రన్యారావుకు 12ఎకరాల భూమిలో 138కోట్లతో మినీ స్టీల్ ప్లాంట్?
2023లో కర్ణాటక పారిశ్రామిక ప్రాంతాల అభివృద్ధి బోర్డు 12 ఎకరాల పారిశ్రామిక భూమిని రన్యారావు కోసం కేటాయించింది.
By: Tupaki Desk | 10 March 2025 10:03 AM ISTకన్నడ నటి రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే. 14.8 కిలోల బంగారాన్ని అధికారులు గుర్తించిన అనంతరం బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేసారు. రన్యారావు ప్రముఖ డీజీపీ కుమార్తె కావడం విస్తుగొలిపే విషయం. తాజా సమాచారం మేరకు.. రన్యారావుకు కోట్లాది రూపాయల విలువ చేసే 12 ఎకరాల భూమిని కర్నాటక ప్రభుత్వం కట్టబెట్టిన విషయం బయటపడింది. 2023లో కర్ణాటక పారిశ్రామిక ప్రాంతాల అభివృద్ధి బోర్డు 12 ఎకరాల పారిశ్రామిక భూమిని రన్యారావు కోసం కేటాయించింది.
2023 జనవరిలో బసవరాజ్ బొమ్మై సారథ్యంలోని బిజెపి ప్రభుత్వం రన్యా, ఆమె సోదరుడు రుషబ్ డైరెక్టర్లుగా ఉన్న క్సిరోడా ప్రైవేట్ లిమిటెడ్‌కు భూమిని మంజూరు చేసింది. ఆమె కంపెనీ స్టీల్ టిఎంటి బార్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి రూ.138 కోట్లు పెట్టుబడి పెడతామని హామీ ఇచ్చింది. ఈ భూమి తుమకూరు జిల్లాలోని సిరా పారిశ్రామిక ప్రాంతంలో ఉంది. 137వ రాష్ట్ర స్థాయి సింగిల్ విండో క్లియరెన్స్ కమిటీ (SLSWCC) సమావేశంలో కేటాయింపునకు ఆమోదం లభించింది.
ఇప్పుడు మెస్సర్స్ క్సిరోడా కంపెనీ అధినాయకురాలు రన్యారావు బంగారం స్మగ్లింగ్ కేసులో చిక్కుకోవడంతో ఇది సమస్యల్లో పడనుందని సమాచారం. రన్యారావు కంపెనీ స్టీల్ టిఎంటి బార్‌లు, రాడ్‌లు ఇతర అనుబంధ ఉత్పత్తుల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనను పంపారు. ఈ ప్రాజెక్ట్ సుమారు 160 ఉద్యోగాలను సృష్టిస్తుందని అంచనా. మెస్సర్స్ క్సిరోడా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 21 ఏప్రిల్ 2022న స్థాపించామని, బెంగళూరులో ఇది ఉందని కంపెనీ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపారు. కేటాయించిన భూమిని కంపెనీకి అప్పగించారా లేదా అన్నదానిపై పారిశ్రామిక శాఖ వెల్లడించాల్సి ఉంది.