Begin typing your search above and press return to search.

స్టార్ క‌పుల్ 150కోట్ల 'రియ‌ల్' పెట్టుబ‌డి

ఇంత‌కుముందు ర‌ణ్ వీర్ సింగ్ కోట్లాది రూపాయ‌ల విలువ చేసే అపార్ట్ మెంట్ల‌లో పెట్టుబ‌డులు పెట్టి, ఆ త‌ర్వాత వాటిని భారీ లాభాల‌కు అమ్మేశాడు.

By:  Tupaki Desk   |   19 Sep 2024 7:49 AM GMT
స్టార్ క‌పుల్ 150కోట్ల రియ‌ల్ పెట్టుబ‌డి
X

రియ‌ల్ ఎస్టేట్‌లో పెట్టుబ‌డులు పెట్టి భారీగా లాభాలార్జించ‌డం ఎలానో బాలీవుడ్ స్టార్ల‌కు తెలిసినంత‌గా మ‌రెవ‌రికీ తెలీదేమో! బిగ్ బి అమితాబ్ కుటుంబం, బోనీ క‌పూర్ కుటుంబం, ఇత‌ర‌ చాలా మంది అగ్ర హీరోలు, అప్ క‌మింగ్ స్టార్లు కూడా రియ‌ల్ వెంచ‌ర్ల‌లో భారీగా పెట్టుబ‌డులు పెడుతున్నారు. ముంబై, ఆ చుట్టు ప‌క్క‌ల ఎదుగుద‌ల‌కు ఆస్కారం ఉన్న ప్రాంతాల‌ను ఎంచుకుని కోట్లాది రూపాయ‌ల పెట్టుబ‌డుల్ని రియ‌ల్ ఎస్టేట్ లో వెద‌జ‌ల్లుతున్నారు.

ర‌ణ్ వీర్ సింగ్- దీపిక ప‌దుకొనే కుటుంబం కూడా ఈ ఆట‌లో దూకుడుగానే ఉంది. ఇంత‌కుముందు ర‌ణ్ వీర్ సింగ్ కోట్లాది రూపాయ‌ల విలువ చేసే అపార్ట్ మెంట్ల‌లో పెట్టుబ‌డులు పెట్టి, ఆ త‌ర్వాత వాటిని భారీ లాభాల‌కు అమ్మేశాడు. ఇప్పుడు ముంబైలోని బాంద్రా వెస్ట్ ఏరియాలో దీపికా పదుకొనే కంపెనీ రూ.17.8 కోట్లతో అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసింది. దీపికా పదుకొణె సంస్థ కెఏ ఎంటర్‌ప్రైజెస్ 1845 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసిందని జాప్‌కీ డాట్ కాం వెల్ల‌డించింది. దీపిక‌ అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసిన సాగర్ రేషమ్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీని ఎనార్మ్ నాగ్‌పాల్ రియాల్టీ అభివృద్ధి చేసింది. ఇది 4బిహెచ్‌కే , 5 బిహెచ్‌కే అపార్ట్‌మెంట్‌లను సేల్ చేస్తోంది. దీపిక కొనుగోలు చేసిన‌ ఫ్లాట్ 15వ అంతస్తులో ఉంది. బిల్ట్-అప్ ఏరియా రేటు చదరపు అడుగులకు రూ.96,400. ఈ డీల్‌లో స్టాంప్ డ్యూటీ దాదాపు రూ. 1.07 కోట్లు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు రూ. 30,000 అని పత్రాలు వెల్ల‌డిస్తున్నాయి.

స్థానిక బ్రోకర్ల వివ‌రాల‌ ప్రకారం.. బాంద్రా రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో ప్రతి చదరపు అడుగు రేటు ఆస్తి ఉన్న‌ ప్రాంతం, వయస్సు ఆధారంగా చదరపు అడుగులకు రూ.50,000 నుండి రూ.1.50 లక్షల వరకు ఉంటుంది. కార్టర్ రోడ్, బ్యాండ్‌స్టాండ్, పాలి హిల్ వంటి అనేక ప్రాంతాలు చదరపు అడుగు విలువ రూ. 1ల‌క్ష పైగానే ఉంది.

