చివరికి 'శక్తిమాన్' ఎవరిని వరించునో?
అందువల్ల శక్తిమాన్ పునరాగమనంలో ఆ పాత్రలో నటించే స్టార్ ఎవరు? అన్న చర్చ సాగుతోంది.
By: Tupaki Desk | 6 Dec 2024 2:45 AM GMTసూపర్ హీరో ఫ్రాంఛైజీల ప్రారంభ దశలోనే శక్తిమాన్ పాత్ర భారతీయ బుల్లితెర వీక్షకుల్లో ఒక సంచలనం. ఈ పాత్రను తలవగానే ప్రముఖ నటుడు ముఖేష్ ఖన్నా గుర్తుకు వస్తారు. ఆయన అద్భుత నటప్రదర్శన, అభినయం గుర్తుకు వస్తుంది. అయితే ఆయన ఇప్పుడు ఏజ్డ్ పర్సన్. అందువల్ల శక్తిమాన్ పునరాగమనంలో ఆ పాత్రలో నటించే స్టార్ ఎవరు? అన్న చర్చ సాగుతోంది.
నిజానికి శక్తిమాన్ పాత్రలో నటించాలని రణవీర్ సింగ్ కలలు కన్నాడు. అతడు నేరుగా హక్కుదారు అయిన సీనియర్ నటుడు ముఖేష్ ఖన్నాను కలిసి అభ్యర్థించాడు. చాలా ప్రయత్నించారు. కానీ శక్తిమాన్ పాత్ర హక్కుల్ని దఖలు పరిచేందుకు సిద్ధంగా లేనని అతడు అన్నారు. ఆ పాత్రలో రణవీర్ సింగ్ సరిపోడని అతడు భావించారు. రణవీర్ ప్రవర్తన అంతగా సూట్ కాదని కూడా అతడు అన్నారు.
ఇదిలా ఉండగానే... `యానిమల్` చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న రణబీర్ కపూర్ తో ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్లాలని అతడి అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. ఒకవేళ రణవీర్ స్థానంలో రణబీర్ కపూర్ ఈ పాత్రలో నటించేందుకు ఆసక్తి కనబరిచి.. అతడు నేరుగా ముఖేష్ జీని కలిసి అనుమతి కోరితే బావుంటుందని కూడా సూచిస్తున్నారు.
శక్తిమాన్‌ని ఫీచర్ ఫిల్మ్‌గా రూపొందించే హక్కులను సోనీ ఇండియా దక్కించుకున్నప్పటి నుండి మార్కెట్ వర్గాల్లో రకరకాల చర్చ సాగుతోంది. కానీ ఫైనల్ గా హీరో ఎవరు? అనే సస్పెన్స్ వీడలేదు. ఇది అంత సులువుగా జరిగేదిగా కూడా కనిపించడం లేదని విశ్లేషిస్తున్నారు. ఈ చిత్రం 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కనుందని, అంత పెద్ద మార్కెట్ ని కొల్లగొట్టే సత్తా ఉన్న స్టార్ ని ఎంపిక చేయాలని కూడా చిత్రబృందం భావిస్తోందట. ఇప్పటివరకూ శక్తిమాన్ గా ఎవరూ ఎంపిక కాలేదు. ఇంతకీ శక్తిమాన్ ఎవరిని వరించునో వేచి చూడాలి.