Begin typing your search above and press return to search.

స్టార్ హీరోకి ED స‌మ‌న్ల క‌ల‌క‌లం.. అస‌లేమైంది?

ఇటీవ‌ల బాలీవుడ్ లో ఎలాంటి వివాదాలు లేకుండా ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డటంతో మీడియాలో ఎలాంటి సంచ‌ల‌న క‌థ‌నాలు వెలువ‌డ‌లేదు

By:  Tupaki Desk   |   5 Oct 2023 4:24 AM GMT
స్టార్ హీరోకి ED స‌మ‌న్ల క‌ల‌క‌లం.. అస‌లేమైంది?
X

ఇటీవ‌ల బాలీవుడ్ లో ఎలాంటి వివాదాలు లేకుండా ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డటంతో మీడియాలో ఎలాంటి సంచ‌ల‌న క‌థ‌నాలు వెలువ‌డ‌లేదు. కానీ ఇప్పుడు ప్ర‌ముఖ స్టార్ హీరోకి ఈడీ స‌మ‌న్లు పంపింద‌న్న ప్ర‌చారంతో వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా వేడెక్కింది. అయితే స్టార్ హీరోకి స‌మ‌న్లు పంప‌డానికి కార‌ణ‌మేమిటీ? అంటే వివ‌రాల్లోకి వెళ్లాలి. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింద‌ని తాజాగా జాతీయ మీడియాలో క‌థ‌నాలు వెలువ‌డ‌డం క‌ల‌క‌లం రేపింది. దీనికి కార‌ణాల‌పై వెంట‌నే సోష‌ల్ మీడియాల్లో ఆరాలు మొద‌ల‌య్యాయి. ఇంత‌కీ అత‌డికి స‌మ‌న్లు పంప‌డం వెన‌క కార‌ణ‌మేమిటి?


ED వివ‌రాల‌ ప్రకారం.. మహాదేవ్ ఆన్‌లైన్ బుక్ బెట్టింగ్ యాప్ అనే గొడుగు సిండికేట్ తో ర‌ణ‌బీర్ సంబంధాలు తీవ్ర క‌ల‌క‌లం రేపుతున్నాయి. మ‌హ‌దేవ్ బెట్టింగ్ యాప్ చట్టవిరుద్ధమైన బెట్టింగ్ వెబ్‌సైట్‌లలో కొత్త వినియోగదారులను నమోదు(రిజిస్ట‌ర్) చేసుకోవడానికి, వినియోగదారు IDలను సృష్టించడానికి స‌హ‌క‌రిస్తుంది. ఇందులో న‌ల్ల‌ధ‌న ప్ర‌వాహం అనే కోణంపైనా సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. వినియోగ‌దారుల‌ బినామీ బ్యాంకు ఖాతాల నుంచి న‌ల్ల‌ డ‌బ్బును లేయర్డ్ వెబ్ ద్వారా తెల్లధ‌నంగా మార్చడంలో యాప్ లు స‌హ‌కరిస్తున్నాయ‌ని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో పలువురు బాలీవుడ్ స్టార్లు, క్రీడా ప్రముఖులను కూడా ఈడీ ప్రశ్నించే వీలుంద‌ని తెలుస్తోంది. మహాదేవ్ యాప్ ప్రమోటర్లు ఇలాంటి 4-5 యాప్‌లను నడుపుతున్నారని, ఇవన్నీ యుఎఇ నుండి ఆపరేట్ అవుతున్నాయని ఇడి అధికారులు భావిస్తున్నారు. యాప్‌లు రోజుకు కోట్లాది రూపాయల లాభాలను ఆర్జిస్తున్నాయి. బెట్టింగ్‌ల ద్వారా వచ్చిన సొమ్మును ఆఫ్‌షోర్ గమ్యస్థానాలకు తరలించేందుకు పెద్ద ఎత్తున హవాలా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు ఈడీ అధికారులు చెబుతున్నారు.

ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ కేసుకు సంబంధించి బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేయ‌డ‌మే గాక‌... అక్టోబర్ 10న విచారణ సంస్థ ముందు హాజరుకావాలని ఆదేశించింది. ఈ కేసులో ర‌ణ‌బీర్ త‌ప్పిద‌మేంటి? అంటే.. స‌ద‌రు ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్ కోసం రణబీర్ కపూర్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ప‌ని చేస్తున్నారు. యాప్ తరపున ప్రమోషనల్ యాక్టివిటీస్ నిర్వహించి చెల్లింపులు అందుకున్నట్లు సమాచారం.

ఈ కేసు ఇప్పుడు దర్యాప్తు సంస్థ పరిశీలనలో ఉన్న బాలీవుడ్ నటులు, గాయకులు, హాస్యనటులు సహా పలువురు ఉన్నత స్థాయి ప్రముఖులపై నీలినీడలు కమ్ముకున్నాయ‌ని తెలిసింది. దుబాయ్‌లో జరిగిన ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కో-ప్రమోటర్ సౌరభ్ చంద్రకర్ భారీ వివాహంలో వారు పాల్గొనడంపై దర్యాప్తు అధికారుల‌ దృష్టి కేంద్రీకృతమై ఉందని తెలుస్తోంది. యాప్ ల వేదిక‌గా కొనసాగుతున్న మనీలాండరింగ్ కేసులో ఈ సెలబ్రిటీలలో కొందరిని సాక్షులుగా పిలిచే అవకాశం ఉందని ఏజెన్సీ వర్గాలు చెబుతున్నాయి.

మహాదేవ్ ఆన్‌లైన్ బుక్ యాప్‌తో అనుబంధం ఉన్న మనీలాండరింగ్ నెట్‌వర్క్‌లను వెలికితీసే ప్రయత్నాల్లో భాగంగా కోల్‌కతా, భోపాల్, ముంబై సహా వివిధ నగరాల్లో ED విస్తృతంగా సోదాలు నిర్వహించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉన్న ఈ బెట్టింగ్ ప్లాట్‌ఫారమ్ పెద్ద ఎత్తున హవాలా కార్యకలాపాలలో ప్రమేయం ఉంద‌ని అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ వేదికను బెట్టింగ్ ఆదాయాన్ని ఆఫ్‌షోర్ ఖాతాలకు బదిలీ చేయడానికి ఉపయోగిస్తున్నార‌ని అధికారులు విశ్లేషించారు.

మహాదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ను ప్రచారం చేయడం ద్వారా ర‌ణ‌బీర్ కపూర్ చట్టాలను ఉల్లంఘించారా? అనే దానిపై ED దర్యాప్తు చేస్తోంది. అతడు ప్లాట్‌ఫారమ్‌తో లేదా దాని ప్రమోటర్లతో ఏమైనా ఆర్థిక సంబంధాలు కలిగి ఉన్నాడా? లేదా కేవ‌లం ప్ర‌చార‌క‌ర్త‌గానే ఉన్నాడా? అత‌డి నేరం స్థాయి ఎలాంటిది? అనేది కూడా ఏజెన్సీ పరిశీలిస్తోంది.