అలాగే ర‌ణ్ వీర్ సింగ్ త‌న త‌ల్లి గారు నివ‌శించే భ‌వంతిలోనే మ‌రో ఆఫీస్ స్పేస్ ని అద్దెకు తీసుకున్నారు. జాప్ కీ వివ‌రాల ప్ర‌కారం.. సంబంధిత డీల్‌లో రణ్‌వీర్ సింగ్ కంపెనీ RS ఫిల్మ్‌క్రాఫ్ట్ (OPC) ప్ర‌యివేట్ లిమిటెడ్ అతడి తల్లి రితికా జగ్జీత్ సింగ్ భవ్నానీ ఉండే చోటి నుంచి పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌ను 5 సెప్టెంబర్ 2024న నెలకు రూ.8.2 లక్షల చొప్పున‌ అద్దె చెల్లిస్తూ లీజుకు తీసుకుంది. చెల్లించిన సెక్యూరిటీ డిపాజిట్ రూ.73.8 లక్షలు. రణవీర్ సింగ్ కంపెనీ 55 నెలల కాలానికి లీజు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. మొదటి 33 నెలల అద్దె నెలకు రూ. 8.2 లక్షలు. తదుపరి 22 నెలల్లో నెలకు రూ.9.43 లక్షలకు పెరుగుతుందని పేర్కొంటూ ఒప్పందంలో పెరుగుద‌ల‌ను రాసుకున్నారు. రణ్‌వీర్ తల్లి అంజు భవ్నానీ ఈ నెల ప్రారంభంలో (సెప్టెంబర్ 5) రూ.19.13 కోట్లతో అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు. ఈ ఆస్తి 1,822.45 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఈ డీల్‌కు స్టాంప్ డ్యూటీ స్క్వేర్ యార్డ్స్ షేర్ చేసిన డాక్యుమెంట్ ప్ర‌కారం.. రూ.30,000 రిజిస్ట్రేషన్ ఫీజుతో 95.68 లక్షలు చెల్లించారు.

మీడియా క‌థ‌నాల‌ ప్రకారం దీపిక‌-ర‌ణ‌వీర్ జంట కొనుగోలు చేసిన మరొక ఆస్తి షారూఖ్ ఖాన్ రాజభవన గృహమైన `మన్నత్‌`కు సమీపంలోని బాంద్రా బ్యాండ్‌స్టాండ్‌లో సముద్రానికి ఎదురుగా ఉన్న క్వాడ్రప్లెక్స్. ఇది 11,266 చదరపు అడుగుల అంతర్గత స్థలం.. అదనంగా 1300 చదరపు అడుగుల టెర్రేస్ స్థలంలో విస్తరించి ఉంది. ఇది భవనంలోని 16 నుండి 19 అంత‌స్తుల‌ వరకు - నాలుగు అంతస్తులలో విస్త‌రించి ఉంది. దీని విలువ రూ.100 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. ఈ జంట 2021లో అలీబాగ్‌లో రూ.22 కోట్ల విలువైన బంగ్లాను కూడా కొనుగోలు చేశారు. ఓవ‌రాల్ గా ర‌ణ్ వీర్- దీపిక కేవ‌లం రియ‌ల్ ఎస్టేట్ లోనే 150 కోట్లు పైగా పెట్టుబ‌డి పెట్టార‌ని, దాని విలువ ఇప్పుడు అమాంతం పెరిగింద‌ని కూడా విశ్లేషిస్తున్నారు.

దీపికా పదుకొణె - రణ్‌వీర్ సింగ్ 2024 దీపావళి పండుగకు రిలీజ్ కానున్న‌ `సింగం ఎగైన్‌`లో కనిపించనున్నారు. రోహిత్ శెట్టి తెర‌కెక్కించిన ఈ చిత్రంలో అజయ్ దేవగన్, కరీనా కపూర్, అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ కూడా ప్రధాన పాత్రలు పోషించారు. రణ్‌వీర్ ఇటీవలే సంజయ్ దత్, ఆర్ మాధవన్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్‌లతో క‌లిసి తన కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించాడు. ఫర్హాన్ అక్తర్ `డాన్ 3`లో కూడా ర‌ణ్ వీర్ నటించనున్నాడు. దీపిక ఇటీవ‌లే పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన సంగ‌తి తెలిసిందే. త‌దుప‌రి క‌ల్కి 2లో న‌టించాల్సి ఉంది.