో ఒకరిగా వెలుగొందుతున్నారు. రణబీర్ - ఆలియా జంట ఆన్ స్క్రీన్- ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీని అభిమానులు అమితంగా ఇష్టపడతారు. ఇటీవలి ఓ చాటింగ్ సెషన్‌లో రణబీర్ కపూర్ తన సతీమణి అలియాతో తన వివాహం గురించి, వారి 11 సంవత్సరాల వయస్సు అంతరం గురించి మాట్లాడారు. ఈ విషయంలో ప్రతిదీ సులభతరం చేయడానికి ఆలియా ఎక్కువగా ప్రయత్నించిందని తెలిపాడు. తాను ఆమె కోసం కంటే ఆమె తన కోసమే ఎక్కువగా మారిపోయిందని కూడా అన్నాడు. ఆలియా కోసం తాను చాలా మారాలని కూడా అంగీకరించాడు.
రణబీర్ తన పోడ్‌కాస్ట్‌లో నిఖిల్ కామత్‌తో మాట్లాడుతూ ఇలా అన్నాడు. ''నేను చాలా అదృష్టవంతుడిని.. అత్యంత సన్నిహితంగా ఉండే స్నేహితురాలిని పెళ్లాడాను. ఒకరికొకరం నిజంగా చాట్ చేసుకోవచ్చు.. నవ్వుకోవచ్చు... సంతోషంగా ఉండొచ్చు.. తను నా బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉంటుంది. అందుకే నేను నిజంగా అదృష్టవంతుడిని'' అని అన్నాడు. అంతేకాదు..ఆలియా అద్భుతమైన వ్యక్తి. చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. తను నా కంటే 11 సంవత్సరాలు చిన్నది.. ఇది చాలా ఫన్నీ'' అని వ్యాఖ్యానించాడు.
సంజయ్ లీలా భన్సాలీ బాల్య వివాహాలపై 'బాలికా వధు' అనే సినిమా తీయాలనుకున్నారు. ఆ సమయలో 9ఏళ్ల ఆలియాతో 20ఏళ్ల వయసున్న నేను ఫోటోషూట్ లో పాల్గొన్నాను. మేం మొదటి సారి కలుసుకోవడం అదే. ఇప్పుడు చెప్పడం కొంచెం విచిత్రంగా అనిపిస్తోంది! అని అన్నారు. రణబీర్ మాట్లాడుతూ, ''నేను చాలా సంవత్సరాల క్రితమే కలుసుకున్న అలియా ఎవరో.. అప్పుడే ఈ వ్యక్తి ప్రత్యేకమైనదని అనుకున్నాను. నటిగా, కళాకారిణిగా, వ్యక్తిగా తనపై నాకు అపారమైన గౌరవం ఉంది. ఆలియా నిజంగా నన్ను నవ్విస్తుంది. తనతో విహారయాత్రకు వెళ్లడం చాలా ఇష్టం. కానీ ఆమెతో ఇంట్లో ఉండడం నాకు ఇంకా ఇంకా చాలా ఇష్టం'' అని అన్నారు. నేను ఆలియా కోసం మారిన దానికంటే ఆమె నా కోసం ఎక్కువగా మారిపోయింది. నేను దానిని అంగీకరిస్తున్నాను.. కానీ నేను తన గురించి ఏదైనా చేయాలి. నేను కొంచెం మారాలి.. అని కూడా అన్నాడు. ఆలియా తెలివైన అఛీవర్ అని కూడా ప్రశంసించాడు.